Suryaa.co.in

Features

చిరు నవ్వులతో లేచింది నా పల్లె..

కోడికూతతో పల్లె చిరునవ్వుతో లేచింది
యాపపుల్లతో నోరు శుభ్రం అయ్యింది
ఇంటి ముందు కల్లాపి చినుకుల్లా వర్షిస్తే
ముత్యాలముగ్గు మురిపెంగా మెరిసింది….

హరిత వనాన్ని కప్పుకున్న దుప్పటి పల్లె
స్వచ్ఛమైన నీరుతో సెలయేరుల సవ్వడి
ఆకలి దప్పిక తెలిసిన అన్నదాతల సందడి
దేశానికి వెన్నెముకలా నిలిచిన ఆర్థిక రాబడి..

ఆకాశ పెన్నములో పువ్వులన్ని రాలిపోయే
నేలపై వెలుగుతో రాత్రి మబ్బులు తొలగి పోయె
కొండ సందుల్లో వెలుగుల కాంతి విరజిమ్మే
రాత్రి స్వప్నం పగటి కోరికలా మిగిలిపోయే..

సుప్రభాతము తొలి కిరణాల మేల్కొల్పే
పక్షి కూతలు కిలకిల శబ్దాలు చేస్తుంటే
పశువులన్నీ పరవశించి పాలు వర్షిస్తుంటే
పల్లె సొగసులు పురివిప్పి నాట్య మాడె…

తాటాకుల సందులో బాల భాస్కరుడు
చిరునవ్వులు చిందిస్తూ చూస్తుంటే
వేడి కిరణాలు తనువు మత్తును తొలగిస్తుంటే
కర్తవ్యం కళ్ళముందు కదులుతుంది…

సద్ది మూట సిద్ధమైతే సువాసనలతో కనిపించే
పొలము గట్టుకు వయ్యారపు నడకలతో సాగే
పాదాల కింద పచ్చ గడ్డి తివాచిలా పరిస్తే
మట్టి వాసన ఘుమ ఘుమ లాడుతుంది..

రైతు నాగలి అందంగా నేలను దున్నుతుంది
ఎద్దుల జంట రంకెలు వేస్తూ సాగుతుంది
కొత్త పెళ్లి కూతురు మాదిరి నేల ముస్తాబైంది
పంటల పరమాన్నం నైవేద్యంగా పండిస్తుంది..

పల్లె నేలపై సౌందర్య రాశిలా సూర్యోదయం
అద్భుతమైన ఊహా సుందరిలా చంద్రోదయం
చుక్కల్ని లెక్కిస్తూ గడిపిన ఆనంద సమయం
పల్లె గుడిసెలో అలంకరించి వెన్నెల కాంతులీనే..

– కొప్పుల ప్రసాద్
నంద్యాల
9885066235

LEAVE A RESPONSE