చెర‌కు రైతుల బ‌కాయిల చెల్లింపుపై మంత్రి బొత్స స‌మీక్ష‌

– భూములు, చ‌క్కెర నిల్వ‌లు విక్ర‌యించి బ‌కాయిల చెల్లింపున‌కు చ‌ర్య‌లు
– రైతుల ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిర‌క్షించాల్సిందే
– సంకిలి షుగ‌ర్స్ యాజ‌మాన్యానికి స్ప‌ష్టంచేసిన మంత్రి
విజ‌య‌న‌గ‌రం, న‌వంబ‌రు 5; రైతుల ప్ర‌యోజ‌నాలు ప‌రిర‌క్షించ‌డ‌మే త‌మ ప్ర‌భుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశ‌మ‌ని, ఏ నిర్ణ‌య‌మైనా వారి ప్ర‌యోజ‌నాల కోస‌మే తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ స్ప‌ష్టం చేశారు. జిల్లాలోని ప్రైవేటు రంగంలో వున్న ఎన్‌.సి.ఎస్‌.షుగ‌ర్స్ ఫ్యాక్ట‌రీ ద్వారా చెర‌కు రైతుల‌కు బ‌కాయిల చెల్లింపు, సహ‌కార రంగంలోని భీమ‌సింగి షుగ‌ర్ ఫ్యాక్ట‌రీ ప‌రిధిలో పండించిన చెర‌కు శ్రీ‌కాకుళం జిల్లా సంకిలిలోని ఇ.ఐ.డి. ప్యారీ చ‌క్కెర క‌ర్మాగారానికి త‌ర‌లింపు వంటి అంశాల‌పై జిల్లా అధికారులు, ఆయా చ‌క్కెర క‌ర్మాగారాల ఎం.డి.ల‌తో క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో శుక్ర‌వారం మంత్రి స‌మీక్షించారు.
ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ గ‌తంలోనే ఎన్‌.సి.ఎస్‌.షుగ‌ర్స్ బ‌కాయిల అంశంలో 2019లోనే ఒక స‌మావేశం నిర్వ‌హించి చెర‌కు రైతుల బ‌కాయిలు చెల్లింపుకోసం ఫ్యాక్ట‌రీ భూములు, చ‌క్కెర నిల్వ‌లు విక్ర‌యించి ఆ నిధుల‌తో చెల్లించాల‌ని ఆదేశాలు ఇచ్చామ‌న్న విష‌యాన్ని గుర్తుచేశారు. ఎన్‌.సి.ఎస్‌. చ‌క్కెర క‌ర్మాగారానికి సంబంధించి రూ.10 కోట్ల విలువైన 30 వేల ట‌న్నుల చ‌క్కెర నిల్వ‌లు ఉన్నాయ‌ని అధికారులు వివ‌రించారు. ఈ చ‌క్కెర నిల్వ‌ల‌ను విక్ర‌యించేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని మంత్రి ఆదేశించారు. అదేవిధంగా ఫ్యాక్ట‌రీ వ‌ద్ద ఉన్న భూముల‌పై మంత్రి ఆరా తీశారు. 19.9 ఎకరాలు, సిబ్బంది క్వార్ట‌ర్స్‌కు సంబంధించి 4.9 ఎక‌రాలు అందుబాటులో వుంద‌ని వివ‌రించారు.
భీమసింగి స‌హ‌కార చ‌క్కెర క‌ర్మాగారం ప‌రిధిలో పండించిన చెర‌కును సంకిలిలోని ప్యారీ ఇండియా చ‌క్కెర క‌ర్మాగారానికి త‌ర‌లింపు అంశంపై మంత్రి సంకిలి, భీమ‌సింగ్ ఫ్యాక్ట‌రీ ఎం.డి.ల‌తో చ‌ర్చించారు. చెర‌కు ర‌వాణా, లోడింగ్ ఛార్జీలు ఎవ‌రు భ‌రించాల‌నే అంశంపై కూడా చ‌ర్చించారు. రైతులకు త‌ర‌లింపు వ‌ల్ల ప్ర‌యోజ‌నం క‌లగ‌డంతో పాటు ప్రభుత్వం ప్ర‌క‌టించిన మ‌ద్ధ‌తు ధ‌ర అందిస్తేనే చెల్లింపున‌కు స‌హ‌క‌రిస్తామ‌ని మంత్రి ప్రైవేటు ఫ్యాక్ట‌రీ యాజమాన్యానికి స్ప‌ష్టంచేశారు. ఇక్క‌డ నుంచి త‌ర‌లించిన చెర‌కుకు తూకం వేయ‌డం, రైతుల‌కు ఎంత కాలంలోగా చెల్లింపులు జ‌రుగుతాయ‌నే అంశాల‌పై మంత్రి సంకిలి ఫ్యాక్ట‌రీ ఎం.డి.తో ఆరా తీశారు.
స‌మావేశంలో జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి, జిల్లా పోలీసు సూప‌రింటెండెంట్ ఎం.దీపిక‌, జె.సి. డా.జి.సి.కిషోర్ కుమార్‌, గ‌జ‌ప‌తిన‌గ‌రం ఎమ్మెల్యే బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య‌, భీమ‌సింగి షుగ‌ర్స్ ఎం.డి. విక్ట‌ర్ రాజు, సంకిలి షుగ‌ర్స్ ఎం.డి. నాగ‌శేషా రెడ్డి, అసిస్టెంట్ కేన్ క‌మిష‌న‌ర్ లోకేశ్వ‌ర్‌, ఆర్‌.డి.ఓ. భ‌వానీ శంక‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.