– కొనుగోళ్ల కోసం బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటే దాని వడ్డీ కూడా కేంద్రమే చెల్లిస్తుంది
– మరి రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనడంలో ఎందుకు ఆలస్యం చేస్తోంది?
– బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు
నల్లగొండ: భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతుల సమస్యలు తెలుసుకోవడంతో పాటు మార్కెట్ యార్డుల్లో పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు నల్లగొండ జిల్లాలోని నకిరేకల్, చిట్యాలలో కొనుగోలు కేంద్రాలకు వెళ్లారు. అక్కడి రైతులతో వర్షాల ప్రభావం, పంటల నష్టాలు, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల విషయంలో అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరి వంటి విషయాల గురించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రైతులు భారీ వర్షాలకు తమ పంటధాన్యం తడిసిపోయిందని, రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు సకాలం ఏర్పాటు చేయలేదని, తమ రెక్కల కష్టం నీటిపాలైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు మీడియాతో ఏం మాట్లాడారంటే.. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలతో పంట నష్టాల పరిస్థితిని తెలుసుకునేందుకు, కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, బాధిత రైతులకు అండగా నిలిచేలా భారతీయ జనతా పార్టీ ఆధ్శర్యంలో మూడు బృందాలను వివిధ జిల్లాలకు పంపడం జరిగింది.
రైతులు పంటలు నష్టపోయాయని, తమ ధాన్యం తడిసి మొలకెత్తే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, ధాన్యంలోని తేమను ఆర్పే మిషన్లు, నిల్వ సదుపాయాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చిన్నకారు రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రైతుల ధాన్యం కొనుగోలును ఆలస్యం చేస్తున్నారు. ట్రాన్స్పోర్టు, బస్తాలు, బస్తా సుతిల్, హమాలి చార్జీలు ఇలా మొత్తం కేంద్రమే రాష్ట్రానికి చెల్లిస్తుంది. సివిల్ సప్లయ్స్ డిపార్ట్ మెంట్ సహా ఐకేపీ వారికి కూడా కేంద్రమే కమిషన్ ఇస్తున్నది. రాష్ట్ర సర్కారు కొనుగోళ్ల కోసం ఒకవేళ బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటే దాని వడ్డీ కూడా కేంద్రమే చెల్లిస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనడంలో ఎందుకు ఆలస్యం చేస్తోంది?
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (MSP)కు ధాన్యం కొనుగోలు చేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి. రైస్ మిల్లర్లు, కాంగ్రెస్ నాయకుల మధ్య జరుగుతున్న దళారీ వ్యాపారాన్ని వెంటనే ఆపాలి. అన్ని కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు—టార్పాలిన్లు, తేమ ఆర్పే మిషన్లు, నిల్వ సదుపాయాలు తక్షణమే కల్పించాలి.