-అడ్డొచ్చిన వాళ్లను గొడ్డలితో నరకాలి…ఇదేనా మీ వ్యూహం
-నరికేయండి…మీరే సింగిల్ ప్లేయర్‌గా ఉంటారు
-భారతిరెడ్డికి వై.ఎస్.షర్మిలారెడ్డి చురకలు
-అవినాష్ ఓడితే అరెస్టు ఖాయమని భయం పట్టుకుంది
-పారిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడని వ్యాఖ్యలు
అడ్డొచ్చిన వాళ్లను గొడ్డలితో నరకాలి..వారే అధికారంలో ఉండాలి..ఇదే భారతి వ్యూహమంటూ పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప జిల్లాలో బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. నేను నాకు ఒక ఓటు, వైసీపీకి ఒక ఓటు వేయాలని ఎక్కడా అడగలేదని తనపై చేసిన వ్యాఖ్యలకు షర్మిల ఘాటుగా స్పందించారు. వాళ్లే అధికారంలో ఉండాలి.. వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వాళ్లను గొడ్డలితో నరకాలి. వాళ్లే సింగిల్ ప్లేయర్‌గా ఉండాలి. ఇదేనా భారతి స్ట్రాటజీ అంటూ ప్రశ్నించారు. గొడ్డలితో అందరినీ నరికేయండి. అప్పుడు మీరు సింగిల్ ప్లేయర్‌గా ఉంటారని వ్యాఖ్యానించారు. ఓడిపోతే అరెస్టు ఖాయమని భయం పట్టుకుంది…అందుకే అవినాష్‌రెడ్డి ఊరు దాటిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలిపారు. ఇందుకోసం దొంగ పాస్ పోర్టులు కూడా తయారు చేసుకున్నారని వివరించారు. అవినాష్ రెడ్డి గెలిస్తే నేరం గెలిచినట్లు..షర్మిల గెలిస్తే నిజం గెలిచినట్లని తెలిపారు. షర్మిలను కలవాలంటే ఇంటికి వచ్చి కలవొచ్చు…అవినాష్‌ను కలవాలంటే జైలుకి వెళ్లి కలవాలి…ఎవరు కావాలో కడప ప్రజలు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.
మోదీ రాష్ట్రానికి వెన్నుపోటు పొడవలేదా?
ప్రధాని మోదీ మన రాష్ట్రానికి వస్తున్నారు. మీరు మమ్మల్ని మనుషులుగా చూసి ఉంటే 10 ఏళ్లలో ఒక్క హామీ అయినా నెరవేర్చారా? తీవ్రంగా అవమానించారు.. వెన్నుపోటు పొడిచారు. మాకు గౌరవం లేదు..విలువ లేదు. మోదీని అడుగుతున్నాం.. మీవి దిగజారుడు రాజకీయాలు కాదా అని ప్రశ్నించారు. టీడీపీతో బహిరంగ పొత్తు, జగన్‌తో అక్రమ పొత్తులో మొదటి ఐదేళ్లు బాబుతో…తర్వాత దత్తపుత్రుడు తో తొత్తులో ఉండి తీరని అన్యాయం చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్లు కాదు.
ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పి రండి…
మా రాష్ట్ర ప్రజల మన్ కి బాత్ వినండి. మా ప్రజల పక్షాన మీకు చార్జిషీట్ పంపుతున్నాం. 10 ఏళ్లు మీరు చేసిన మోసానికి 10 ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పి ఆంధ్రలో అడుగుపెట్టాలని దుమ్మెత్తిపోశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని తిరుపతి వేదికగా 10 ఏళ్లు హోదా ఇస్తామని చెప్పి ఎందుకు మోసం చేశారు? పోలవరం ప్రాజెక్టు పేరుతో బాబు, జగన్‌లు టెండరింగ్ పేరుతో మోసం చేశారు. ఎందుకు పోలవరానికి నిధులు ఇవ్వలేదో చెప్పండి? రాజధాని లేదు అని మీకు తెలుసు..రాజధాని నిర్మాణానికి మీరు ఎందుకు సహకారం ఇవ్వలేదు..మీకు కనీస బాధ్యత లేదా..ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పండి? వైజాగ్ స్టీల్‌ను ఆదుకోవడం మాని మీ ప్రయోజనాల కోసం అమ్మాలని చూస్తున్నారు.. దీనికి మీరు క్షమాపణలు చెప్పాలి? విభజన హామీలు ఒక్కటి కూడా వెరవేర్చలేదు.. ఇందుకు మీరు సమాధానం చెప్పాలి? రెండు కోట్ల ఉద్యోగాలు అని మోసం చేశారు..ఏపీకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి?
అప్పుడు దత్తపుత్రుడు..ఇప్పుడు అవినీతి పుత్రుడా?
కరెప్షన్ విషయంలో జగన్ టాప్ అని ఇప్పుడు అంటున్నారు…10 ఏళ్లు జగన్ కరెప్షన్ మీకు కనపడలేదా ? కేంద్రంలో అధికారంలో ఉండి జగన్ అవినీతిపై మీకు బాధ్యత లేదా? అప్పుడు దత్తపుత్రుడు…ఇప్పుడు అవినీతి పరుడా? రాష్ట్రంలో లిక్కర్ మాఫియా మీకు తెలుసు. కేంద్రంలో అధికారంలో ఉండి మీరు గాడిదలు కాశారా? వివేకా హత్య విషయంలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని సీబీఐ చూసింది. దానినే తన్ని తరిమేశారు…అప్పుడు మీరు ఏం చేశారు? అరెస్ట్ కాకుండా అడ్డుకున్నది మీరు? మీ దత్త పుత్రుడు కి మద్దతుగా ఉన్నది మీరు కాదా? ఈ 10 ఏళ్ల చార్జిషీట్‌లోని ప్రశ్నలకు సమాధానాలు రాసి ఇవ్వండి…లేకుంటే ఈ రాష్ట్రంలో అడుగుపెట్టే హక్కు లేదని నిలదీశారు.