– ఇది పరిటాల సునీతమ్మ వైపు నుంచి చెబుతున్న మాట
– వదంతులు ఎవరూ నమ్మవద్దు.. మీ ఇంటి జోలికి ఎవరూ రాలేరు
– రాజకీయ నిరుద్యోగి ప్రకాష్ రెడ్డి పన్నుతున్న కుట్రలివి
– పాపంపేట భూ వివాదంపై.. ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ స్పందన
– వచ్చే బుధవారం పాపంపేట పెద్దలు, బాధితులతో సమావేశమవుతాం
– వివాదం అంతా 20ఎకరాల్లోనే.. 930ఎకరాలంటూ ఆందోళన రేపారన్న శ్రీరామ్
– పులి కడుపున పులే పుడుతుంది.. ప్రకాష్ రెడ్డి పాములా మారాడన్న శ్రీరామ్
కళ్యాణదుర్గం: పాపంపేటలో ఎవ్వరూ ఒక్క ఇటుక కూడా కదిలించలేరని.. ఇది ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ వైపు నుంచి ఇస్తున్న మాట అంటూ ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. గత కొన్ని రోజులుగా పాపంపేటలో భూ వివాదంపై వస్తున్న ఆరోపణల మీద ఆయన తీవ్రంగా స్పందించారు. కళ్యాణదుర్గం రోడ్డు లోని పాపంపేటలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
పాపంపేట భూ వివాదంపై ఆయన కూలంకశంగా వివరించారు. అసలు ఇక్కడ భూసమస్య గురించి తన వద్ద కూడా సరైన సమాచారం లేదని.. అధికారులతో రెండు రోజుల పాటు మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నానన్నారు. వాస్తవంగా ఇక్కడ 930 ఎకరాల్లో భూ సమస్య అంటూ ప్రజల్ని భయాందోళనకు గురి చేశారన్నారు. కానీ వాస్తవంగా ఇక్కడ సమస్య ఉన్నది కేవలం 20ఎకరాల్లో మాత్రమేనన్నారు.
అది కూడా కోర్టులో ఉందన్నారు. భూమి మాది అంటున్న వారు, బాధితులు ఇరు పక్షాల వారు కోర్టులో వాదనలు వినిపించారన్నారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయ నిరుద్యోగిగా మారిన ప్రకాష్ రెడ్డి, అతని లాంటి మరికొందరు వైసీపీ నాయకులు ఈ వివాదాన్ని సృష్టించారన్నారు. ఇటీవల ప్రకాష్ రెడ్డిని ఇన్ ఛార్జిగా కూడా తొలగిస్తారన్న ప్రచారం జరుగుతోందని.. అందుకే లేని వివాదాన్ని సృష్టించి.. జగన్ రెడ్డి దృష్టిలో పడాలని చూస్తున్నారన్నారు.
మొదట ఇది 930ఎకరాల కబ్జా అన్నారని.. 10వేలు ఇళ్లు కూలుస్తున్నారని.. 10వేల కోట్లు స్కాం అంటూ ప్రచారం చేశారన్నారు. ఆ తర్వాత 300ఎకరాలన్నారు.. మొన్న 160ఎకరాలంటూ ప్రచారం చేశారన్నారు. ఇప్పుడు కేవలం 20ఎకరాల కోసమే ఇదంతా జరుగుతోందని అసలు వ్యక్తులు చెప్పారన్నారు. తన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ప్రకాష్ రెడ్డి ఇక్కడ భయాందోళనలు సృష్టించారన్నారు. పాపంపేటలో ఒక్క ఇంటి మీద చేయి పడినా.. అది మా ఇంటి మీద పడినట్టేనని.. వదంతులు ఎవరూ నమ్మవద్దని శ్రీరామ్ విజ్ఞప్తి చేశారు. మీ ఇంటి జోలికి ఎవరూ రాలేరని.. మీ మీద చెయి పడాలంటే.. అది మమ్మల్ని దాటి పోవాలన్నారు.
మట్టి అంటించి పక్కన వారి పై వేయడంలో వైసీపీ వాళ్ళు దిట్ట అని.. అందులో భాగంగానే ప్రకాష్ రెడ్డి ఈ వివాదాన్ని తీసుకొచ్చారని శ్రీరామ్ అన్నారు. గతంలో విద్యారణ్యనగర్ లో జరిగిన వివాదం గురించి శ్రీరామ్ క్లారిటీ ఇచ్చారు. విద్యారణ్య నగర్ లో భూ సమస్య వచ్చిందని.. బాధితులంతా తన వద్దకు వస్తే.. 2కోట్లకు 4.20ఎకరాలు వచ్చేలా చూశామన్నారు. అయితే ఆరోజు కూడా ప్రకాష్ రెడ్డి ఇలానే అడ్డం పడ్డారన్నారు. పైగా తాను ఇందులో డబ్బు తీసుకున్నట్టు ప్రచారం చేశారన్నార
ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక కొత్త వివాదాన్ని సృష్టించారన్నారు. ఇక్కడ బాధితులు ఆయన వద్దకు వెళ్తే.. భూమి నాకు రిజిస్టర్ చేయండి.. నేను చూసుకుంటా అని ప్రకాష్ రెడ్డి చెప్పిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. వారు బయట భూమి సెటిల్ చేసుకుంటామంటే.. కోర్టుకు వెళ్లమని ప్రోత్సహించారన్నారు. అక్కడ చివరకు ఇళ్లు కూల్చే వరకు వివాదాన్ని తీసుకెళ్లారన్నారు. ఇళ్ల కూల్చివేతను అడ్డుకునేందుకు తాము అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశామన్నారు. అప్పుడు కలెక్టర్, ఆర్డీఓతో పాటు అందరి అధికారులతో మాట్లాడమన్నారు.
కానీ కోర్టు ఆదేశాలు ఉండటంతో కొన్ని ఇళ్లు కూల్చేవేశారన్నారు. ప్రకాష్ రెడ్డి ఈ విషయంలో అందర్నీ తప్పుదోవ పట్టించారన్నారు. వివాదాన్ని సృష్టించేది ప్రకాష్ రెడ్డే.. ఆతర్వాత దాన్ని నేనే పరిష్కరిస్తానంటూ భ్రమ కల్పించేది ఆయనేనన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. ఇక్కడ కాలనీలకు నీరు ఇస్తున్నామని.. రోడ్లు వేయిస్తున్నామన్నారు. ఈ అభివృద్ధిని పక్కదోవ పట్టించడానికే ప్రకాష్ రెడ్డి ఇలాంటివి తెరపైకి తెస్తున్నారన్నారు….
అసలు ఈ వివాదం గురించి తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని శ్రీరామ్ అన్నారు. ఇందులో తన పేరు లాగితే.. నేను ఇలా బయటకొచ్చి మాట్లాడుతానని.. అందుకే తన సోదరుడు సిద్ధార్థ మీద నిందలు వేశారన్నారు. సిద్ధార్థ స్థానికంగా ఉండరని.. ఎప్పుడైనా వచ్చినప్పుడు స్థానికులతో మాట్లాడి వెళ్తుంటారన్నారు. సిద్ధార్థపై నిందలు వేస్తే మాట్లాడరని ప్రకాష్ రెడ్డి ఇలాంటి ఆరోపణలు చేశారన్నారు. అసలు మొదటి నుంచి జిల్లాలో ప్రజల పక్షాన నిలబడేది, నిలబడుతున్నది పరిటాల కుటుంబమేనన్నారు.