నెల్లూరు కోర్టులో జరిగిన దొంగతం న్యాయవ్యవస్థపై దాడే!

– సీనియర్ ఐపిఎస్‌తో విచారణ చేయండి
– డీజీపీకి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ

నెల్లూరు కోర్టులో దొంగిలించబడిన కాకాణి గోవర్ధన్ రెడ్డి పోర్జరీ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాల దొంగతనంను న్యాయవ్యవస్థపై జరిగిన దాడిగా గుర్తించి, భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ డీజీపికి లేఖ రాసిన తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

రామయ్య లేఖ సారాంశం ఇదీ..

ఏపీలో శాంతిభద్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. ఓ వైపు క్రైమ్ రేటు పెరిగిపోతుంటే మరోవైపు సంఘ వ్యతిరేక శక్తులకు, నేరగాళ్లకు అధికార పార్టీ రక్షణ కల్పిస్తోంది. ప్రభుత్వ వైఖరి ఫలితంగా సామాన్యులకు న్యాయం అందని ద్రాక్షగా తయారయ్యింది.

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై నకిలీ పత్రాలు సృష్టించిన వైసీపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై 2017లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణ కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ కేసుకు సంబంధించిన అన్ని సాక్ష్యాలను, పత్రాలను నెల్లూరులోని 4వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు లాకర్ రూమ్‌లో భద్రపరిచి ఉంచారు.

14 ఏప్రిల్ 2022, గురువారం, లాకర్ రూంను పగులగొట్టి, ఏ1 ముద్దాయి అయిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫోర్జరీ కేసుకు సంబంధించిన పత్రాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు దొంగిలించబడినట్లు గుర్తించారు.ఈ దొంగతనం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. ఈ నేరపూరితమైన కుట్ర వెనుక ఉన్న పెద్ద మనుషులను కూడా బయటకు లాగాలి.

కాకాణి గోవర్ధన్ రెడ్డి మంత్రిగా 11 ఏప్రిల్ 2022, సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. కాకాణి క్యాబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రెండు, మూడు రోజుల్లోనే కోర్టు లాకర్ రూం నుంచి సాక్ష్యాధారాలు దొంగిలించబడ్డాయి. ఈ కుట్ర కేవలం మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాలను కాపాడటానికి కుట్రని అమలు చేసినట్టుగా అనిపిస్తుంది.

సీనియర్ రాజకీయవేత్త, సమాజంలో శక్తివంతమైన వ్యక్తికి వ్యతిరేకంగా ఉన్న ముఖ్యమైన సాక్ష్యాల చోరీని న్యాయవ్యవస్థపై దాడిగా పరిగణించాలి.నేరం నుండి తప్పించుకోవడానికి సాక్ష్యాధారాలను దొంగిలించడాన్ని తీవ్రంగా పరిగణించి ఇటువంటి చర్యలను వెంటనే అరికట్టాలి.లేదంటే న్యాయస్థానాలలో ఎన్నో కేసులు ఎదుర్కొంటున్న పెద్దమనుషులు తప్పించుకునేందుకు ఈ మార్గాన్ని ఎంచుకునే ప్రమాదం ఉంది.

నిందితులు ఎంతటి వారైనా దొంగిలించబడిన సాక్ష్యాలను చెక్కుచెదరకుండా తిరిగి తీసుకురావాలి. ఇది ఒక సవాలుతో కూడుకున్న పనే.ఈ కేసుపై ఎవరి ప్రభావం లేకుండా కేసును నిశితంగా పర్యవేక్షించి విచారణ చేపట్టాలి.ఇందుకోసం ఒక సీనియర్ ఐపిఎస్ అధికారిని పర్యవేక్షణ అధికారిగా నియమించాలి.

ఈ నేరపూరితమైన కుట్రలో భాగస్వామ్యులు అందరిని అరెస్ట్ చేసి న్యాయము జరిగే విధాన చర్యలు తీసుకోవాలి. ఈ కేసు విషయంలో మీరు తీసుకునే సత్వర చర్యలు భవిష్యత్తులో నేర పూరిత చర్యలకు అడ్డుకట్ట వేయడమే కాకుండా న్యాయ వ్యవస్థ పవిత్రతను కాపాడటంలో సహాయపడుతుంది.