మనసును తాకే కథ
బస్సు నుంచి దిగి నా జేబులో చేయి పెట్టి చూస్తే పర్సులేదు.
ఎవరో కొట్టేసారు. గుండె గుభిల్లుమంది.
పర్సులో నూట యాభయ్ రూపాయలు, అమ్మకి రాసిన ఉత్తరం ఉన్నాయి.
ఆ ఉత్తరం రాసిపెట్టి మూడు రోజులయింది కాని పోస్ట్ చేయడానికి మనస్సు రాలేదు.
వున్న ఉద్యోగం పోయింది అని రాయాలంటే ఎలాగో అనిపించింది.
నూట యాభై రూపాయలు పెద్ద మొత్తం కాకపోవచ్చు కాని ఉద్యోగం లేదుకదా.
మళ్ళీ దొరికేదాకా వున్నదానితోనే నెట్టుకు రావాలి.
ఉత్తరంలో అదే రాసాను.
ప్రతినెలా పంపించే అయిదు వందలు ఇకనుంచి పంపడం కుదరకపోవచ్చు అని.
కానీ చెప్పాకదా!
పోస్ట్ చేయలేదు.
కొన్ని రోజుల తరువాత అమ్మ నుంచి ఉత్తరం వచ్చింది.
అందులో ఏం రాసి వుంటుంది. డబ్బు అందలేదు త్వరగా పంపించమని రాసి ఉంటుంది.
కాని ఆ ఉత్తరం చూసిన తరువాత నోటమాట రాలేదు.
‘బాబూ! నువ్వు పంపిన అయిదు వందల రూపాయల మనియార్డర్ అందింది. నువ్వు ఎలా అయినా డబ్బు పంపిస్తావని తెలుసు.”
అని ఇంకా ఏవేవో రాసింది.
డబ్బు పంపలేదు, కానీ డబ్బు ముట్టిందని రాసింది.
ఎలా జరిగింది?
కొన్ని రోజుల తరువాత మరో ఉత్తరం వచ్చింది.
అది అమ్మనుంచి కాదు.
రాత గజిబిజిగా వుంది.
‘అన్నా! నీ పర్స్ కొట్టేసిన వాడిని నేనే.
మీ అమ్మకు పంపిన డబ్బులో నూట యాభై నీది.
మరో 350 నేను కలిపి మనియార్డర్ చేసాను.
అమ్మ ఆకలితో పస్తు పండుకోకూడదు.
అమ్మ ఎవరికయినా అమ్మే.’
– ఎస్వీ రమణ