నిత్యావసర వస్తువుల ధరలు మన ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, దేశమంతా పెరిగాయని రాష్ట్ర ప్రభుత్వం బుకాయిస్తున్నది. కేంద్రంలో మోడీ – రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాల నిర్వాకం పర్యవసానంగానే ధరలు పెరిగాయన్నది వాస్తవం.
2మోడీ ప్రభుత్వానికి జీఎస్టీ వసూళ్ళ ద్వారా వార్షిక ఆదాయం ఇబ్బడముబ్బడిగా పెరిగిందని అధికారిక గణాంకాలే తెలియజేస్తున్నాయి. అంటే, సామాన్య ప్రజల చెవులువడబిండి, కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయాన్ని పెంచుకొన్నాయి. జీఎస్టీ విధానం అమలు వల్ల “మొత్తం పన్ను భారం హేతుబద్ధీకరించబడుతుందని, ధరలు తగ్గుతాయని” ఊదరగొట్టారు. కానీ, ఆచరణలో ధరలు పెరిగి, ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా క్షీణించింది.
వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉన్నది. ఆహార భద్రతను పరిగణలోకి తీసుకొని ఐక్యరాజ్య సమితి 2023 సంవత్సరాన్ని “అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం”గా ప్రకటించింది. అయినా, చిరుధాన్యాలు మరియు పాల ఉత్పత్తులపైన కూడా జీఎస్టీని విధిస్తున్నారు. మందులపైన 12% నుండి 18% వరకు జీఎస్టీని వసూలు చేసుకొంటూ గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం వగైరా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులును కూడా తీవ్రంగా దోపిడీ చేస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా భారత దేశంలో పెట్రోల్ ఉత్ఫత్తులైన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు తగ్గకపోగా రెండింతలు పెంచేశారు. పెట్రోల్, డీజిల్ రేట్లను ప్రతిరోజూ సవరించే విధానాన్ని అమలు చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర, ఇంధనానికి ఉన్న డిమాండ్, డాలర్ తో రూపాయి మారకం రేటు, కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలుచేసే అమ్మకపు పన్ను/ విలువ ఆధారిత పన్ను (వ్యాట్), తదితర అంశాలు ప్రభావితం చేస్తాయి.
2014 నవంబరులో లీటరు పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకం రు.9.20 పై., లీటరు డీజిల్ పై రు.3.46 పైసలు ఉండేది. కోవిడ్ మహమ్మారితో ప్రజల ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా తయారైన పూర్వరంగంలో, 2020 జూన్ లో మోడీ ప్రభుత్వం పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రు.32.98 పై., డీజిల్ పై లీటరుకు రు.31.83 పైసలకు పెంచి అడ్డగోలుగా దోపిడీ చేసింది. 2023 జనవరి నుండి పెట్రోల్ పై లీటరుకు రు.19.98 పై., డీజిల్ పై లీటరుకు రు.15.80 పైసలు వసూలు చేస్తున్నది. 14.2 కె.జీ.ల బరువున్న వంట గ్యాస్ సిలెండర్ ధర 2016 సెప్టంబరులో రు.478 ఉంటే 2023 మార్చి నాటికి రు.1,119 వరకు పెంచి, ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొంత రాయితీ ప్రకటించి, ప్రస్తుతం రు.919 లకు సరఫరా చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం వసూలుచేసే ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలుచేసే అమ్మకపు పన్ను/వ్యాట్ మరియు డీలర్ కమీషన్ కలిపి పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తారు. వ్యాట్ పద్దు క్రింద ఎంత వసూలు చేసుకోవాలన్న అంశం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్నది. అందువల్ల వివిధ రాష్ట్రాల మధ్య వ్యాట్ విధింపులో వ్యత్యాసాలు ఉన్నాయి. ఎక్సైజ్ సుంకం, వ్యాట్, డీలర్ కమీషన్ కలిపిన తర్వాత పెట్రోల్, డీజిల్ రిటైల్ అమ్మకం ధరను గమనిస్తే రెట్టింపుగా ఉన్నది.
నిత్యావసర వస్తవుల ధరల పెరుగుదలకు పెట్రోల్, డీజిల్ ధరలు ప్రధాన కారణం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వసూలు చేస్తున్న “వ్యాట్ మరియు సెస్”లను పరిశీలిస్తే నిత్యావసర సరుకుల ధరలు దేశ వ్యాపితంగా పెరిగాయంటున్న ప్రభుత్వం యొక్క డొల్లతనం బయటపడుతుంది. అలాగే, “గోరుచుట్టపై రోకటి పోటు” అన్న సామెత గుర్తుకొస్తుంది.
పెట్రోల్, డీజిల్ ధరల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో లీటర్ పెట్రోల్, లీటర్ డీజిల్ ధరలను ఇరుగు పొరుగు రాష్ట్రాల రాజధాని నగరాలలోని ధరలతో పోల్చిచూద్దాం. నిత్యావసర వస్తువుల ధరలు ఇతర రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో అధికంగా ఉన్నాయో! లేదో! అప్పుడు ఎవరికైనా బోధపడుతుంది.
బెంగుళూరులో ఈ రోజు లీటర్ డీజిల్ ధర రు.87.89 పై., చెన్నయ్ లో రు.94.46 పై., భుభనేశ్వర్ లో రు.94.68 పై., హైదరాబాదులో రు.97.82 పై., విజయవాడలో రు.99.51 పైసలు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డీజిల్ పై 22.25% వ్యాట్, అది సరిపోదన్నట్లు లీటరుకు అదనంగా రు.4/-, రహదారుల అభివృద్ధి “సెస్” (రోడ్లు మాత్రం అధ్వాన్నంగా తయారైనాయి) పేరుతో లీటరుకు మరొక రు.1/- వసూలు చేస్తున్నది. కర్ణాటకలో అమ్మకపు పన్ను 14.34%, తమిళనాడులో 11% వ్యాట్ తో పాటు లీటరుకు అదనంగా రు.9.62 పై., ఒడిసాలో 24% మరియు తెలంగాణలో 27% వ్యాట్ వసూలు చేస్తున్నారు.
బెంగుళూరులో ఈ రోజు లీటర్ పెట్రోల్ ధర రు.101.94 పై., చెన్నయ్ లో రు.102.86 పై., భుభనేశ్వర్ లో రు.103.19 పై., హైదరాబాదులో రు.109.66 పై., విజయవాడలో రు.111.76 పైసలు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్రోలుపై 31% వ్యాట్, అదనంగా లీటరుకు రు.4/-, రహదారుల అభివృద్ధి “సెస్” పేరిట లీటరుకు మరొక రు.1/- వసూలు చేస్తున్నది. కర్ణాటకలో అమ్మకపు పన్ను 25.92%, తమిళనాడులో 13% వ్యాట్ తో పాటు లీటరుకు అదనంగా రు.11.52 పై., ఒడిసాలో 28% మరియు తెలంగాణలో 35.20% వ్యాట్ వసూలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రాల్లో డీజిల్, పెట్రోల్ ధరలు తక్కువగా ఉండంతో వాహనదారులు సరిహద్దులు దాటిన తర్వాత డీజిల్, పెట్రోల్ పోయించుకొంటున్నారు. రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనదారులు ట్యాంకు నిండా పోయించుకొని వస్తున్నారు. పర్యవసానంగా రాష్ట్రం ఆదాయాన్ని కోల్పోతున్నది.
మాఫియా ముఠాలు తయారై పొరుగు రాష్ట్రాల నుండి డీజిల్, పెట్రోల్ ను అక్రమ రవాణా ద్వారా అక్రమార్జనకు పాల్పడుతున్నారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతం నుంచి డీజిల్ ను అక్రమ రవాణా చేసి ఏకంగా ఏ.పి.ఎస్.ఆర్.టి.సి.కే సరఫరా చేసిన కుంభకోణానికి సంబంధించిన వార్త ప్రసారమాధ్యల్లో వచ్చిన విషయం విధితమే కదా!
పెట్రోల్ – డీజిల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు దేశంలోని ఇతర రాష్ట్రాల స్థాయిలోనే మన రాష్ట్రంలో ఉన్నాయా! ప్రజలే విజ్ఞతతో ఆలోచించుకోవాలి.