Suryaa.co.in

Andhra Pradesh

ఆధ్యాత్మిక నగరిలో అకృత్యాలు

– తిరుపతి పవిత్రతను మంటగలుపుతున్నారు
– తిరుచానూరు సమీపంలో పబ్ తరహా ఈవెంట్ పై చర్యలు తీసుకోవాలి
– మద్యం, మాదకద్రవ్యాల వినియోగం అత్యంత దారుణం
– ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా నిఘా పెంచాలి
– పవిత్ర నగరంలో ఏరులై పారుతున్న మద్యం
– సనాతన ధర్మ ప్రతినిధి పవన్ కళ్యాణ్‌ దీనిపై స్పందించాలి
: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం

తిరుపతి: గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుపతి పవిత్రతను మంటగలిపేలా కూటమి ప్రభుత్వంలో అకృత్యాలు జరుగుతున్నాయని టిటిడి మాజీ చైర్మన్, వైయస్ఆర్ సిపి అధికార ప్రతినిధి భూమక కరుణాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలోని క్యాంప్ కార్యాలయంలో మీడియా తో మాట్లాడుతూ.. తిరుచానూరు సమీపంలో పబ్ ను తలపించేలా నిర్వహించిన ఈవెంట్ లో మద్యం, మాదకద్రవ్యాల వినియోగం జరిగిందనే వార్తలు కలిచివేస్తున్నాయని అన్నారు. దేవదేవుడు కొలువైన తిరుపతిలో కూటమి ప్రభుత్వ అసమర్థ పాలన వల్లే ఇటువంటి దుష్టసంస్కృతికి బీజం పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గొప్ప ఆధ్యాత్మిక చరిత్ర ఉన్న తిరుమల తిరుపతిలో పబ్ తరహా ఈవెంట్ల నిర్వహణ వెనుక అధికారపార్టీ అండదండలు ఉండటం ఆందోళనకరం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ నగరంలో మద్యం విచ్చలవిడిగా ప్రవహిస్తోంది. మద్యం దుకాణాలను ఉదయం ఏడుగంటలకు తెరుస్తూ, రాత్రి పది గంటలు దాటిన తరువాత కూడా కొనసాగిస్తున్నారు.

ప్రభుత్వం నిర్ధేశించిన సమయాలను కూడా పాటించకుండా మద్యం దుకాణాలు, రెస్టారెంట్లను నిర్వహిస్తున్నా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. చివరికి తిరుపతిలో మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాలు, అమ్మాయిలతో నృత్యాలు, డీజే పేరుతో పాశ్చాత్యసంగీతాలతో తిరుపతి ఔచిత్యాన్నే ప్రశ్నించేలా ఘటనలు ప్రారంభమయ్యాయి అంటే దానికి కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

సనాతన ధర్మంను కాపాడేందుకు అవతరించిన పీఠాధిపతి పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై స్పందించాలి. డిప్యూటీ సీఎం హోదాలో తిరుపతిలో ధర్మానికి జరుగుతున్న విఘాతంపై ఆయన తన దండంను బయటకు తీసి, కారకులపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. తిరుపతి పవిత్రత కోసం ప్రజలతో కలిసి వైయస్ఆర్ సిపి ఉద్యమాన్ని చేపట్టేందుకు సిద్దంగా ఉంది.

LEAVE A RESPONSE