– సనాతన హిందూవాదిని అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు?
– ఎంఎస్ రాజు పవిత్ర భగవద్గీత గురించి తప్పుగా మాట్లాడి ఉండకపోయి ఉంటే, ఎందుకు క్షమాపణ చెప్పారు?
– భగవద్గీతపై టీటీడీ బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు అనుచిత వ్యాఖ్యలు
– కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బ తీసిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు
– ఏ నైతికత లేని అలాంటి వ్యక్తిని టీటీడీ బోర్డులో ఎలా నియమించారు?
– తప్పులు ఎత్తి చూపితే కేసులు పెడుతున్నారు?
– ఇదేనా సనాతన హిందూ ధర్మాన్ని కాపాడడమంటే?
– మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
తాడేపల్లి: కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు అతి పవిత్రమైన భగవద్గీతపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆక్షేపించారు. అలాంటి వ్యక్తిని ఇంకా టీటీడీ బోర్డు సభ్యుడిగా కొనసాగించడం అనుచితమని, అందువల్ల వెంటనే ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆలయాల్లో పవిత్రత కొరవడిందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మల్లాది విష్ణు తెలిపారు. చివరకు గోశాలల నిర్వహణ కూడా సక్రమంగా ఉండడం లేదని తేల్చి చెప్పారు.
నిజాయితీ, త్రికరణశుద్ధికి ప్రతీకగా చివరకు న్యాయస్థానాల్లో కూడా ప్రమాణం చేసే అతి పవిత్ర గ్రంథం భగవద్గీత. అలాంటి భగవద్గీతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజును ఇంకా టీటీడీ బోర్డు సభ్యుడిగా ఎలా కొనసాగిస్తున్నారు? అసలు అలాంటి వ్యక్తిని ఆ పదవిలో నియమించిన ప్రభుత్వాన్ని ఏమనాలి? దీనికి టీడీపీ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అసలు మత గ్రంథాల గురించి ఇంత తేలిగ్గా మాట్లాడిన వ్యక్తులు టీటీడీ చరిత్రలో ఎవరూ లేరు.
ఒకవేళ నిజంగా ఎంఎస్ రాజు, పవిత్ర భగవద్గీత గురించి తప్పుగా మాట్లాడి ఉండకపోయి ఉంటే, ఎందుకు క్షమాపణ చెప్పారు? దీనికి ఎంఎస్ రాజు వద్ద సమాధానం ఉందా? అసలు అలాంటి వ్యక్తులకు టీటీడీ బోర్డులో స్థానం కల్పించడం చాలా తప్పు. వెంటనే ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించాలి.
ఇంత జరుగుతున్నా, తాను సనాతన హిందూవాదిని అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు? పవిత్ర భగవద్గీతపై ఏకంగా టీటీడీ బోర్డు సభ్యుడు అంత దారుణంగా మాట్లాడినా, ఆయన కనీసం ఎందుకు ఖండించడం లేదు.
టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ గోశాలలో జరుగుతున్న దారుణాల గురించి మాట్లాడితే, ఆయన్ను తప్పు బట్టి అక్రమ కేసు పెట్టారు. మరి మొన్నటి టీటీడీ బోర్డు సమావేశంలో ఏం జరిగింది? టీటీడీ నిర్వహించాల్సిన గోశాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పాలనే విషయం మీద చర్చించి నిర్ణయం తీసుకోవడానికి సబ్ కమిటీ వేశారు. ఇదేనా మీ ధార్మికత, ఇదేనా మీ రాష్ట్రంలో గోసంరక్షణ?
రాష్ట్రంలో గోసంరక్షణకు ఎక్కడా స్థానం కనిపించడం లేదు. దానికి ఉదాహరణే నిన్న చిన్నతిరుపతి (ద్వారకా తిరుమల) లో ఆవు, దూడ మరణించడం. కారణాలు ఏదైనా కావొచ్చు. గోశాల నిర్వహణలో, గోవుల సంరక్షణలో, గోవులను కాపాడటంలో మీ ప్రభుత్వానికి కానీ, మీ ఆధీనంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖకు కానీ ఎక్కడ కూడా శ్రద్ద, బాధ్యత లేదని స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వం. ఈ ప్రభుత్వం హిందూ మతాన్ని అగౌరవపరిచే వారిని, కించపరిచే వారిని ప్రోత్సహిస్తోంది. హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ఈ 16 నెలల్లో జరిగిన సంఘటనలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భగవద్గీతను కించపరిచే విధంగా మాట్లాడటంతో పరాకాష్టకు చేరింది. కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్న వారి పట్ల ఈ ప్రభుత్వం ఇంకా ఉదాసీనంగా వ్యవహరిస్తోంది.