రుతుపవనాలొచ్చేశాయోచ్‌..

కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు

భారత వాతావరణ శాఖ అధికారులు చల్లని కబురు చెప్పారు.ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు భారత భూభాగాన్ని తాకాయని తెలిపారు. రుతుపవనాలు ఇవాళ కేరళ తీరాన్ని తాకినట్లు వెల్లడించారు.

గత సంవత్సరంతో పోలిస్తే ఏడు రోజులు ఆలస్యంగా రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయని చెప్పారు.దక్షిణ అరేబియా సముద్రంలోని అన్ని ప్రాంతాలకు రుతుపవనాలు వ్యాపించినట్లు ఐఎండీ తన ప్రకటనలో తెలిపింది.సెంట్రల్ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ సహా కేరళ, తమిళనాడులోని చాలా వరకు ప్రాంతాలపై రుతుపవనాలుఆవహించాయని వివరించింది.

కొమొరిన్ కేప్ గల్ఫ్ ఆఫ్ మన్నార్తో పాటు ఆగ్నేయ, మధ్య, ఈశాన్య బంగాళాఖాతానికి గురువారం రుతుపవనాలు వ్యాపించాయని తెలిపింది.సాధారణంగా జూన్ 1న రుతుపవనాలు కేరళను తాకుతుంటాయి.కొన్నిసార్లు ఏడు రోజులు అటూ ఇటూ అయ్యే అవకాశం ఉంది.రుతుపవనాలు జూన్ 4న కేరళ తీరాన్ని తాకుతాయని గత నెలలో వాతావరణ శాఖ అంచనా వేసింది.ఐఎండీ అంచనాలకు నాలుగు రోజులు ఆలస్యంగా రుతుపవనాలు రావడం గమనార్హం.