రైతుల హక్కుల సాధన – సంక్షేమమే ధ్యేయంగా పోరాడిన రైతాంగ ఉద్యమ నేత సి. నారాయణస్వామినాయుడు. ఆయన 1970 – 80 మధ్య కాలంలో నిర్వహించిన రైతాంగ ఉద్యమం తమిళనాడు సమాజాన్ని ఉర్రూతలూగించింది. వివిద రూపాలలో ఆందోళనలు, ప్రత్యేకించి వందలు, వేల ఎడ్ల బండ్లతో రాస్తా రోకోలు, “రైతుల గళం” పేరిట 1980 జూలై 5న మద్రాసు మహానగరంలో నిర్వహించిన ప్రదర్శన చారిత్రాత్మకమైనది.
ఆయన కమ్యూనిస్టు కాదు. ఆయన వెనుక ఏ రాజకీయ పార్టీ లేదు. స్వతంత్ర ఆలోచనలున్న ఒక వ్యక్తి, రైతాంగాన్ని ఉత్తేజపరచి, సంఘటితంచేసి, ఉద్యమబాట పట్టించి, తాను ఉద్యమకెరటంగా నిలిచారు. ఆయన దేశ వ్యాపితంగా గుర్తింపు పొందడమే కాదు, శరత్ జోషి, మహేంద్రసింగ్ తికాయత్, తదితరులతో కలిసి రాజకీయాలకు అతీతంగా రైతాంగ ఉద్యమ విస్తరణకు కృషి చేశారు.
తమిళనాడులో ఉవ్వెత్తున ఎగసిపడిన రైతాంగ ఉద్యమ ప్రభావం సరిహద్దుల్లోని చిత్తూరు జిల్లా రైతాంగంపైన పడింది. కానీ, రైతాంగాన్ని ఉద్యమబాట పట్టించే ప్రయత్నం ఎవరూ చేయలేదు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నిర్మాణ రీత్యా బలహీనంగా ఉండేది.
కానీ, గ్రామీణ ప్రాంతంలో పలుకుబడి, ప్రతిష్ట ఉన్న సిపిఐ జిల్లా కార్యదర్శి కా.కె. కృష్ణారెడ్డి (గాజులమండ్యం), సీనియర్ నాయకులు కా. వాసుదేవరెడ్డి (చిగురువాడ), కా. కోదండరామిరెడ్డి (బుచ్చినాయుడుకండ్రిగ), పార్టీ మరియు రైతు నాయకులు, పదిహేను – ఇరవై సంవత్సరాలుగా గ్రామ సర్పంచులుగా ఉన్న కా.యం. వాసుదేవరెడ్డి (పిల్లపాళెం), కా. రామనాథరెడ్డి (పాపానాయుడుపేట), కా.కె. రఘునాథరెడ్డి (జీపాళెం), కా. రఘునాథరెడ్డి (అత్తూరు), కా. చెంగారెడ్డి, కా. రామకృష్ణ (అవిలాల), తదితరులు ఏడెనిమిది మంది ఉండేవారు.
ఆ పూర్వరంగంలో 1980 వేసవి కాలంలో రైతాంగ సమస్యలపై “యువరైతుల సదస్సు” నిర్వహించి, గ్రామీణ యువతను సమీకరించాలని ఏఐఎస్ఎఫ్ గా చొరవ తీసుకున్నాం. కరపత్రం వేశాం. వాటిని గ్రామీణ ప్రాంతాల్లో, ప్రత్యేకించి కమ్యూనిస్టు మరియు రైతాంగ నేతలున్న గ్రామాల్లో పంచడానికి కా.కె. నారాయణ, నేను ఒక రోజు బయలుదేరాం. అప్పుడు సమయం మధ్యాహ్నం 12 గం. లు కావస్తుంది. భోజనం చేసి బస్సు ఎక్కుదామని అన్నాను. అప్పుడేనా అనడంతో బస్సెక్కి పిల్లపాళెం గ్రామానికి మొదట వెళ్ళాం.
మేము వెళ్ళే సమయానికి వాసుదేవరెడ్డిగారు అన్నం తింటున్నారు. మమ్మల్ని చూడగానే అన్నం తిన్నారా! అని అడిగారు. నేనే వెంటనే తినొచ్చాం అన్నాను. కా. నారాయణ, వాడు తిన్నాడు, నేను తినలేదు, నాకు పెట్టండన్నారు. కడుపునిండా తిన్నాడు.
అటుపై పోయిన పని ముగించుకొని వూరు బయటికి వచ్చాక అదేంటి నారాయణ అలా చేశావ్! అని అడిగితే, “ఒకసారి ….. (కడుపు) కాలితే” మరొకసారి మొగమాటంపడవు, అందుకే అలా చేశా! అన్నారు. చేసేది లేక దారిలో వేరుశెనగ గింజలు కొనుక్కొని తింటూ గాజులమండ్యం, అత్తూరు, తదితర గ్రామాలకు వెళ్ళి, నాయకులను మరియు ఆ గ్రామాల్లో తారసపడ్డ యువకులను కలిసి, కరపత్రాలు అందజేసి, విషయాన్ని వివరించి, యువతను సదస్సుకు సమీకరించమని విజ్ఞప్తి చేసి, రాత్రికి తిరుపతి చేరుకొని, అప్పుడు భోజనం చేశాను.
తిరుపతి బస్టాండుకు సమీపంలో ఉన్న బాలాజీ భవన్ లో సదస్సు నిర్వహించాం. మూడొందల మందికిపైగా యువరైతులు, రైతులు హాజరయ్యారు. రైతాంగ సమస్యలపై వ్యక్తల ఉపన్యాసాలు, చర్చలు, అనంతరం తీర్మానాలు, అన్నీ ఆశించినట్లు జరిగాయి. సదస్సు విజయవంతంగా జరిగింది. ఆ సదస్సు కల్పించిన సానుకూల వాతావరణంలో రైతాంగ సమస్యలపై భవిష్యత్తు కార్యాచరణను కొనసాగించమని రైతు సంఘం పెద్దలకు విజ్ఞప్తి చేశాం.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వ్యవసాయం. రైతులకు జీవనోపాధి వ్యవసాయం. దేశానికి వెన్నుముక రైతేనని అందరూ అభివర్ణిస్తుంటారు. అన్నదాత అంటూ వేనోళ్ళ కొనియాడుతుంటారు. జై కిసాన్ – జై జవాన్ అంటూ నినదిస్తారు. స్వతంత్ర భారత దేశంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయబడింది.
రైతన్నల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉన్నది. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన రైతాంగ పోరాటం పాక్షిక విజయం సాధించింది, వ్యవసాయ ఉత్పత్తులకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సు మేరకు మద్దతు ధరలను నిర్ణయించాలని, కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని, తదితర డిమాండ్స్ తో పోరాటం కొనసాగుతూనే ఉన్నది. రైతాంగ ఉద్యమానికి వివిధ వర్గాల ప్రజానీకం వెన్నుదన్నుగా నిలవాలి.
టి. లక్ష్మీనారాయణ
( ఏఐఎస్ఎఫ్ పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి)