హవ్వ… రాజధానిపై పూటకో మాట?!

-తలోక మాట మాట్లాడుతున్న బుగ్గన, సజ్జల, ధర్మానలు
-మరి సీఎం ఎందుకు మాట్లాడడం లేదు?
-వింతగా ఉన్న బుగ్గన సుద్దులు
-ఆస్తులన్నీ అమ్మేసి ఇప్పుడు విశాఖ నే రాజధాని అంటే నవ్వుకుంటున్న ప్రజలు
-మూడవ కృష్ణుడితోనైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ కి మోక్షం లభిస్తుందా?
-వివేకాను ఆయన కుటుంబ సభ్యులే హత్య చేసినట్లుగా దుష్ప్రచారం చేస్తున్న తొకడ చానల్స్ కథనాలు
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

రాష్ట్ర రాజధాని గురించి మంత్రివర్గ సభ్యులు పూటకొక మాట మాట్లాడుతుంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమీ మాట్లాడకపోవడం ఆశ్చర్యంగా ఉందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు అన్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు తమకు తోచినట్లుగా మాట్లాడడం విస్మయాన్ని కలిగిస్తోందన్నారు. పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటు చేసిన రాజధానిని, తిరిగి పార్లమెంటు చట్టం ద్వారానే మార్చడానికి వీలవుతుందని చెప్పారు. అంతేకానీ, బుగ్గన, సజ్జల, ధర్మాన ప్రసాదరావు నోటికొచ్చినట్లు మాట్లాడినంత మాత్రాన రాష్ట్ర రాజధాని మారదన్నారు. మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడితే రానున్న ఎన్నికల్లో ప్రజలు గూబ గుయ్యిమనిపిస్తారని హెచ్చరించారు.

రాజధాని అంశంపై తన మంత్రివర్గ సహచరులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నప్పటికీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకనీ మాట్లాడడం లేదని రఘురామకృష్ణం రాజు నిలదీశారు. ముఖ్యమంత్రి తో పాటు , మంత్రివర్గ సభ్యులు స్థిరత్వంలో అస్థిరత్వంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. మంత్రుల మాటలు చూసి… ప్రజలు మాత్రం ప్రభుత్వ పెద్దల మైండ్ దొబ్బిందని అనుకుంటున్నారని చెప్పారు. బుధవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రాజధాని కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని, ఈనెల 23వ తేదీ నుంచి వాదనలు ప్రారంభం కానున్నాయని గుర్తు చేశారు. సుప్రీం కోర్టులో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్ దాఖాలు ద్వారా, అమరావతియే రాజధాని అని స్పష్టం చేసిందన్నారు. రాజధాని ఎంపిక కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి, కమిటీ చేసిన సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 5, 6 నియమం ప్రకారమే రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేసి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టరన్నారు. శాసనసభ అంతా ఏకగ్రీవంగా ఆమోదించిన తరువాత, పార్లమెంటులో చట్టం ద్వారా , రాజధాని ప్రాంతాన్ని ఖరారు చేసి, ఆ ప్రాంత అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తన వంతు నిధులను కూడా వెచ్చించినట్లుగా వెల్లడించిందని పేర్కొన్నారు. అయినా ప్రభుత్వ పెద్దలకు అర్థమయిందో లేదో, అర్థమయి కూడా… అర్థం కానట్లు నటిస్తున్నారో తెలియడం లేదన్నారు. అయినా, ప్రభుత్వ పెద్దల పప్పులేమి ఉడకవని రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు.

విశాఖ ఒక్కటే రాజధానట…
విశాఖ ఒక్కటే రాజధాని అని అనుకున్నట్లు, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మూడు రాజధానులనే అంశం ప్రాచుర్యంలోకి వచ్చిందని బెంగళూరులో జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన మనసులో మాట చెప్పారని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. కర్ణాటకలో బెల్గాం ప్రాంతంలో ఒక అసెంబ్లీ సెషన్ నిర్వహించినట్లుగానే, తమ రాష్ట్రంలోని గుంటూరు పట్టణంలో అసెంబ్లీ సెషన్ నిర్వహిస్తామని పేర్కొన్నారన్నారు. కర్నూలేమి న్యాయ రాజధాని కాదని, కర్ణాటకలోని గుల్బర్గాలో ఉన్నట్లుగానే ప్రిన్సిపల్ బెంచ్ ను ఏర్పాటు చేస్తామని చెప్పారన్నారు. కర్ణాటక కు బెంగళూరు పట్టణం రాజధాని ఎలాగో, అలాగే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధాని అని పేర్కొన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, విశాఖలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు. పార్లమెంట్, అసెంబ్లీలలో చేసిన చట్టానికి విలువ లేదన్నట్లు గా, 1937లో కుదుర్చుకున్న శ్రీబాగ్ ఒప్పందానికి మాత్రమే విలువ ఉన్నట్లుగా బుగ్గన చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించారు. బుగ్గన వ్యాఖ్యలతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వెలువైతే అవకాశం ఉందని గుర్తించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని పేర్కొనడం పరిశీలిస్తే, మంత్రి ఒక మాట మాట్లాడుతారని… ప్రభుత్వ సలహాదారు మరొక మాట మాట్లాడుతారని వ్యంగ్యంగా విమర్శించారు.

మంత్రుల మాటలతో అమరావతి రైతులు ఆందోళన చెందవద్దు
రాష్ట్ర మంత్రులు మాట్లాడుతున్న మాటలను చూసి, అమరావతి రైతులు నవ్వుకోవాలి తప్పితే, ఆందోళన చెందవద్దని రఘురామకృష్ణం రాజు సూచించారు. ఆర్థిక నేరాల కేసులు, బాబాయి హత్య కేసు, రాజధాని కేసులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం తో ప్రభుత్వ పెద్దలు సంధి ప్రేలాపనలు చేస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. విశాఖ కలెక్టర్ కార్యాలయం, ఆర్డీవో, తాలూకా ఆఫీసును తాకట్టు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం, విశాఖను రాజధానిగా పేర్కొనడాన్ని స్థానికులు ఎవరు స్వాగతించడం లేదన్నారు. ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వలేక ఆర్థిక అవస్థలు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం, మెడికల్, ఇంటర్మీడియట్ బోర్డు నిధులతో పాటు, ఆయుష్ కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 65 కోట్ల రూపాయలను కూడా నొక్కేసి, ఇప్పుడు తాను విశాఖ నగరాన్ని అభివృద్ధి చేస్తానంటే ప్రజలు ఎవరు ప్రభుత్వ పెద్దల మాటలను నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. మాటల్లో కాదు, చేతల్లో చూపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

విస్తృత ప్రచారం కావాలంటే ఖర్చులేని డిపి పథకాన్ని ప్రవేశపెట్టాలి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు విస్తృత ప్రచారం లభించాలని కోరుకుంటే, ప్రభుత్వ సంక్షేమ పథకాల యొక్క ప్రతీ లబ్ధిదారుడు చిక్కటి చిరునవ్వు చిందించే తన ఫోటోనే డిపి గా పెట్టుకోవాలని ఆదేశించాలని రఘురామకృష్ణం రాజు వ్యంగ్యాస్త్రాలను సంధించారు. ఒకవేళ ఎవరైనా ప్రభుత్వ పథక లబ్ధిదారుడు ముఖ్యమంత్రి ఫొటోను డిపి గా పెట్టుకోకపోతే, అతని కుటుంబానికి ప్రభుత్వ పథకాలన్నీ కట్ చేస్తామని హెచ్చరించాలంటూ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రజల ఆస్తి పత్రాలపై తన బొమ్మను ముద్రిస్తున్నారని, ఇక ఇళ్లకు స్టిక్కర్లను అతికించే కార్యక్రమాన్ని చేపట్టనున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఇంట్లోకి వెళ్లిన, పొలానికి వెళ్లిన ముఖ్యమంత్రి చిక్కటి చిరునవ్వు ఫోటోను చూడాల్సిందేనని… ఇంటికి వచ్చి కాసేపు సేద తీరే సమయములోనూ సెల్ ఫోన్ వెనుక అతికించిన స్టిక్కర్ వల్ల ఆయన ఫోటోనే చూడక తప్పని పరిస్థితి నెలకొందన్నారు. సొంతంగా దమ్మిడీ ఖర్చు చేయని ప్రభుత్వ పథకాలకు తన తండ్రి పేరు, లేదంటే తన పేరు పెట్టుకుంటున్న జగన్మోహన్ రెడ్డి… సొంత ఆస్తుల కు మాత్రం పెట్టుకోవడం లేదన్నారు. సిమెంట్ కంపెనీకి భార్య పేరు పెట్టుకున్న ఆయన, హైడ్రో కంపెనీకి సండూర్ అని, మీడియా సంస్థకు సాక్షి అని పెట్టుకున్నారని గుర్తు చేశారు. ప్రతి గ్రామంలో పట్టణంలో నున్న పబ్లిక్ పార్క్ కు మాత్రం వైయస్సార్ పార్కు అని, బస్టాండుకు ఆసుపత్రులకు వైయస్సార్ బస్టాండ్, ఆసుపత్రి అని పేరు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనల కారణంగా మా నమ్మకం నువ్వే జగనన్న అనే స్టిక్కర్ ను ప్రభుత్వ కార్యాలయానికి అతికించగా, జగన్మోహన్ రెడ్డి ముఖము కనిపించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారని ఒక మిత్రుడు తెలియజేశారని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. అయితే రానున్న సాధారణ ఎన్నికల సమయంలో పబ్లిక్ పార్క్, బస్టాండ్, ఆసుపత్రులకు ఉన్న వైయస్సార్ పేరును కూడా ఎన్నికల సంఘం అధికారులు తొలగిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఎన్నికల సమయములో ఇటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో కాబోలు ఎన్నికల వ్యవస్థని నాశనం చేయడానికి ఇంటింటికి స్టిక్కర్ పథకాన్ని తీసుకువచ్చి ఉంటారన్న అనుమానాన్ని రఘురామకృష్ణంరాజు వ్యక్తం చేశారు.

కడప స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపనలు… చెల్లి పెళ్లి మళ్లీ జరగాలన్నట్టుగా ఉంది
కడప స్టీల్ ఫ్యాక్టరీ కి శంకుస్థాపనల తీరు పరిశీలిస్తే, ఒక సినిమాలో తనికెళ్ల భరణి తన చెల్లికి మళ్లీ మళ్లీ జరగాలి పెళ్లి అని కోరుకున్నట్లుగా ఉందని రఘు రామకృష్ణంరాజు అపహాస్యం చేశారు. ఇప్పటికే మూడుసార్లు కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయగా, నాలుగవసారి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక మిలియన్ టన్ను సామర్థ్యం కలిగిన కడప స్టీల్ ఫ్యాక్టరీకి ఇప్పటికే వైయస్ రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపనలు చేసిన విషయం తెలిసిందేనని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే జగన్మోహన్ రెడ్డి కూడా కడప స్టీల్ ఫ్యాక్టరీ కి శంకుస్థాపన చేసి, మూడేళ్ల వ్యవధిలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆఖరి సంవత్సరంలో అసమర్థుడే స్టీల్ ఫ్యాక్టరీ కి శంకుస్థాపన చేస్తారని, సమర్ధుడైన వ్యక్తి తొలినాళ్లలోనే శంకుస్థాపన చేసి తన పదవీకాలంలో పూర్తి చేస్తారని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకే వర్తిస్తాయన్నారు. సజ్జన్ జిందాల్ ప్రముఖ పారిశ్రామికవేత్త అని ఆయనకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తే కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తవుతుందని, కాదని మామూళ్ల కోసం వేధిస్తే అతను కూడా ఈ ఫ్యాక్టరీని నిర్మించకపోవచ్చునని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు.

అప్పుల చిట్టా తేలిపోతుంది కదా
రాష్ట్ర ప్రభుత్వ అప్పుల చిట్టా తేల్చడానికి ప్రభుత్వమే ముందుకు రావాలని రఘు రామకృష్ణంరాజు సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఆడిటర్లతోపాటు, ప్రైవేటు ఆడిటర్ల ఆహ్వానించి పత్రికా విలేకరుల సమక్షంలో బహిరంగంగా ప్రభుత్వమే ముందుకొచ్చి వివరాలను వెల్లడిస్తే అప్పుల చిట్టా తేలిపోతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు 9 లక్షల కోట్ల రూపాయలని ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్త కథనంపై ప్రభుత్వ సలహాదారు కృష్ణ స్పందించిన తీరు విస్మయాన్ని కలిగించిందన్నారు. గత ప్రభుత్వం కంటే తాము తక్కువ శాతమే అప్పులు చేశామని పేర్కొన్న ఆయన, రాష్ట్ర ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చి కార్పొరేషన్ పేరిట చేసిన అప్పుల గురించి మాట్లాడకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వం గ్యారెంటీ లేకుండానే కార్పొరేషన్ల పేరిట చేసిన అప్పులను ఎవరు చెల్లిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వమే చెల్లించాలి కదా అంటూ నిలదీశారు. గత ప్రభుత్వం 150 శాతం అప్పులు చేస్తే, తాము వందకులోపే 70 నుంచి 80 శాతం అప్పులు మాత్రమే చేశామని కృష్ణ పేర్కొన్న తీరు సామాన్యులకు, సాక్షి పేపర్ చదివే వారికి అర్థం కాకపోవచ్చునని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత బకాయిలు లక్ష 12 వేల కోట్ల రూపాయలపాటు , ఐదేళ్లలో మరో లక్షన్నర కోట్ల రూపాయల అప్పులు చేశారన్నారు. అయితే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం , గత ప్రభుత్వ ఐదేళ్ల వ్యవధిలో చేసిన అప్పుల కంటే, మూడేళ్ల పాలనలో చేసిన అప్పులే అధికమైనప్పటికీ , తాము తక్కువ అప్పులే చేశామని చెప్పుకుంటూ ప్రజలని మభ్యపెట్టి ప్రయత్నాన్ని చేస్తోందని విమర్శించారు. ఐదేళ్ల టిడిపి ప్రభుత్వ హయాంలో లక్షన్నర కోట్ల రూపాయల అప్పులు చేయగా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడేళ్లలోనే 1,80,000 కోట్ల రూపాయల అప్పులు చేసిందన్నారు. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుల శాతం 200 నుంచి 250 వరకు ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు లక్షన్నర కోట్లు ఉంటాయని అంచనా వేయగా, కేవలం పాతిక వేల కోట్లు మాత్రమేనని కృష్ణ పేర్కొన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వము, కాగ్ లెక్కలు అడిగితే చెప్పని రాష్ట్ర ప్రభుత్వం, సి ఎఫ్ ఎం ఎస్ సైట్ లోను అప్డేట్ చేయకపోవడం వల్ల, అసలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలెన్నో ఎవరికి అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు . అప్పులపై ఆందోళన ఎందుకని… ప్రజలకు పంచడానికి తాను తొమ్మిది లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసినట్లుగా జగన్మోహన్ రెడ్డి చెప్పవచ్చు కదా అంటూ రఘురామకృష్ణం రాజు వ్యంగ్యంగా విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల గురించి ప్రభుత్వ సలహాదారు కృష్ణను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఒకటి రెండు రోజులు ఆలస్యం అవుతాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటివరకు ఉద్యోగ ఉపాధ్యాయులతో పాటు విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు కూడా చెల్లించలేదన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులే హత్య చేసినట్లుగా కొన్ని తోకడ చానల్స్ దుష్ప్రచారాన్ని చేస్తున్నాయని మండిపడ్డారు.

Leave a Reply