విశ్వనాధ్ మృతి చాలా బాధాకరం

– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

ప్రముఖ దర్శకులు, కళా తపస్వి విశ్వనాధ్ మృతి చాలా బాధాకరమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. విశ్వనాద్ మరణ వార్తను తెలుసుకున్న మంత్రి శుక్రవారం ఫిల్మ్ నగర్ లోని నివాసానికి వెళ్ళి విశ్వనాధ్ పార్దీవ దేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సంస్కృతి, సాంప్రదాయాలు, కళల విశిష్టతను చాటి చెప్పే విధంగా అనేక చిత్రాలను నిర్మించిన గొప్ప దర్శకులు అన్నారు. కుల వ్యవస్థ, వరకట్నం వంటి సామాజికస్పృహ కల్పించే అనేక చిత్రాలను నిర్మించారని చెప్పారు.

తెలుగుదనం ఉట్టిపడే విధంగా కూడా దాదాపు 60 కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారని వివరించారు. శంకరాభరణం, సాగర సంగమం, సిరివెన్నెల, స్వర్ణకమలం వంటి అనేక గొప్ప గొప్ప చిత్రాలు ఆయన కు ఎంతో గుర్తింపు తీసుకొచ్చాయని చెప్పారు. చిత్ర పరిశ్రమకు చెందిన వారే కాకుండా తన వద్దకు వచ్చే ప్రతి ఒక్కరిని ఎంతో ఆప్యాయంగా పలకరించే వారని గుర్తుచేసుకున్నారు.

ఆయన సేవలకు గుర్తింపుగా పద్మశ్రీ, దాదా సాహెబ్ పాల్కే అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డు లతో ఆయనను ఎంతో గౌరవించుకోవడం జరిగిందని అన్నారు. విశ్వనాధ్ గారి మృతి తెలుగు సినీ పరిశ్రమకే కాకుండా అభిమానులకు కూడా తీరని లోటు అని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్ధించారు.

Leave a Reply