Home » ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మరో పదేళ్లు

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మరో పదేళ్లు

-హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా మరో 10 సంవత్సరాలు పొడిగించాలి
-ఆస్తులు, నీళ్లు పరిష్కారం తూతూమంత్రంగా
-విద్యావకాశాలు, ఉపాధి కోల్పోతున్న యువత
-10 ఏళ్ల పాలనలో హైదరాబాద్ లాంటి నగరం నిర్మించలేని రాష్ట్ర ప్రభుత్వాలు
-అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాడాలి
-మాజీ మంత్రి డా.సాకే శైలజానాథ్ డిమాండ్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌తో తెలంగాణకు ఉన్న ఉమ్మడి రాజధాని బంధం నేటితో ముగియునున్న సందర్భంలో మాజీ పీసీసీ చీఫ్ డా సాకే శైలజానాథ్ విచారం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా మరో 10 సంవత్సరాలు పొడిగించాలని డిమాండ్ చేశారు. జూన్‌ 2న తెలంగాణ స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. రాష్ట్రం విభజన సమయంలో ఇచ్చిన హామీలు పరిష్కరింపబడకుండానే శాశ్వత ముగింపు పడిందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో హైదరాబాద్‌ను తెలంగాణకు శాశ్వత రాజధానిగా, ఏపీ రాష్ర్టానికి పదేండ్ల పాటు తాత్కాలిక, ఉమ్మడి రాజధానిగా కేంద్రం ప్రకటించిన విషయం అందరికీ తెలిసిన విషయమేనని ఆయన తెలియజేసారు.

విభజన చట్టం సెక్షన్‌-8 ప్రకారం హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని ప్రాంతంలో పౌరుల రక్షణ బాధ్యతను గవర్నర్‌కు అప్పగించారని, ఉమ్మడి రాజధానిలో నివసించే ప్రజల ప్రాణ, ఆస్తి, రక్షణ భద్రతలను కాపాడే బాధ్యతలను గవర్నర్‌ చేతిలో ఉండేవని, అందువలన ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుండి చాలా మంది ప్రజలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తాత్కాలిక నివాసం ఏర్పరుచుకున్నారని, మరి రేపటినుండి ఈ ప్రజల, ఆస్తులు రక్షణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం ఏమేరకు బాధ్యత తీసుకుంటుందని శైలజానాథ్ ప్రశ్నించారు.

సెక్షన్‌-95 ప్రకారం విద్యార్థులకు పదేండ్ల పాటు ఉన్నత విద్యలో అవకాశాలు కల్పించాలని, ఆర్టికల్‌ -317 డీ ప్రకారం అడ్మిషన్ల కోటా పదేండ్ల వరకు కొనసాగించాలని, ఎమ్సెట్‌ సహా 7 రకాల ప్రవేశ పరీక్షల కూడా ఉమ్మడిగా నిర్వహించేవారని ఆయన గుర్తుచేశారు. ఇప్పటి వరకు ఆ పరీక్షల నోటిఫికేషన్లు జూన్‌ 2కు ముందే విడుదల కావటంతో ఉమ్మడి విద్యార్థి, విద్యార్థినిలకు అవకాశం కలిగిందని శైలజానాథ్ తెలిపారు. ఈ ఒక్క విద్యా సంవత్సరం మాత్రమే ఏపీ విద్యార్థులకు తెలంగాణలో సీట్లు కేటాయిస్తారని, వచ్చే ఏడాది నుండి విద్యార్థుల భవిష్యత్తు అయోమయంలో పడిపోయిందని ఆయన ఆరోపించారు.

10 ఏళ్లలో అనేక సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయని, కృష్ణా, గోదావరి జలాల పంపిణీ గుదిబండగా మారిందని, అపెక్స్‌ కమిటీలు, నదీ యాజమాన్య బోర్డుల మధ్యే నలుగుతున్నదని, దీనిపై కేంద్రం ఎటూ తేల్చకపోవటం పై శైలజానాథ్ ఆగ్రహం వ్యక్త పరిచారు. రాష్ట్ర విభజన చట్టం తొమ్మిదో షెడ్యూల్‌లోని ప్రభుత్వ సంస్థలు, పదో షెడ్యూల్‌లోని సంస్థల విభజన తేలలేదని, 68 సంస్థల విభజనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ తెలిపినప్పటికి ఏపీ ప్రభుత్వం ముందుకురాకపోవటంతో వీటి విభజన పూర్తికాలేదని తెలిపారు, ఆస్తుల పంపిణీ వివాదాలు, ప్రభుత్వ కార్యాలయాల స్వాధీనం ఇంకా జరగలేకపోవటం సిగ్గుచేటని ఆయన అన్నారు.

స్థానికత ఆధారంగా ఉద్యోగులను కేటాయించాలని ఉద్యోగసంఘాలు కోరినా ఇప్పటి వరకు ఇరు ప్రభుత్వాలు దానిపై దృష్టి పెట్టకపోవటం దురదృష్టకరమని అన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను గాలికొదిలేసారని దుయ్యబట్టారు. ఇన్ని సమస్యలు పరిష్కారం కాకుండానే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గా కోల్పోవడం తో ఆంధ్రప్రదేశ్ కు భవిష్యత్తు లో అనే కష్టాలు అలుముకుంటాయని, ముఖ్యంగా విద్యార్థులు, యువత పెద్ద ఇబ్బందులు ఎదుర్కుంటారని ఆయన తెలిపారు.

గత 10 సంవత్సరాలలో ఏపీ కి రాజధాని కూడా లేకుండా పోయిందని, వ్యక్తిగత పౌరుషాలతో రాష్ట్ర లో కనీసం ఒక్కటటంటే ఒక్క మహా నగరాన్ని కూడా ఈ ప్రభుత్వాలు నిర్మించలేదని విమర్శించారు. ఇకనైనా అన్నీ రాజకీయ పార్టీలు వాళ్ళ ఎజెండా ప్రక్కన పెట్టి కలిసి వచ్చే ప్రజా సంఘాలను కలుపుకుని ఏపీ రాజధానిని నిర్మించుకునే వరకూ హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని గా 2014 పునర్విభజన చట్టాన్ని సవరించి కొనసాగించాలని శైలజానాథ్ పిలుపునిచ్చారు.

Leave a Reply