నిమ్మగడ్డ రమేష్ వాయిదా వేస్తారని తెలియడం వల్లే అప్పట్లో బహిష్కరించలేదు

– ప్రచారంలో ప్రజలను దుర్భాషలాడిన చంద్రబాబు
– దీవిస్తారనే నమ్మకంతో ప్రచారానికి వెళ్ళని సీఎం జగన్
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
తాడేపల్లి , సెప్టెంబర్ 21 : నిమ్మగడ్డ రమేష్ పరిషత్ ఎన్నికలను వాయిదా వేస్తారని తెలియడం వల్లే అప్పట్లో ఆ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించలేదని రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) అన్నారు . మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు . పరిషత్ ఎన్నికలకు భయపడిన చంద్రబాబు అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ను అడ్డు పెట్టుకుని ఎన్నికలను వాయిదా వేయించి మొదటిసారి పారిపోయాడన్నారు . కుప్పం నియోజకవర్గం దగ్గర నుండి చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె , ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు , ఆయన అత్త స్వగ్రామం కొమరవోలుతో పాటు ఎక్కడా టీడీపీ గెలవదని చంద్రబాబు భావించాడన్నారు . వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అడ్డుకోలేమని , ఎన్నికలు జరిగితే ప్రజల్లో నవ్వులపాలు అవుతామని పరిషత్ ఎన్నికలను ఉద్దేశ్యపూర్వకంగా ఆపారన్నారు . ఏడాది తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైతే ఏకగ్రీవాలు చేసుకున్నారని , ఇంకేవో జరిగిపోయాయంటూ ఎన్నికలను బహిష్కరించారన్నారు . 2020 లో పరిషత్ ఎన్నికలకు నామినేషన్లు వేసి 20 రోజుల పాటు ప్రచారం కూడా చేసి మూడు రోజుల్లో ఎన్నికలు జరగనుండగా పారిపోయిన చంద్రబాబు ఆ రోజు పరిషత్ ఎన్నికలను ఎందుకు బహిష్కరించలేదని ప్రశ్నించారు . ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ పరిషత్ ఎన్నికలను వాయిదా వేస్తారని చంద్రబాబుకు తెలియడం వల్లే అప్పట్లో బహిష్కరించలేదని అన్నారు . దొడ్డిదారిన ఎన్నికల కమిషన్‌ను అడ్డం పెట్టుకుని పారిపోయిన పిరికిపంద చంద్రబాబు అని అన్నారు . నిమ్మగడ్డ రమేష్ పదవీ విరమణ తర్వాత రాష్ట్రంలో కొత్త ఎన్నికల కమిషనర్ వచ్చే నాటికి పంచాయతీ ఎన్నికలు కూడా జరిగాయన్నారు .
ఈ ఎన్నికల్లో 85 శాతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్ధులు గెల్చారన్నారు . పార్టీ గుర్తులు లేకుండా పంచాయతీ ఎన్నికలు జరగడం వల్ల నాలుగు విడతల్లోనూ గెల్చామంటూ టీడీపీ విజయోత్సవాలు జరుపుకుందన్నారు . రాష్ట్ర ప్రజలను అమాయకులుగా భావించి టీడీపీ కార్యాలయాల ఎదుట టపాసులను కాల్చుకున్నారన్నారు . చంద్రబాబు కూడా ప్రెస్ మీట్లు పెట్టి పంచాయతీ ఎన్నికల ఫలితాలపై పిచ్చి లెక్కలతో సొల్లు కబుర్లు చెప్పారన్నారు . తెలుగుదేశం పార్టీ యావత్తు కలిసి విజయవాడలో సమావేశాలను నిర్వహించి ప్రజలను దుర్భాషలాడారన్నారు . అమరావతిని జగన్మోహనరెడ్డి తీసేస్తున్నాడని , ఇక్కడి ప్రజలకు సిగ్గు , శరం ఉంటే టీడీపీకి ఓటు వేయాలని చంద్రబాబు అన్నాడన్నారు . ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మాత్రం బయటకు రాలేదన్నారు . రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాలను నమ్ముకున్నారని చెప్పారు . వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు , మంత్రులపై విశ్వాసంతో ఉన్నారన్నారు . అధికారంలో ఉండి ప్రజలకు మేలు చేస్తున్నామని , ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దీవిస్తారనే నమ్మకంతో సీఎం జగన్ ప్రచారానికి కూడా వెళ్ళలేదని మంత్రి కొడాలి నాని గుర్తుచేశారు .

Leave a Reply