-టీ ఆర్ ఎస్ హైదరాబాద్ జిల్లా అద్యక్షుడు మాగంటి గోపీనాథ్
విశ్వనగరంగా ప్రసిద్ది చెందుతున్న హైదరాబాద్ నగరాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి దగా చేసింది. వేల కొట్ల పన్నులను ప్రతియేటా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు జమచేస్తున్నా కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపులో మాత్రం ప్రతియేటా అన్యాయం చేస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో మూసీ ప్రక్షాళన కోసం నిధులు మంజూరు చేయాలని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం కనీసం కేంద్ర బడ్జెట్‌లో అయినా నిధులు కేటాయిస్తుందేమో అని ఎదురుచూసినా ఫలితం దక్కలేదు. ఇక మెట్రోరైల్ విస్తరణతో పాటు నగరంలోని రహదారులు. ఇతర మౌళిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు నిధులు కేటాయించాలని కోరినా కేంద్రం పట్టించుకోలేదు. హైదరాబాద్ నగరానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రజలకు ఏం సమాధానం చెబుతారు.
ఊక దంపుడు ఉపన్యాసాలను దంచే బీజేపీ నాయకులు సిగ్గుతో తలదించుకోవాలి. ఏడేళ్లుగా సమర్థవంతమయిన పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీగా మారింది. మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో ప్రపంచ స్థాయి సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వానికి మాత్రం హైదరాబాద్ నగరం అంటే ఏ మాత్రం ప్రేమలేదనే విషయం మరోసారి కేంద్ర బడ్జెట్‌లో తేలిపోయింది. ఇక్కడి బీజేపీ నాయకులు ఇకనుంచి హైదరాబాద్ గురించి, తెలంగాణ గురించి మాట్లాడకుంటేనే వారికి మర్యాద దక్కుతుంది. నిధులు తేవడం చేతగాని నాయకులకు మాట్లాడే హక్కు లేదు.