రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి కొత్తబాటలు

Spread the love

జీఐఎస్ లో 1020 కోట్లతో 8 ఒప్పందాలు
ఎంపీ విజయసాయి రెడ్డి

మార్చి 9, రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి కొత్తబాటలు పడుతున్నాయని, ఇటీవల విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సదస్సులో 1020 కోట్ల విలువైన 8 ఒప్పందాలు జరిగినట్లు రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా గురువారం పలు అంశాలు వెల్లడించారు. జీఐఎస్ ఒప్పందాల ఫలితంగా విశాఖలో 200 కోట్లతో పౌల్ట్రీ మరియు ప్రాసెసింగ్ యూనిట్, ప్రకాశం జిల్లాలో లిక్విడ్ ఎగ్ ప్రాసెసింగ్ ప్లాంట్, గుంటూరులో ప్రోటీన్ ప్రాసెసింగ్ యూనిట్లు, పులివెందులలో మెగా వ్యాక్సిన్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్, బాపట్ల, నూజివీడు, ఏలూరులో 4 మీట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో నెలకొల్పనున్న యూనిట్లు, ప్లాంట్ల ద్వారా 3,750 మందికి ఉద్యోగాలు లభించనున్నాయని అన్నారు.

చేయూత తో వ్యాపార బాట పట్టిన 8.6 లక్షల కుటుంబాలు
శాశ్వత జీవనోపాధికి చేయూత పథకం అందించి అక్క చెల్లెమ్మల జీవితాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త వెలుగులు నింపుతున్నారని విజయసాయి రెడ్డి అన్నారు. ఈ పథకం ద్వారా గడిచిన మూడేళ్లలో 8,65,918 కుటుంబాలు కొత్త వ్యాపారాల బాట పట్టాయని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న లబ్దికి తోడు ప్రముఖ వ్యాపార సంస్థల ద్వారా అదనపు తోడ్పాటు అందించడం జరుగుతోందని ఫలితంగా సంఘాలు 20 లక్షల వరకు బ్యాంకు రుణాలు పొందే స్థాయికి చేరుకున్నాయని అన్నారు.

ఫ్యామిలీ డాక్టర్ తో ఇంటి వద్దకే వైద్య సేవలు
ఫ్యామిలీ డాక్టర్ విధానంతో ఇంటి వద్దకే వైద్య సేవలు తెచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైద్యానికి కొత్త భాష్యం చెప్పిందని విజయసాయి రెడ్డి అన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ట్రయల్ రన్ సూపర్ సక్సెస్ కావడంతో మార్చి 15న పథకం లాంఛనంగా ప్రాంరంభించనున్నారని అన్నారు. రాష్ట్రంలో 1149 పీహెచ్ సీల్లో ఫుల్ టైం డాక్టర్లు నియమించినట్లు తెలిపారు.

Leave a Reply