Suryaa.co.in

Editorial

సమయం లేదు మిత్రమా…

( మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘సిరా చుక్క మౌనం పాటిస్తే సారా చుక్క రాజ్యమేలుతుంది
మేధావులు మౌనం పాటిస్తే మూర్ఖులు రాజ్యమేలుతారు’’
ప్రజలను అప్రమత్తం చేస్తూ, ఆ మహాకవి చేసిన హెచ్చరిక నిజమేనని, గత ఐదేళ్లలో ఆంధ్రా ప్రజలకు అనుభవంలో అర్ధమయింది. రిటైరయి కేవలం పెన్షన్ల మీదే ఆధారపడి, బతికేందుకు మందుబిళ్లలు వేసుకుంటున్న వృద్ధులు, బకాయిలు కళ్లచూడకుండానే తనువు చాలిస్తున్న విషాదకర పరిస్థితి జగన్ ఏలుబడిలో నిష్ఠుర నిజం.

చనిపోయిన పెన్షనర్లకు చివరకు మట్టిఖర్చులకూ దిక్కులేని విషాదం. ఆ మధ్య ఆంధ్రా పెన్షనర్ల పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ వ్యక్తం చేసిన ఈ ఆవేదన ఒక్కటి చాలు. ఏపీలో పెన్షనర్లు ఎంత దారుణంగా బతుకున్నారో చెప్పడానికి! తమ హక్కుగా రావలసిన బకాయిలను కూడా పప్పు బెల్లాల కింద తన పేరు కోసం పంచుతున్న జగన్ సర్కారుకు, పెన్షనర్లు జై కొడతారనుకోవడం అమాయకత్వమే. ఒక్క పెన్షనర్లే కాదు. ఏపీలో జీవించే సగటు మనిషి గోస ఇది!

పెన్షనర్లే కాదు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ, ఈ సర్కారు శాపంలా పరిణమించిందనేది నిష్ఠుర నిజం. ఉద్యోగ నేతలు పాలకులకు అమ్ముడుపోయారన్నది ఎంత నిజమో, నేటి పోలింగ్‌లో ఉద్యోగులు, సర్కారుకు వ్యతిరేకంగా ఓటు పోటెత్తారన్నదీ అంతే నిజం. నిజానికి ఏపీలో సంక్షేమ పథకాలు అందుకునే లబ్థిదారులు తప్ప, ఏ ఒక్కరూ ఆనందంగా లేరన్నది, మనం మనుషులం అన్నంత నిజం. పన్ను చెల్లింపుదారుల మెడపై కత్తి పెట్టి వసూలు చేస్తున్న డబ్బును, తన కీర్తికాంక్ష కోసం పప్పు బెల్లాలుగా పంచడాన్ని సగటు ఓటరు ఎవరూ స్వాగతించరు.

పోనీ ఆ లబ్థిదారులకేమైనా పుణ్యానికి పథకాలిస్తున్నారా అంటే అదీ లేదు. వందరూపాయలిచ్చి, వెయ్యి రూపాయలు అడ్డదారిన అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న దారుణం. కన్నా లక్ష్మీనారాయణ మాటల్లో చెప్పాలంటే.. అది చాక్లెస్ ఇచ్చి నక్లెస్ కొట్టేసినట్లు! దానిని సదరు లబ్థిదారులు ఎన్నికల ముందే గ్రహించి, కళ్లు తెరవడం శుభపరిణామం. కూల్చివేతతో మొదలైన జగన్ పాలన, పచ్చని చెట్ల నరికివేతతో ముగుస్తోంది. అంటే ఏదైనా ఏదైనా విధ్వంసమే!

నా అక్క చెల్లెళ్లు అని తరచూ సగర్వంగా చాటుకునే జగన్‌కు.. సొంత చెల్లి, తల్లి, బావ, చిన్నమ్మ, మరో చెల్లి ఎందుకు దూరమయ్యారన్న ప్రశ్నకు ఇప్పటికీ జవాబు లేదు. సొంత చెల్లికే రక్షణ కల్పించలేని అన్నయ్య, ఇక రాష్ట్రంలోని మహిళలకు ఏవిధంగా రక్షణ కల్పిస్తారో, మెదడున్న ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందే. గత ఎన్నికల ముందు సకుటుంబ సపరివార సమేతంగా, జగన్ కోసం ప్రచారం చేసిన తల్లి-చెల్లి లేకుండానే, ఇప్పుడు జగన్ ఎందుకు ఒంటరి అయ్యారన్న ప్రశ్నలు, మహిళాలోకానికి రావడం సహజమే. చివరాఖరకు కన్న తల్లి కూడా కూతురినే గెలిపించమని కోరడం ఎవరికి సిగ్గుచేటు? కనీసం కొడుకన్న మొహమాటంతోనయినా జగన్‌ను గెలిపించమని కోరలేదంటే, ఆ తల్లి హృదయం ఎంత తల్లడిల్లి ఉంటుందన్నది తల్లి మనసుకే తెలుసు.

నిజానికి ఐదేళ్ల జగన్ పాలనలో మెరుపుల కంటే మరకలే ఎక్కువ. రాజరికం అంతరించి, ప్రజాస్వామ్యం అవతరించిన తర్వాత కూడా, రాజరికాన్ని అమలు చేసిన ఘనత జగన్‌దే. ఈ విషయంలో ఆయనకు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మార్గదర్శి కావచ్చు. పార్టీ జెండాను భుజం పుళ్లు పడేలా మోసి, జగన్‌ను అధికారంలోకి తీసుకువచ్చిన నాయకులకు దర్శనం ఇవ్వక పోవడం నియంత పోకడనే.

చివరకు మంత్రులు- ఎంపీలు- ఎమ్మెల్యేలను అంగుష్ఠమాత్రులను చేసి, సలహాదారులతో పాలన నడిపిన జగన్ వైఖరిని, ఆత్మగౌవరం ఉన్న ఏ ఒక్కరూ స్వాగతించరు. కానీ అందుకు భిన్నంగా వారంతా.. తాడేపల్లి చూరుపట్టుకుని వేళ్లాడుతున్నారంటే, వారికి ఆత్మాభిమానం ఉందా? లేదా? అన్నది నేడు ఓట్లు ప్రజలే నిర్ణయించాలి.

తానొక దైవాంశసంభూతుడనన్న భావన.. తన కోసం అంతా జీవించాలన్న కోరిక.. తాను డ బ్బులిస్తున్నాను కాబట్టి ఎవరూ ప్రశ్నించకూడదన్న తత్వం.. తనతో మాట్లాడటమే ఎదుటివారి అదృష్టం అనుకునే అహంకారం.. పదహారణాల నియంత లక్షణమన్నది ప్రజాస్వామ్యవాదుల ఉవాచ.

రాజకీయాల్లో ప్రత్యర్ధులే తప్ప శత్రువులుండకూడదు. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలు అలాగే సాగాయి. కానీ గత ఐదేళ్లలో జగన్ కళ్లకు, ప్రత్యర్ధులు కాకుండా శత్రువులే కనిపించటం ప్రజాస్వామ్యం చేసుకున్న దౌర్భాగ్యం. చంద్రబాబునాయుడును నంద్యాల నుంచి చెరపట్టి, రాజమండ్రి చెరసాలలో వేసిన వైనం జగన్‌లోని నియంతను పాలితులకు పరిచయం చేసింది. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పోటెత్తిన తిరుగుబాటును చివరకు ఢిల్లీ బాదుషాలు కూడా గుర్తించడం అనివార్యమయింది.

అంతకుముందు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును కూడా హైదరాబాద్ నుంచి చెరపట్టి, గుంటూరుకు తీసుకువచ్చిన రాజ్యహింస, జగన్‌లోని ప్రతీకారేచ్ఛకు అద్దం పట్టింది. ఏబీ వెంకటేశ్వరరావు అనే ఐపిఎస్ అధికారికి పోస్టింగు ఇవ్వకుండా వేధించి, ఆయనకు వ్యతిరేకంగా ప్రజల డబ్బును లాయర్లకు పోసిన జగన్ వైఖరి ముందు, నియంతలు కూడా దిగదుడుపే.

పాలకులను బట్టే పాలితులు. సీఎం ఎలా ఉంటే అధికారులూ అలాగే పనిచేస్తారు. కానీ ఆంధ్రాలో పనిచేసే కొంతమంది అధికారులకు, మరీ ఎక్కువ సాగిలబడిన ఫలితంగా వెన్నుపూస కూడా ఒంగిపోవడం దురదృష్టం. ఇలా జగన్ ఐదేళ్ల పాలనా వైభవం గురించి చెబితే భారతం. రాస్తే రామాయణం!

ఏపీలో రోడ్లు అధ్వానం. పక్క రాష్ట్రాల కంటే పెట్రోలు రేటు ఎక్కువ. మహిళలు-దళితులు-మైనారిటీలు చివరకు వికలాంగులపైనా దాడులు నిత్యకృత్యమయింది. ఒక దళిత డ్రైవర్‌ను చంపేసి, అతని శవాన్ని ఇంటికి డెలివరీ చేసిన అధికార పార్టీ ఎమ్మెల్సీ.. దర్జాగా సీఎం పక్కన తిరుగుతున్నారంటే, రాజ్యం ఎవరికి భోజ్యం అయిందన్నది ప్రశ్న.

మాస్కు అడిగిన పాపానికి ఒక దళిత డాక్టరు చేతులు కట్టేసి, మండుటెండల్లో పడుకోబెట్టి ఆయన చావుకు కారణమైన రాక్షసత్వాన్ని, దళితులు గుర్తు పెట్టుకోలేరనుకోవడం భ్రమ. చివరకు సొంత బాబాయ్‌ను చంపిన హంతకులకే శిక్ష వేయించలేని పాలకుడి జమానాను, జనం మళ్లీ కోరుకుంటారనుకోవడం వెర్రితనమే. ఒకవేళ అలా కోరుకున్న వారిని ఆ దేవుడు కాపాడలేరు.

అందుకే ప్రజాస్వామ్యవాదులు, చదువుకున్న వారు, విజ్ఞానవంతులు కళ్లు తెరవాలి. గత ఐదేళ్ల పాలనలో జరిగిన అరాచాలు గుర్తు చేసుకుని పోలింగ్ సెంటర్లకు కదలాలి. మీ ఓటు నియంతలకు వ్యతిరేకంగా పోటెత్తాలి. ప్రజలను బిచ్చగాళ్లుగా మార్చిన పాలకులకు మీ ఓటుతో చరమగీతం పాడాలి. ప్రజాస్వామ్యాన్ని సమాధి చేసి రాజరిక వ్యవస్థను తెచ్చిన రాజులపై మీ ఓటు తిరుగుబాటు అస్త్రం కావాలి.

రాజ్యం విసిరే పథకాలతో సోమరిపోతులుగా ఉండాలా? లేక చేపలు పట్టడం నేర్పించి, బతుకుమీద భరోసా కల్పించే కూటమి కావాలో తేల్చుకునే రోజుది. తాత ముత్తాలు సంపాదించుకున్న భూముల పుస్తకాలపై పాలకుడి ఫొటో వేసినా, కిక్కురుమనలేని చేవచచ్చిన చేష్టలుడిగిన చైతన్యాన్ని, ఈఒక్కరోజైనా మేల్కొనకపోతే.. సెలవింక డెమోక్రసీ సిరిసిరిమువ్వ! అందుకే సమయం లేదు మిత్రమా?… సంధా? సమరమా?.. బానిసత్వమా? స్వేచ్ఛాస్వాతంత్య్రమా?.. తిరోగమనమా? పురోగమనమా?.. ఓటు మీది. బతుకు మీది! ఆటవిక రాజ్యం కావాలా? ఆధునిక పాలన పాలన కావాలా? నిర్ణయం మీది. భవిష్యత్తు మీది. ఓటును నియంతలపై బ్రహ్మాస్త్రంలా మీ ఓటును సంధిస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు. లేకపోతే జనజీవనానికి పెను విపత్తే.

LEAVE A RESPONSE