– ఖమ్మం స్టేషన్ లో పలు రైళ్లు ఆపాలని వినతి
తమిళనాడు, బీహార్ వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఖమ్మం రైల్వే స్టేషన్ లో తమిళనాడు, గయా మాస్ సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్ట్ ఇవ్వాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కోరారు. ఈ మేరకు ఆయన గురువారం పార్లమెంట్ ఆవరణలోని రైల్వే మంత్రి కార్యాలయంలో అశ్వినీ వైష్ణవ్ తో భేటీ అయ్యారు. ఖమ్మం అతి పురాతన జిల్లా కేంద్రమని.. చుట్టుపక్కల ఉన్న వందలాది గ్రానైట్ పరిశ్రమలు, క్వారీల్లో తమిళనాడుకు చెందిన వేలాది మంది కార్మికులు పని చేస్తున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
బీహార్ కు చెందిన వలస కూలీలు, ఇతర కార్మికులు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రైస్ మిల్లులు, ఇతర పరిశ్రమల్లో పనులు చేస్తున్నారని తెలిపారు. వీరంతా తమ సొంత రాష్ట్రాలకు ఈ రైళ్ల ద్వారా వెళ్లాలంటే.. విజయవాడ లేదా వరంగల్ వెళ్లాల్సి వస్తుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు ఎంపీ రవిచంద్ర నివేదించారు. సమస్య తీవ్రతను గుర్తించి వీలైనంత తొందరగా రెండు రైళ్లకు ఖమ్మం లో హాల్టింగ్ సదుపాయం కల్పించాలని రవిచంద్ర కోరారు. తక్షణమే నివేదిక తెప్పించుకుని తగిన చర్యలు తీసుకుంటానని రైల్వే మంత్రి హామీ ఇచ్చారు.