మంచు విష్ణు తీస్తున్న కొత్త సినిమా పేరు జిన్నా అని పెట్టారు. గాలి నాగేశ్వరరావు అనే క్యారెక్టర్‌లో మంచు విష్ణు నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌పై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ‘జిన్నా’ అనే టైటిల్ తొలగించాలంటూ బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ను తిరుమల ఏడుకొండల నేపథ్యంలో ప్రకటించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జిన్నా ఓ దేశద్రోహి అని, ఆ పేరుతో సినిమా తీయడమేంటని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ ప్రశ్నించారు. మంచు విష్ణు చరిత్ర తెలుసుకోవాలని.. జిన్నా కారణంగా ఎంతోమంది హిందువులు మానప్రాణాలు కోల్పోయారని అన్నారు. వారి గురించి మంచు విష్ణు తెలుసుకోవాలని కోరారు. ‘జిన్నా’ అనే టైటిల్ తొలగించాలని కోరుతున్నారు. ఈ సినిమా టైటిల్‌ను తిరుమల ఏడుకొండల మధ్య పైకి వస్తున్నట్టు చూపించడం కూడా బాగాలేదని అంటున్నారు.
ఈషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి.. కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. పాయల్‌రాజ్‌పుత్, సన్నీలియోన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం అనూప్‌రూబెన్స్ ఇస్తున్నారు. ఈ వివాదంపై కోన వెంకట్ స్పందించారు. అందరి మనోభావాలను గౌరవిస్తామని, తిరుపతి కుర్రాడి నేపథ్యంలోనే ఈ కథ ఉంటుందని తెలిపారు. నిర్మాతతో మాట్లాడి టైటిల్ సరిచేస్తామని తెలిపారు.