క్రూయిజ్ టూరిజం కోసం జాతీయ వ్యూహం

రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

క్రూయిజ్ టూరిజంను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ఒక జాతీయ వ్యూహానికి రూపకల్పన చేసినట్లు టూరిజం శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సిపి సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ. ఈ వ్యూహంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌తో సహా దేశంలో క్రూయిజ్‌ టూరిజంను ప్రోత్సహించే లక్ష్యంతో ఏడు కీలక అంశాలను ప్రాతిపదికగా తీసుకుని జాతీయ వ్యూహానికి రూపకల్పన చేసినట్లు చెప్పారు.

జాతీయ వ్యూహంలో భాగంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, సర్క్యూట్ ఎనేబుల్మెంట్, మార్కెట్ అభివృద్ధి, సులభతర వాణిజ్యం, టెర్మినల్ చుట్టూ ఇంటిగ్రేటెడ్ టూరిజం, పెట్టుబడులను ప్రోత్సహించడం, నైపుణ్యాభివృద్ధి, సంస్థాగత నిర్మాణం, పరిపాలన మొదలైన అంశాలు క్రూయిజ్ టూరిజంకి ప్రధాన స్తంభాలుగా గుర్తించినట్లు మంత్రి తెలిపారు. విశాఖపట్నంలో క్రూయిజ్‌-కమ్‌-కోస్టల్‌ కార్గో టెర్మినల్‌ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభం కూడా అయిందని మంత్రి తెలిపారు.

కేబుల్ టివి చట్టం స్థానే బ్రాడ్‌కాస్టింగ్‌ బిల్లు
రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
న్యూఢిల్లీ, డిసెంబర్ 7: అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, స్వీయ నియంత్రణ ఆవశ్యకత దృష్ట్యా ప్రస్తుతం ఉన్న కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్స్ నియంత్రణ చట్టం-1995 స్థానంలో బ్రాడ్ కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్ -2023ను తీసుకువస్తున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ వెల్లడించారు. రాజ్యసభలో గురువారం సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ ఈ విషయం తెలిపారు.

డ్రాఫ్ట్ బ్రాడ్ కాస్టింగ్ రెగ్యులేషన్ బిల్-2023 ప్రస్తుతం అమలులో ఉన్న కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్స్ రెగ్యులేషన్ యాక్ట్ 1995 స్థానాన్ని భర్తీ చేస్తూ, ప్రసార రంగానికి సంబంధించి మార్గదర్శకాలను నిర్దేశిస్తుందని అన్నారు. బ్రాడ్‌కాస్టింగ్‌ సేవలను నియంత్రించే ప్రక్రియను క్రమబద్ధీకరించి, దానికి సమకాలీన నిర్వచనాన్ని పరిచయంచేసి, కొత్తగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు సంబంధించి నిబంధనలు, కంటెంట్ విషయంలో స్వీయ నియంత్రణ విధానాన్ని బలోపేతం చేయడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు.

ఈ మేరకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రజలు, డొమైన్ నిపుణులు, స్టేక్ హోల్డర్స్ నుంచి అభిప్రాయాలు, విమర్శలు కోరుతూ 2023 నవంబర్ 10 నుంచి నెల రోజులపాటు ముసాయిదా బిల్ ను వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు మంత్రి తెలిపారు. బ్రాడ్ కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్లు-2023 అమలులోకి వచ్చినప్పుడు ప్రస్తుతం అమలులో ఉన్న కేబుల్ నెట్ వర్క్స్ రెగ్యులేషన్ చట్టం స్థానాన్నిఅది భర్తీ చేస్తుందని మంత్రి తెలిపారు.

Leave a Reply