Suryaa.co.in

Editorial Entertainment

మైత్రీ మూవీస్‌లో మంత్రి పెట్టుబడులు?

  • ఇప్పటికే మైత్రీమూవీ మేకర్స్‌పై కొనసాగుతున్న ఐటి దాడులు

  • అందులో చాలా సినిమాలకు ఓ మంత్రి పెట్టుబడులు?

  • ఆ మంత్రి పెట్టుబడులపై ఆరా తీస్తున్న ఐటీ శాఖ

  • నేడో రేపో మంత్రి కంపెనీలపై ఐటి దాడులు?

  • సినిమా వర్గాల్లో ప్రచారం

( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలుగు చిత్ర నిర్మాణ సంస్థల్లో అగ్రభాగాన ఉన్న మైత్రీమూవీస్ సంస్థ కార్యాలయాలపై ఇన్‌కంటాక్స్ శాఖ వరస దాడుల నేపథ్యంలో.. ఏపీకి చెందిన ఒక మంత్రి పెట్టుబడులు కూడా ఆ సంస్థలో ఉన్నట్లు ఐటి అధికారులు గుర్తించినట్లు సమాచారం. దానికి సంబంధించి సదరు కొత్త మంత్రికి చెందిన కార్యాలయాలపై నేడో రేపో దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

తెలుగు సినిమా చరిత్రలో కలెక్షన్లను తిరిగిరాసిన పుష్ప, పుష్ప-1 సినిమా సంస్ధ మైత్రీమూవీస్ సంస్థ, నిర్మాత ఇళ్లపై గత రెండురోజుల నుంచి ఐటి శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో మరో బడా నిర్మాయ దిల్‌రాజుకు చెందిన ఆఫీసు, ఇళ్లు, బంధుమిత్రుల ఇళ్లపై కూడా దాడులు నిర్వహిస్తుండటం సంచలనంగా మారింది. పుష్ప సినిమాకు సంబంధించి సమర్పించిన లెక్కలకు, వచ్చిన ఆదాయానికి పొంతన లేకపోవడమే ఆ దాడులకు కారణమని ఐటి వర్గాలు చెబుతున్నారు.

నిజానికి తెలుగు సినిమా రంగంలో భారీ సినిమాలు తీసే అతికొద్ది కంపెనీల్లో మైత్రీమూవీస్ ఒకటి. వాల్తేరు వీరయ్య, గాంధీతాత చెట్టు, సాలార్, రంగస్థలం, సర్కారువారి పాట, వీరసింహారెడ్డి, జనతాగ్యారేజ్, శ్రీమంతుడు వంటి హిట్ సినిమాలు నిర్మించిన మైత్రీమూవీ మేకర్స్.. ఇటీవలి కాలంలో అల్లు అర్జున్ హీరోగా తీసిన పుష్ప సూపర్ డూపర్ హిట్టయింది. తెలుగుచలన చిత్ర గత రికార్టులను పుష్ట సిరీస్ బద్దలు కొట్టాయి.

అయితే.. ఆ సినిమాకు సంబంధించి నిర్మాణ సంస్థ, ఐటికి సమర్పించిన లెక్కలపై ఐటి అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. హీరో,దర్శకుడు, సంగీత దర్శకుడు, అగ్ర నటులకు ఇచ్చిన పారితోషికంతోపాటు, సమర్పించిన ఇతర లెక్కలు ఐటి శాఖను సంతృప్తి పరచలేదు. దానితో రంగంలోకి దిగిన ఐటి అధికారులు రెండురోజుల నుంచి వరస దాడులు కొనసాగించారు. దాడుల్లో కొన్ని కీలక పత్రాలు లభ్యమయినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఇదిలాఉండగా.. ఏపీలో కొత్తగా మంత్రి అయిన ఒక పారిశ్రామికవేత్త కూడా మైత్రీ మూవీస్ తీసే సినిమాలకు.. తరచూ పెట్టుబడులు పెడుతున్నట్లు ఐటి వర్గాలు గుర్తించినట్లు, సినిమా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయన గతంలో మహేష్ నటించిన సినిమా నుంచి, ఆ సంస్థలో పెట్టుబడులు పెడుతున్నారని, సినిమా విడుదలయిన తర్వాత తన వాటా తాను తీసుకుంటారని సినిమా వర్గాలు చెబుతున్నాయి.

‘మైనింగ్‌ల’తో అనుబంధం ఉన్న సదరు మంత్రికి, సినిమా రంగంతో సన్నిహిత సంబంధాలున్నాయన్నది బహిరంగ రహస్యమేనంటున్నారు. ఆయన తరచూ కొత్త సినిమాల ప్రారంభోత్సవాలకు హాజరవుతుంటారని గుర్తు చేస్తున్నారు.

మైత్రీ మూవీస్ సంస్థలపై ఐటి దాడుల నేపథ్యంలో.. సదరు మంత్రి వ్యాపారసంస్థలపై కూడా, దాడులు జరిగే అవకాశం లేకపోలేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఆ మంత్రి హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరినట్లు సమాచారం.

LEAVE A RESPONSE