నిష్కామ కర్మ

Spread the love

భగవంతుడు భగ్వద్గీత లో – నిష్కామ కర్మ గూర్చి చెబుతారు, భగవదనుగ్రహము కావాలంటే చాలా గ్రంధాలలో కూడా ఈ నిష్కామ కర్మ గురించి ఉంది, నిష్కామ కర్మ వలన( ఫలితం ఆశించని కర్మ) ఎటువంటి కర్మ ఫలము అంటదు.అదేమిటో, ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాము!!!

ఒకానొక సమయములో, దూర్వాస మహర్షి యమునా నది దాటివచ్చి, భక్తితో గోపికలు సమర్పించిన ఫలములను, వాళ్ల సమక్షమున ఆరగించి, వారిని ఆశీర్వదించాడు… ఇంతలో యమునా నది పొంగడం వలన, ఆ గోపికలు తిరిగి వెళ్ళే మార్గం లేక దూర్వాస మహర్షి సహాయాన్ని అర్ధించారు.

ఆ మహర్షి, వారితో యమునా నదిని ఈవిధంగా ప్రార్ధించమన్నాడు…
“ఓ యమునా మాతా! ఈ దూర్వాస మహర్షి ఈనాడు ఉపవాస దీక్ష పాటించి ఉండినట్లయితే, దయతో మాకు ఆవలి ఒడ్డుకు చేరే దారినియ్యి ” అని..
తమ ఎదుటే భుజించిన మహర్షికి, ఉపవాస దీక్ష ఏమిటి? అనుకుని గోపికలు నిర్ఘాంతపోయారు!!… అయినా మహర్షి మహిమ దృష్టిలో ఉంచుకుని, మారు మాట్లాడకుండా యమునను ప్రార్థించారు.

యమునా నది వెంటనే గోపికలకు త్రోవ ఇచ్చింది, దూర్వాస మహర్షి కేవలం గోపికలు భక్తికి మెచ్చి, వారిని ఆనంద పరచడానికి పండ్లు ఆరగించాడే తప్ప, వాటిపై వ్యామోహంతో కాదు. ఆకలితో కాదు. మనస్సును, ఇంద్రియాలను జయించినవారికి, ఆకలి దప్పులు ఉండవు.
ఈశ్వరార్పణ భావంతో చేసిన ఆ కర్మకు అతడు కర్త కాదు, కేవలం సాక్షీభూతుడు, అందువల్ల అతనికి ఆ కర్మకు ఫలం అంట లేదు.

అలానే… ఈనాడు కలియుగంలో ఏది చేసినా, అది భగవంతునికి అర్పితం చేయాలి, ఎవరైనా ఇంతపని ఎలా చేసావు, ఎలా సాధ్యమైనది, అని అడిగినప్పుడు, అంతా ఈశ్వరసంకల్పం మాత్రమే, నేను నిమిత్తమాత్రుడిని, ఆయన దయ ఉంటే అన్ని సాధ్యమే అనే మాట చెప్పి, మన భావం కూడా అలానే ఉండాలి… అప్పుడే ఆ సర్వేశ్వరుడు – మంచి ఫలితం మనకు ఇచ్చి, దానిలో ఉన్న చెడును హలాహలం లాగా తాను స్వీకరిస్తాడు… అప్పుడే అది నిష్కామ కర్మ అవుతుంది… ఈరోజు మనం మంచి జరిగితే నేను, చెడు అయితే దేవుడు అని అనుకొని మాయలో పడుతున్నాము.

సేకరణ : హైందవ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్

Leave a Reply