Suryaa.co.in

Andhra Pradesh

తిరుపతిలో మంత్రి నారా లోకేష్ 59వ రోజు ప్రజాదర్బార్

– వివిధ సమస్యలతో బాధపడుతున్న వారినుంచి అర్జీలు స్వీకరణ
– సమస్యలు పరిష్కరించి అండగా నిలుస్తానని మంత్రి హామీ

తిరుపతి: పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశం అనంతరం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తిరుపతి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 59వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న సామాన్యుల నుంచి అర్జీలు స్వీకరించారు. 2007 నుంచి 2011 వరకు కాంట్రాక్ట్ పద్ధతిలో నియమితులై, సొంత మండలాల్లోని పీహెచ్ సీ సబ్ సెంటర్లలో సెకెండ్ ఏఎన్ఎమ్ లుగా విధులు నిర్వహిస్తున్న తమను క్రమబద్ధీకరించాలని సెకెంట్ ఏఎన్ ఎమ్ లు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.

16 ఏళ్లుగా రెగ్యులర్ వారితో సమానంగా విధులు నిర్వహిస్తున్నామని, వేతనాలు సరిపోక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న రెగ్యులర్ ఏఎన్ఎమ్ పోస్టులను 2007 నుంచి పనిచేస్తున్న సెకెండ్ ఏఎన్ఎమ్ లతో భర్తీ చేయాలని కోరారు. ఎస్ఎల్ఎమ్ పీసీ కార్పోరేషన్ తరపున తిరుమల లడ్డూ కౌంటర్ నందు విధులు నిర్వహించే తాను రోడ్డు ప్రమాదం కారణంగా కొన్ని నెలలుగా విధులకు హాజరుకాలేకపోయానని, రీజాయినింగ్ కు అనుమతించాలని తిరుపతికి చెందిన ఏ.నాగసాయి కార్తీక్ విజ్ఞప్తి చేశారు.

హంద్రీనీవా ప్రాజెక్టు కింద భూమి కోల్పోయానని, ఇంటర్ చదివిన తన కుమారుడికి టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశం కల్పించి ఆదుకోవాలని చిత్తూరు జిల్లా ఐరాల మండలం చెంగనపల్లెకు చెందిన పి.మునేశ్వర శెట్టి కోరారు. ఆయా సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE