సోము వీర్రాజుది ఒరిజినల్ బీజేపీనా.. డూప్లికేట్ బీజేపీనా.?

Spread the love

“సారా వీర్రాజు” అండ్ కో ప్రభుత్వంపై మతం ముద్ర వేయాలని చూస్తోంది
– టీడీపీ-బీజేపీ కలిసి రాష్ట్రంలో దేవాలయాలను కూల్చితే.. ఈ ప్రభుత్వం కడుతోంది
– సుజనా, సీఎం రమేష్ లకు అమ్ముడుపోయిన కొందరు “బాబు లైనే – బీజేపీ లైను”గా మాట్లాడుతున్నారు
– హిందూ దేవాలయాలను అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం ఇది.
– పోలవరం, విశాఖ ఉక్కు, రైల్వే జోన్ గురించి వీర్రాజు ఏనాడైనా కేంద్రాన్ని ప్రశ్నించాడా..?
– బీజేపీ అధికారంలో ఉన్న గోవాలోనే కేసినోలను నడుపుతున్నారు.. ఏపీలో కాదు
– రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఏమన్నారంటే…
ఆత్మకూరులో భారతీయ జనతా పార్టీ ప్రజా నిరసన పేరుతో సభ పెట్టి.. సోము వీర్రాజు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కొంత మంది బీజేపీ నాయకులు, చంద్రబాబు నాయుడు పంపిస్తే బీజేపీలో చేరిన టీడీపీ నాయకులతో ఈ రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఇటువంటి మత రాజకీయాలు చేయడం భారతీయ జనతా పార్టీకి సరికాదని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఇంతకు ముందు సోము వీర్రాజు అంటే కొద్దోగొప్పో తెలిసేది. ఈరోజు ఆంధ్రరాష్ట్రంలో “సారా వీర్రాజు”గా ఆయన పాపులర్ అయ్యారు.

తాగుబోతులకు రూ. 50కే మద్యం బాటిల్ ఇస్తానన్న సారా వీర్రాజు, ఈరోజు నీతులు చెబుతూ, ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద మతం ముద్ర వేయాలని లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు.
మతాలు, కులాలు అడ్డు పెట్టుకుని మీరు ఎన్ని కుట్రలు చేసినా.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చిటికెన వేలు కూడా తాకలేరు. సోము వీర్రాజు, తన స్థాయికి మించి మాట్లాడుతున్నాడు. సొంత తూర్పు గోదావరి జిల్లాలోనే కార్పొరేటర్‌గా కూడా పనికిరాని వ్యక్తి, ఈరోజు బీజేపీ రాష్ట్ర రథసారధిగా వీర్రాజు పనిచేస్తున్నారు. పోనీ రాష్ట్రానికి మంచి చేస్తారా అంటే అదీ లేదు? ఆయన బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి మత, కుల విద్వేషాలు రెచ్చగొట్టేలా, రాష్ట్రంలో అశాంతిని సృష్టించేలా ప్రయత్నిస్తున్నారు. భారతదేశంపైనగానీ, ఆంధ్రరాష్ట్రం మీదగానీ సారా వీర్రాజుకు ఏమాత్రం అయినా ప్రేమ ఉందా? కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రిగారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా? వీర్రాజూ నీ స్థాయి ఏంటి? ముఖ్యమంత్రిపై అడ్డమైన అవాకులు చెవాకులు మాట్లాడతావా? మాట్లాడేటప్పుడు వళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు.

హిందూ మతం గురించి, ఆలయాల గురించి మీరు మాట్లాడతారా? చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీకి చెందిన వ్యక్తి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో 40దేవాలయాలు కూల్చివేస్తే దానిలో మీ బాధ్యత, భాగస్వామ్యం లేదా అని అడుగుతున్నాం. ఆరోజు దేవాలయాలను కూల్చిన చరిత్ర మీది. మీరు కూల్చేసిన దేవాలయాలను కట్టిన, కట్టిస్తున్న చరిత్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిది. అలాంటి ముఖ్యమంత్రి మీద మతం ముద్ర వేస్తారా? మతతత్వ పార్టీ అంటారా? , ఎవరిది మతతత్వ పార్టీ.. మతాన్ని అడ్డు పెట్టుకుని ఎవరు రాజకీయాలు చేస్తున్నారు..?

జగన్‌ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ కులం, మతం, పార్టీ చూడకుండా, అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అందిస్తుంటే.. అలాంటి సీఎంపై అనుచిత వ్యాఖ్యలా?. అసలు సారా వీర్రాజు ఒరిజినల్‌ బీజేపీనా? డూప్లికేట్‌ బీజేపీనా? ఆయన దేశభక్తుడా? లేక టీడీపీ భక్తుడా? అనేది రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. మైక్‌ దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు.

నార్త్‌,ఈస్ట్‌ రాష్ట్రాల్లో తరిమేస్తే.. ఇన్ చార్జీలుగా ఇక్కడకు వచ్చి, మతాలను రెచ్చగొట్టేలా మాట్లాడటం సమంజసంగా ఉందా? చంద్రబాబు వలస పక్షులు సీఎం రమేష్‌, సుజనా చౌదరికి అమ్ముడుపోయిన కొందరు బీజేపీ నేతలు చంద్రబాబు లైన్ లో నడుస్తున్నారు. టీడీపీ హయాంలో దేవాలయాలను కూల్చేసినప్పుడు ఏమైపోయారు మీరంతా? కూల్చేసిన గుళ్లు, గోశాలలను పునర్నిర్మిస్తున్న ప్రభుత్వం మాది.

మీకు హిందువుల మీద ప్రేమ ఉందా? ఎంతసేపటికీ హిందువుల పేరు చెప్పుకుని ఓట్లు దండుకోవాలనే ప్రయత్నం తప్ప, వారి కోసం బీజేపీ ఆంధ్రరాష్ట్రంలో ఏ ఒక్క మేలు అయినా చేసిందా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. రామతీర్థం, అంతర్వేది ఘటనల గురించి మాట్లాడుతున్నారే.. సిగ్గు, శరం ఉందా అని అడుగుతున్నాం. మీ పార్టీ కోరిక మేరకు మూడో రోజే సీబీఐ విచారణ వేయాలని రాష్ట్రప్రభుత్వం జీవో జారీ చేస్తే దానిపై.. ఇంతవరకూ అతీగతీ లేదు. మీరు రామతీర్థం, అంతర్వేది గురించి మాట్లాడతారా?

అంతర్వేది రథాన్ని మూడు నెలల్లో అద్భుతంగా తయారు చేయించి ఇచ్చిన ఘనత మా ప్రభుత్వానిదే..
రామతీర్థంలో దుండగులు ఎవరో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే.. అక్కడ శ్రీరామనవమి నాటికి అద్భుతమైన విగ్రహాలు తయారు చేయించి, దేవుళ్లను ప్రతిష్టించడానికి ముందుకు వెళుతున్న ప్రభుత్వం మాది. – అదే శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు మనుషులు గుడిలోని శివలింగాన్ని తీసుకువెళ్లి నడిరోడ్డుపై ధ్వంసం చేస్తే మీరు ఏం చేశారని ప్రశ్నిస్తున్నాం.

జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, ఈ ప్రభుత్వం హిందువులకు గానీ, హిందు దేవాలయాలకు గానీ గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పే దమ్ము, ధైర్యం నా కుంది? మరి మీకు ఆ ధైర్యం ఉందా అని అడుగుతున్నా. మీరు ఈ ప్రభుత్వంపై మత ముద్ర వేయాలని ప్రయత్నం చేస్తారా? హిందువుల ముసుగులో ఓట్ల కోసం… మత రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తారా?

ఇటువంటి దిక్కుమాలిన రాజకీయాలు చేసే సోము వీర్రాజు, సీఎం రమేష్‌, సుజనా చౌదరిలు ఆంధ్రరాష్ట్రానికి చీడ పురుగులు. సోము వీర్రాజు ఏనాడైనా… రాష్ట్రానికి మేలు చేసే అంశాలైన పోలవరం ప్రాజెక్ట్‌, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే జోన్‌ ల గురించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారా అని సూటి అడుగుతున్నాం.

మతతత్వ పార్టీ ఎవరిదనేది రాష్ట్రంలోనే కాదు.. దేశంలో ఎవరిని అడిగినా చెబుతారు. ఈ రాష్ట్రంలో పనికిమాలిన, పనికిరాని పార్టీ ఎవరిది అంటే అది సోము వీర్రాజుగారి పార్టీనే అని చెబుతారు. సంక్రాంతి సంప్రదాయాలు, సంబురాల గురించి మాకు నీతులు చెబుతారా? సంక్రాంతి సంబరాలను, సంప్రదాయాలను ముఖ్యమంత్రి జగన్ గారు చేసినట్లుగా ఎవరు చేశారని అడుగుతున్నాం. మీరు కర్నూలులో కూర్చుని కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలవారిని కలుపుకుని పనిచేస్తున్నది మా ప్రభుత్వం. సీఎం జగన్ గారు అందర్నీ సమ దృష్టితో చూసుకుని, అందరికీ మంచి చేయాలనుకుంటారు. అలాంటి ఆయనపై దుష్ప్రచారాలు చేయడం సరికాదు. అధికారంలోకి వస్తే.. తాగుబోతులకు రూ.50లకే ఛీప్‌ లిక్కరు ఇస్తామన్న వ్యక్తి మన దురదృష్టం కొద్దీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.

లేని క్యాసినోల గురించి మాట్లాడుతున్నవారికి ఒక్కటే సమాధానం. క్యాసినోలు ఎక్కడ జరుగుతున్నాయి? గోవాలో కదా? మరి అక్కడ ప్రభుత్వం ఎవరిది.. బీజేపీదే. మరి అక్కడ ఎందుకు కేసినోలను బ్యాన్‌ చేయలేదని అడుగుతున్నాం. మీరు అధికారంలో ఉండే రాష్ట్రాలకు ఒకమాట, ప్రాంతానికో మాట, పూటకో మాట మాట్లాడే మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులా? ఇలాంటి చీప్‌ మనుషులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉండటం దురదృష్టకరం. ఇలాంటి మాటలు మళ్లీ మాట్లాడితే మర్యాదగా ఉండదని సోము వీర్రాజును హెచ్చరిస్తున్నాం.

విలేకరుల ప్రశ్నలకు సమాధానమిస్తూ…
సునీల్ దేవధర్ ను త్రిపురలో తోలేస్తే ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. అక్కడ మత రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తే ఆయనను అక్కడ నుంచి పంపించివేశారు. ఈ రాష్ట్రంలో ఇలాంటి నేతల పప్పులు ఉడకవు. ఈ రాష్ట్రంలో మత, కుల తత్వాలను ప్రజలు హర్షించే పరిస్థితి లేదు. అందర్ని సమంగా చూసుకునే ప్రభుత్వం మాది. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం శూన్యం.

గుడివాడలో కేసినోలు అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. బైక్‌ రేసుల వీరులు, క్రికెట్‌ బెట్టింగ్‌ బ్యాచ్, మర్డర్‌కేసుల్లో ఉన్నవాళ్లు అంతా టీడీపీ నిజ నిర్థారణ కమిటీలో ఉన్నారు. మంత్రి కొడాలి నాని సవాల్‌ విసిరారు. దానికి సమాధానం చెప్పకుండా చంద్రబాబు తప్పించుకు తిరుగుతున్నాడు. గుడివాడలో అశాంతి సృష్టించాలని చూశారు. శాంతిభద్రతల సమస్య వస్తుందనే.. పోలీసులు వారి డ్యూటీ వాళ్లు చేశారు. దానిపై టీడీపీ ఎందుకింత రచ్చ చేస్తోంది?

అబద్ధాలకు, అభూత కల్పనలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అండ్ కో. అసెంబ్లీలో జరగనివాటిని జరిగినట్లుగా బయటకు వచ్చి గుక్కపట్టి ఏడ్చేశాడు చంద్రబాబు. మళ్లీ సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతానంటూ శపధం చేసి, బయటకు వచ్చి పావుగంట గుక్కపెట్టి ఏడ్చేశాడు. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్ని నీచ రాజకీయాలు అయినా చేస్తారు. ఈ రాష్ట్ర రాజకీయాలకు పట్టిన చీడ పురుగు చంద్రబాబే.

Leave a Reply