– గెలిచే సత్తా లేని పుత్రుడు, దత్తపుత్రుడిని నమ్ముకున్న బాబు, జగన్ గారి సత్తా గురించి మాట్లాడటమా..?
– బాబు రాయలసీమ యాత్రలో “ఆవేదనే ఆవేదన.. చిందులే చిందులు”
-అధికార, కుల పిచ్చి కరోనా కంటే ప్రమాదకరమనే బాబును ఓడించారు
– రాయలసీమకు బాబు చేసిందేమిటి..?
– బాబు సీట్లు అమ్మగలడు.. కొనగలడు
– టీజీ వెంకటేష్ కు రాజ్యసభ సీటు ఇచ్చావా.. అమ్మావా.. బాబూ..?
– కర్నూలుకు న్యాయ రాజధాని రాకుండా అడ్డుపడింది తానే అని బాబు ఎందుకు చెప్పడు?
– పులివెందుల గురించి మాట్లాడే అర్హత బాబుకు లేదు.. కుప్పంలో బాబును విశ్వసించడం లేదు
– గడపగడపకు వెళ్ళి మేము ఇది చేశాం అని చెబుతున్నాం.. చంద్రబాబు ఎందుకు చెప్పలేడు..?
– బుగ్గన గురించి పెళ్ళాల భాషా.. అదే మేం మాట్లాడితే ఏడుపెందుకు బాబూ..?
– రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రెస్ మీట్
మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
బాబు అర్హుడా…!?
గత మూడు రోజులుగా చంద్రబాబు నాయుడు కర్నూలు, వైఎస్ఆర్ కడప, అనంతపురం జిల్లాల్లో పర్యటిస్తూ పిచ్చిపట్టినట్టుగా ఆయన మాట్లాడే మాటలు, ఆయన వేస్తున్న చిందులు, రంకెలు చూస్తే.. ఆయన చేస్తున్నది అధికారం కోసం “ఆవేదనే ఆవేదన… ఆరాటమే ఆరాటం” కార్యక్రమం అని ప్రజలందరికీ అర్థమవుతుంది. 151 సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్ అనర్హుడా..!? 23 సీట్లు మాత్రమే తెచ్చుకున్న బాబు అర్హుడా.!?.
– అధికారంలోకి తక్షణమే చంద్రబాబు రావాలట. అదికూడా ఎలక్షన్స్ వరకూ ఆగలేడట. అదేమంటే ఎన్నికలు త్వరలో వచ్చేస్తున్నాయని కట్టుకథలు చెబుతున్నాడు. మనిషికి ఆక్సిజన్ లేకపోతే ఎలా బతకలేడో… అలాగే చంద్రబాబు నాయుడుకు అధికారంలేకపోతే బతకలేడు సరికాదా పిచ్చెక్కిపోతోంది. అధికారం ఇక రాదని తెలిసిన తర్వాత, మరింతగా పిచ్చి తారాస్థాయికి వెళ్ళి గంగవెర్రులు ఎత్తిపోతున్నాడు. ఎక్కడకు వెళ్లినా చిందులే చిందులే, ఆవేశంతో అక్కరలేని మాటలు మాట్లాడుతున్నాడు.
కలియుగంలో రావణ సంతతి బాబు అండ్ కో
త్రేతాయుగంలో రావణాసురుడు సంతతి లంకలో పుట్టారు. కలియుగంలో రావణాసురుడి సంతతి చంద్రబాబు అండ్ కో రూపంలో ఆంధ్రప్రదేశ్‌లో పుట్టినట్లు ఉన్నారు. వీళ్లే ఆంధ్రరాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కూడా చంద్రబాబు సర్వనాశనం చేశాడు. అవకాశం దొరికితే భారతదేశాన్ని సర్వనాశనం చేయగల వ్యక్తి చంద్రబాబు. రాయలసీమలో పర్యటిస్తూ.. ఇంతటి అపూర్వ స్వాగతం ఎక్కడా లభించలేదని తనకుతాను చంద్రబాబు డబ్బా కొట్టుకుంటున్నాడు.
రాయలసీమకు ఏం చేశావు బాబూ..?
తొమ్మిదేళ్లు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, మొత్తం 14ఏళ్ల రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రాయలసీమకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. సీమ నుంచి అనేకమంది నాయకులు వచ్చారు. రాయలసీమ అనగానే పౌరుషవంతులు, ఉన్నది ఉన్నట్లు చెప్పేవాళ్లు, భోళామనుషులు అనే మాట ఉంది. రాయలసీమలో చంద్రబాబు ఎలా పుట్టారో తెలియదు కానీ, సీమలో పులులు పుట్టారు కానీ… చంద్రబాబు మాత్రం నక్క. ఆయనవన్నీ నక్కజిత్తులే. అధికారం కోసం ఎంతటికైనా దిగజారిపోయే వ్యక్తిత్వం చంద్రబాబుది. 14ఏళ్లు రాష్ట్రాన్ని పాలన చేసిన మీరు.. ఏం చేశావో చెప్పుకోలేవు కానీ, జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడం, ఓర్వలేనితనంగా, ఆయనను దూషించడం చేస్తున్నారు.
సీబీఐ గురించి నాడొక మాట.. నేడొక మాటా..?
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీబీఐని ఏమన్నారో మీరు మర్చిపోయినా.. ప్రజలు మర్చిపోరు. సీబీఐ, ఈడీలు ఆంధ్రప్రదేశ్‌కు వస్తే దండయాత్రకు వచ్చినట్టే అని ఆరోజు మాట్లాడిన నోటితోనే… ఇవాళ సీబీఐ గురించి గొప్పగా మాట్లాడుతున్నాడు. రెండు నాల్కల ధోరణి ఉన్నచంద్రబాబు రాజకీయ ఊసరవెల్లి. రంగులు మార్చే రాజకీయ నాయకుడు అని అందరికీ అర్థమైపోయింది. మీ బండారం బయటపడిపోయింది. అందుకే మిమ్మల్ని జనం ఛీకొట్టి మూలన కూర్చోపెట్టినా… మీరు మాత్రం మూలన కూర్చోకుండా రాష్ట్రమంతా తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఆశ పడుతున్నావు. అయితే మీరు మళ్ళీ అధికారంలోకి రావటం కల్ల అని, అందరికంటే మీకే బాగా తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. అయినా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నావు.
టీజీ వెంకటేష్ కు రాజ్యసభ సీటు ఇచ్చావా? అమ్మావా?
14ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పినవాడినని చెప్పుకునే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభ సీట్ల కేటాయింపుల్లో ఏంచేశాడో రాష్ట్ర ప్రజలకు తెలియదా.. ? టీజీ వెంకటేష్ కు రాజ్యసభ టిక్కెట్ ఇచ్చావా? అమ్మావా? ఆయన దగ్గర ఎంత తీసుకుని రాజ్యసభ సీటు ఇచ్చారో మరి? పొరుగు రాష్ట్రం గురించి మాట్లాడే చంద్రబాబు తన హయాంలో సురేష్ ప్రభు, నిర్మలా సీతారామన్‌కు ఎలా టిక్కెట్ ఇచ్చారు? బాబు చేస్తే రైట్. మేము చేస్తే తప్పా? సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు ఎంత మేధావులని వారికి రాజ్యసభ టిక్కెట్లు ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు? డబ్బు సంచులు మోశారు అనే కదా?వాళ్లకు టిక్కెట్‌లు ఇచ్చింది.
– ఆర్. కృష్ణయ్యకు మేము రాజ్యసభ టిక్కెట్ ఇచ్చాం. బీసీ జాతీయ నాయకుడిగా గుర్తించి ఇచ్చాం. రాజ్యసభలో బీసీల గళం వినిపించాలనే దృక్పధంతో ఇచ్చాం. తద్వారా, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల హక్కులు కాపాడబడతాయనే ఇచ్చాం. ఈ రాష్ట్రంలో బీసీలకు ఇవ్వాల్సిన షేర్ వారికి ఇవ్వాలని జగన్ మోహన్ రెడ్డి ఆలోచన చేసి ఇస్తే మీ కడుపు మంట ఎందుకు చంద్రబాబూ?. టికెట్లు అమ్ముకునే లక్షణం మాకులేదు. అదే చంద్రబాబు టికెట్లు అమ్మగలడు, కొనగలడు. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డితో పాటు చంద్రబాబు కూడా పచ్చిగా దొరికిపోయారు. దానికి భయపడి మీ తెలుగుదేశం పార్టీని కొన్నాళ్లపాటు భారతీయ జనతా పార్టీకి తాకట్టు పెట్టావు. అలాంటి మీరు ఇవ్వాళ జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని చెబుతున్నాం.
జగన్ కి సత్తా ఉంది కాబట్టే తుక్కు తుక్కుగా ఓడించారు
జగన్ మోహన్ రెడ్డికి సత్తా లేదని మాట్లాడే చంద్రబాబు, ముందుగా తన కుమారుడికి సత్తా లేదని తెలుసుకోవాలి. మీ దత్తపుత్తుడికి, మీ పుత్రుడికి సత్తాలేదు. జగన్‌కి సత్తా ఉంది కాబట్టే మిమ్మల్ని ఒంటి చేత్తో తుక్కుతుక్కుగా ఓడించారు. ఈరోజుకు కూడా సత్తా ఉన్న నాయకుడు కాబట్టే, ప్రజలలో బలమైన నాయకుడు, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించిన ముఖ్యమంత్రి కాబట్టే, ఎన్నికల్లో ఒక్కడినే పోటీ చేస్తానని జగన్ అంటుంటే, నేను ఒక్కడినే వెళ్లను.. పవన్ కల్యాణ్, సీపీఎం, సీపీఐ కలిసి వస్తే అంతా కట్టకట్టుకుని వస్తామంటున్న మీరు సత్తా గురించి మాట్లాడటమా? ఎప్పుడూ ఒంటరిగా పోటీ చేసి గెలవలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు.
– ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఒంటరిగా వెళ్లే నాయకుడు జగన్ మోహన్ రెడ్డి. ప్రజల మీద విశ్వాసం ఉన్నవ్యక్తి. ప్రజలకు సేవ చేసిన వ్యక్తి కాబట్టే ఆయనకు సత్తా ఉంది. చంద్రబాబుకు ఆ సత్తాలేదు కాబట్టే ఎవరో ఒకరి భుజాలు కావాలి. గారడి విద్యలు చేసి గెలవాలనుకునే తలంపు ఉన్న వ్యక్తి చంద్రబాబు.
కర్నూలులో న్యాయ రాజధానిని అడ్డుకుంది నేనే అని ఎందుకు చెప్పలేదు బాబూ..?
కర్నూలులో చంద్రబాబు రాజధానుల గురించి మాట్లాడుతూ.. ఏం తమ్ముళ్లూ కర్నూలుకు రాజధాని వచ్చిందా అని అడుగుతున్నాడే? నేనే కుళ్లు, కుతంత్రాలు చేసి న్యాయ రాజధాని రాకుండా అడ్డుకున్నానని మాత్రం చెప్పడం లేదు. కర్నూలులో న్యాయ రాజధాని రాకుండా అడ్డుపడుతున్నటువంటి గుంటనక్క చంద్రబాబు. రాయలసీమ పట్ల ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడో ఆ ప్రాంత ప్రజలు తెలుసుకోలేరా?. అన్ని ప్రాంతాలను సమగ్ర అభివృద్ధి చేయాలనే మంచి దృక్పధంతో మూడు ప్రాంతాలను సమానంగా చూడాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు మాత్రం తనకు అమరావతే రాజధాని కావాలని గుంటనక్క వేషాలు వేసి, ఇవాళ కర్నూలు వెళ్లి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.
కుప్పంలోనూ బాబును విశ్వసించటంలేదు
పులివెందుల గురించి బాబుకు మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది. పులివెందులలో పాత బస్టాండ్ తీసేసి కొత్త బస్టాండ్ కడుతుంటే దాని గురించి మాట్లాడతావా? మరి కుప్పంలో మీ పరిస్థితి ఏంటి చంద్రబాబూ? చంద్రగిరిలో పోటీ చేసి అక్కడ నుంచి పారిపోయి కుప్పం వెళ్లావు. జగన్, ఆయన కుటుంబం పులివెందులలోనే పోటీ చేస్తూ వస్తుంది. ఇకపైనా చేస్తుంది. అసలు పులివెందుల గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడుంది బాబు?
– కుప్పంలో ఇవాళ చంద్రబాబు ఇల్లు కట్టుకుంటున్నాడట. ఇల్లు కట్టుకునే ఆలోచన ఇంతకుముందు ఎప్పుడైనా మీకు వచ్చిందా? కుప్పంలో ప్రజల ముందుకు వెళ్లి ఇంతకు ముందు తప్పులు చేశాను, ఇంకెప్పుడు చేయనని ఎందుకు మాట్లాడావు? ఎందుకంతగా దిగజారిపోయావు. కుప్పంలో కూడా నిన్ను ప్రజలు విశ్వశించని రోజులు వచ్చాయంటే.. అది జగన్ మోహన్ రెడ్డిగారి సుపరిపాలన వల్లే సాధ్యమైంది. జగన్‌గారు మంచిపాలన చేస్తున్నారు, చంద్రబాబు మంచి పాలన చేయలేదనే ప్రజలు భావించి, మిమ్మల్ని పక్కనపెట్టాలనుకున్నప్పుడు… లేదు లేదు నేను ఇల్లు కట్టుకుంటున్నా, నెలకోసారి వస్తాను, మీ మంచిచెడ్డలు చూసుకుంటాననే పరిస్థితి కల్పించారంటే …కుప్పం ఓటర్లు జగన్ మోహన్ రెడ్డిని ఎంతగా అభిమానిస్తున్నారో ఇక్కడ చెప్పుకోవాలి. కుప్పంలో కుప్పకూలిపోయావు కాబట్టి పులివెందుల వెళ్లి ఏదో జరిగిపోయిందని చెప్పే ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్ముతారనేది బాబు భ్రమ.
గడప గడపకు వెళ్ళి ఫలానా మేలు చేశాం అని మేం చెబుతున్నాం.. బాబుకు చెప్పే ధైర్యం ఉందా?
గడప గడపకు కార్యక్రమాన్ని చూసి చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు. ప్రతి గడపకు వెళ్లి మేము ఏం చేశామో ప్రజలకు చెబుతున్నాం. గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటూ ఎన్నికల ముందు అందరి దగ్గరకు వెళ్లాం. అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పాం. అధికారంలోకి వచ్చి మూడేళ్ల పాలన చేశాం. మళ్లీ గడప గడపకు వెళ్లి మా ఎన్నికల మ్యానిఫెస్టో ఇచ్చి, ఏం చెప్పాం, ఏం చేశామో ప్రజలకు వివరిస్తున్నాం. ఈ దేశంలో ఎక్కడైనా మ్యానిఫెస్టోని తీసుకువెళ్లి నెరవేర్చిన హామీలు గురించి చెప్పిన రాజకీయ పార్టీ ఏదైనా ఉందా ? అదే చంద్రబాబు అధికారంలోకి రాగానే, మ్యానిఫెస్టోను దాచేసుకున్న దౌర్భాగ్యమైన రాజకీయ పక్షం. మేం దైర్యంగా ప్రజల వద్దకు వెళుతూ ఉంటే ప్రజలు తిరగబడుతున్నారని ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుంది. మీ ఎల్లో మీడియా చెబితే ప్రజలు తిరగబడినట్లా? చంద్రబాబుకు ధైర్యం ఉంటే సభలు, సమావేశాలు పెట్టడం కాదు.. మా మాదిరిగా, టీడీపీ నాయకులు గడప గడపకు వచ్చి ఫలానా మేలు చేశామని చెప్పమనండి. రాయలసీమలో రంకెలు వేస్తున్న చంద్రబాబు ఇక్కడ ఆయన శంకుస్థాపన చేసి ప్రారంభించిన ప్రాజెక్ట్ ఏమైనా ఉందోమో ఒక్కటి చెప్పమనండి.
– గడప గడపకు ప్రభుత్వ కార్యాక్రమలు, సామాజిక న్యాయభేరి తో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ముందుకు వెళుతుంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని అద్భుతంగా అమలు చేస్తున్నారు. అందువల్లే ఎనిమిదిమంది రాజ్యసభ సభ్యులు ఉంటే నాలుగు స్థానాలను బీసీలకు ఇచ్చిన ఘనత వైయస్సార్ సీపీకి దక్కుతుంది. దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బస్సుయాత్ర ప్రారంభిస్తే ఇది చూసి చంద్రబాబుకు భయం, వణుకుపుట్టి జనాల్లోకి వెళ్లి ఏదోదో మాట్లాడుతున్నాడు.
మేం పెళ్ళాల భాష మాట్లాడితే మాత్రం ఏడుపా..?
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి మొగుడిని తెచ్చారంట. ఆయనే ఒకరికి మొగుడు. చంద్రబాబు మొగుడుని తెచ్చేదేంటి? పెళ్లాల భాష మాట్లాడతాడు. ఆ భాషను మేము మాట్లాడితే చంద్రబాబు బావురుమని ఏడుస్తాడు. కొడుకును జనాల్లోకి తిరగనిస్తే పార్టీ డ్యామేజీ అవుతుందేమో అనే భయంతో చంద్రబాబే తిరుగుతున్నాడు. పైపెచ్చు తనకు 72ఏళ్లు బ్రదర్… అయినా నేను 27ఏళ్లవాడిలాగా ప్రవర్తిస్తా అని చెప్పుకొస్తున్నాడు. ఇంత వయసు వచ్చినా ఆశ చావలేదు. అధికారం మీద మమకారం చావలేదు. ఇంకా అధికారం కావాలనే ఆశతో చంద్రబాబు బాధపడుతున్నాడు. పుత్రుడితో, దత్తపుత్రుడితో కాదనే బాబు తిరుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు ఒక పథకం ప్రకారం ముఖ్యమంత్రిని దూషించి, తద్వారా నాలుగు సీట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
– రాష్ట్రంలో వైయస్సార్ సీపీ ప్రభుత్వంఅద్భుతంగా పరిపాలన చేస్తోంది. ప్రజల చెంతకు వెళ్లి ఏం చేశామో మేము చెబుతాం. అదే చంద్రబాబుకు దమ్ముంటే తన 14ఏళ్ల పాలనలో ఏం చేశాడో చెప్పమని అడుగుతున్నాం. మీకున్న అధికార, కులపిచ్చి కరోనా కన్నా చాలా ప్రమాదకరమైనదిగా గమనించే ప్రజలు మిమ్మల్ని అవమానకర రీతిలో మూలన కూర్చోపెట్టారు ఇది గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబుకు చెబుతున్నాం. మీ అబ్బాయి కూడా మంగళగిరిలో ఓడిపోయాడు. అయినా దొడ్డిదారిన మంత్రిని చేశారు. మీ రాజకీయ వారసుడు అయిన నారా లోకేష్‌ను తుక్కుతుక్కుగా ఓడించినా మీకు సిగ్గురాలేదు. ఇప్పుడు రాజకీయ వారసుడు కాదట. చంద్రబాబు ఎప్పటికీ మాజీ ముఖ్యమంత్రే తప్ప, మళ్లా సీఎం కాలేడనే వాస్తవం అందరికీ అర్థం అవుతుంది. సుపరిపాలన అందిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద చంద్రబాబు, ఎల్లో మీడియా విషం కక్కే ప్రయత్నాలను ప్రజలు విశ్వసించరు.
మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..
ప్రాజెక్టులు అన్నీ ఒక్కరోజుతో పూర్తి అయిపోయేవి కావు. ప్రాజెక్ట్‌లను ప్రాధాన్యతాక్రమంలో పూర్తి చేస్తాం. త్వరలో సంగం, నెల్లూరు బ్యారేజీలు ముఖ్యమంత్రి చేతుల మీద ప్రారంభం అవుతాయి. చంద్రబాబుకు, అప్పటి ఇరిగేషన్ మంత్రికి అవగాహన లేకపోవడం వల్లే పోలవరంలో కాఫర్ డ్యామ్ పూర్తి కాకుండా, డయాఫ్రం వాల్ నిర్మించడం చారిత్రక తప్పిదం అవునా కాదా? దీనికి సమాధానం చెప్పమంటే పారిపోతున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల మీద అవగాహన ఉన్న మేధావులు కూడా ఇది తప్పో కాదో చెప్పాలని మనవి చేస్తున్నాను.