Suryaa.co.in

Telangana

ఎవరి కోసం విద్యుత్ సంస్కరణలు?

-ఏ పెద్దల మెప్పుకోసం కేంద్ర నిర్ణయాలు?
-చేతి వృత్తులను దెబ్బతీసేందుకు కుట్ర
-బండి సంజయ్ యాత్ర ఎందుకూ…?
-తెలంగాణాలో అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల రద్దు కోసమా..?
-కేంద్రానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ సూటి ప్రశ్న

ఎవరి కోసం విద్యుత్ సంస్కరణలు ప్రవేశపెడుతున్నారని రాష్ట్ర యస్.సి.సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్ కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. రైతులు, వెనుకబడిన వర్గాలు.. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలు చేతి వృత్తులపై ఆధారపడి జీవనం సాగించే వారి ప్రయోజనాలు దెబ్బతీయడంలో భాగమే అన్నారు. ఎల్ఐసీ, రైల్వే, టెలిఫోన్ రంగాలను ప్రైవేట్ పరం చేస్తూ వస్తున్న కేంద్రం.. వ్యవసాయ రంగం, కోళ్ల పరిశ్రమ, చిన్న తరహా పరిశ్రమలపై ఆధారపడి జీవనం చేసుకునే వారిని కూడా వదలటం లేదని ఆరోపించారు.

ఏ పెద్దల మెప్పుకోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. తెలంగాణ డిస్కంలకు ఏపీ జెన్కో ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం విద్యుత్ సరఫరా చేసినట్టు కేంద్రం చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. దేశ చరిత్రలోనే తొలి సారిగా వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ గుర్తు చేశారు. కొత్తగా విద్యుత్ చట్ట సవరణ బిల్లు ద్వారా రాష్ట్రాల హక్కులను హరిస్తుందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని మంత్రి ఆరోపించారు.

బండి పాదయాత్ర ఎందుకూ
బీజేపీ నేత బండి సంజయ్ చేస్తున్న పాదయాత్ర దేనికోసమని సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల రద్దు కోసం అయి ఉంటుందని ఆయన ఎద్దేవాచేశారు. బిజెపి పాలనలో ఉన్న రాష్ట్రాలలో కళ్యాణాలక్ష్మి/షాధి ముబారక్, ఆసరా ఫించన్లు, కేసీఆర్ కిట్, అమ్మ వడి, అన్నింటికీ మించి రైతు బంధు,రైతు భీమా వంటి పధకాలు లేక పోవడంతో అక్కడి ప్రజలు బిజెపి నేతలను నిలదీస్తుండటంతో తట్టుకోలేకనే ఇక్కడ కుడా ఎత్తి వేయలన్నది ఆ పార్టీ వ్యూహం అయి ఉండొచ్చన్నారు.

ఇప్పటికే మూడు సార్లు పాదయాత్ర జరిపిన ఆయన గాని ప్రచార పటాటోపంతో పబ్లిసిటీ కోసం ఢిల్లీ నుండి తరలి వస్తున్న నేతలు ఇక్కడి ప్రజలకు ఏమి చేస్తారు అన్నది చెప్పలేక పోయారని ఆయన ఎత్తి పొడిచారూ.అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అన్ని రంగాలకు విద్యుత్ నందించడంతో పాటు దేశంలోనే ఎక్కడ లేని విదంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ను ఎత్తివేసేందుకే బండి పాదయాత్ర జరుగుతున్నట్లుందన్నారు.

అందుకే ప్రధాని మోడీ సొంత రాష్ట్రం తరహాలోనే తెలంగాణా లో మోటర్లకు మీటర్లు పెట్టేందుకు బిజెపి తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణల అమలుకు ప్రజలపై వత్తిడి తెచ్చేందుకే బండి పాదయాత్ర అసలు సారాంశం అని ఆయన పేర్కొన్నారు.

LEAVE A RESPONSE