Suryaa.co.in

Editorial

జగన్‌కు ఎన్డీఏ నో ఎంట్రీ?

– ఎన్డీఏలో చేరతానని జగన్ మోదీని కోరారా?
– స్పందించని మోదీ?
– అమిత్‌షా అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడానికి కారణమేమిటి?
– సోషల్‌మీడియాలో కథనాలు చక్కర్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ ఎన్నికలకు సంబంధించి అన్ని సర్వేలూ టీడీపీ-జనసేన వైపు చూస్తున్న నేపథ్యంలో.. దానిని బ్రేక్ చేసేందుకు, వైసీపీ అధినేత-ఏపీ సీఎం జగన్ చేసిన చివరాఖరి ప్రయత్నాలు బెడిసికొట్టాయా? ఎన్డీఏలో చేరేందుకు జగన్ చేసిన ప్రయత్నాలకు బీజేపీ స్పందించలేదా? అమిత్‌షాతో భేటీ కోసం జగన్ చేసిన ప్రయత్నాలు అందుకే బెడిసికొట్టాయా?.. ఇప్పుడు ఇలాంటి కథనాలే సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీకి ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. సొంత పార్టీ నేతలు పక్కచూపులు చూస్తున్నారు. సొంత చెల్లి షర్మిలారెడ్డి అన్నకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. జగన్ అన్న పాలనను దూదేకినట్లు ఏకిపారేస్తున్నారు. ఎంపి సీటు ఇస్తామన్నా మాకు వద్దని కొందరు నేరుగా చెబుతుంటే, మరికొందరు ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకున్నారు. ఇంకొందరు చెప్పాపెట్టకుండా విదేశాలకు చెక్కేస్తున్నారు. దానితో ఒకే కుటుంబానికి చెందిన వారినే, పలు చోట్ల అభ్యర్ధులుగా సర్దుబాటు చేసుకోవలసిన దుస్థితి ఏర్పడింది.

ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబును, కేంద్రహోంత్రి అమిత్‌షా ఢిల్లీకి పిలిపించడం.. ఆయన అమిత్‌షాతో భేటీ అయి, సానుకూల వ్యాఖ్యలు చేయడం తాడేపల్లిని తత్తరపాటుకు గురిచేసింది.

వెంటనే నష్టనివారణ చేపట్టిన జగన్.. రాష్ట్ర అభివృద్ధి పేరుతో మోదీని కలిశారు. సహజంగానే మోదీతో తానేం మట్లాడిందీ జగన్ వెల్లడించలేదు. ఫలితంగా అనేక ప్రచారాలకు తెరలేచింది. వైసీపీని ఎన్డీఏలో చేర్చుకోవాలని జగన్ అభ్యర్ధించగా, మోదీ స్పందించలేదన్నది ఆ ప్రచార సారాంశం. రాష్ట్రంలో బీజేపీకి కావలసిన వనరులను.. తాను చూసుకుంటానని కూడా, జగన్ భరోసా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ మోదీ వాటికేవీ స్పందించలేదన్నది ఢిల్లీ వర్గాల సమాచారం.

నిజానికి ప్రధాని మోదీ వైసీపీ అధినేత ఆఫర్‌కు స్పందించి ఉంటే, వెంటనే అమిత్‌షాను కలవమని సూచించేవారు. సహజంగా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, మిగిలిన విషయాలను చర్చించేందుకు అమిత్‌షాను పురమాయిస్తుంటారు. జగన్ ప్రతిపాదన విషయంలో అలాంటిదేమీ జరగలేదంటే.. మోదీకి వైసీపీతో కలవడం ఇష్టం లేదని స్పష్టమవుతూనే ఉంది. ఆ రకంగా జగన్ ఆశలు నీరగారినట్లు అర్ధమవుతోంది.

అటు జగన్‌ను ఎప్పుడూ ప్రోత్సహించే.. ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా, ఈ విషయంలో ఏమీ చేయలేకపోవడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ఎంపీలతో సత్సంబంధాలు ఉన్న ఆమె, ఆ పార్టీకి-ప్రభుత్వానికి మేలు చేసే ప్రయత్నం చేస్తుంటారన్నది బహిరంగ రహస్యం. అలాంటి నిర్మల కూడా, జగన్‌ను అరగంట సేపు వెయిట్ చేయించడమే ఆశ్చర్యం.

మళ్లీ కేంద్రంలో బీజేపీనే అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుండటం… రాష్ట్రంలో తన గ్రాఫ్ దారుణంగా పడిపోతుండటం.. టీడీపీ-జనసేన పొత్తు పటిష్టమవుతుండటం.. సొంత పార్టీలో తిరుగుబాటు తలపోట్లు.. కలసి వెరసి జగన్‌ను, ఎన్డీఏ వైపు నడిపించి ఉండవచ్చన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. నిజం ‘జగన్నాధు’డికి ఎరుక.

LEAVE A RESPONSE