Suryaa.co.in

Andhra Pradesh

అవినాష్ రెడ్డి పిటిషన్ పై ఈ రెండు రోజుల్లో కోర్టు తీర్పు వస్తుందనుకోవడం లేదు

-ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు తీర్పు వెలువడకపోవచ్చు
-వీళ్లు వారధులయితే అసలు సారథి ఎవరు ?
-పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా కోర్టు తీర్పు ఆలస్యంగానే రావాలని కోరుకుంటున్నా
-ప్రశ్నించిన వారిని అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికే తలవొంపులు
-అక్బర్ గా కాకుండా వైయస్ వివేకానంద పేరుతో ఎందుకు పోటీ చేశారు?
-నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రస్తుతం సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న వారే అంతిమ సూత్రధారులా?, లేకపోతే అసలు సూత్రధారులకు మధ్య వారధులా??, వీళ్లు వారధులయితే, అసలు సారథి ఎవరు? అని నరసాపురం ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. వైయస్ వివేకా హత్యకు అసలు సూత్రధారి ఎవరన్నది తేలాలి. 2019 మార్చి 15 వ తేదీ తెల్లవారు జామున వైఎస్ వివేకా దారుణ హత్యకు గురయ్యారు. ఆయన హత్య జరిగి నాలుగేళ్లు కావొస్తోంది. వివేకాను హత్య చేసిందెవరో తేలినప్పటికీ, హత్య కు సూత్రధారులు ఎవరో ఇప్పటికీ తేల్చలేకపోయారని రఘురామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు.

మంగళవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా తన నివాసంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… హైకోర్టులో వైయస్ అవినాష్ రెడ్డి అత్యవసరంగా దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటుందనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఏమో రేపు చెప్పవచ్చు… అని న్యాయమూర్తి నవ్వుతూ చెప్పారని ఆంధ్రజ్యోతి దినపత్రికలో కథనంగా రాసింది . నవ్వుతూ న్యాయమూర్తి అనడంలో అర్థం లేదు. ఎందుకంటే వైఎస్ వివేకా హత్య కేసు సీరియస్ మేటర్. ఒకవైపు సిబిఐ విచారణ జరుగుతోంది. హత్యకు గురైన వ్యక్తి ప్రస్తుత ముఖ్యమంత్రికి చిన్ననాన్న, దివంగత ముఖ్యమంత్రికి సోదరుడు, ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా ప్రజా జీవితంలో కొనసాగిన వ్యక్తి అని గుర్తు చేశారు. అవినాష్ రెడ్డి ధైర్యంగా సిబిఐ విచారణకు హాజరు కావడం పరిశీలిస్తే, ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు తీర్పును వెలువరిస్తుందని అనుకోవడం లేదు. ఈరోజు, రేపు కూడా తీర్పు వస్తుందని నమ్మకం లేదు.

గతంలో తాను వేసిన పిటిషన్ పై జడ్జిమెంట్ రిజర్వ్ అని చెప్పిన తర్వాత పది నెలల అనంతరం తీర్పు వెలువరించిన సంఘటనలు చూశాం. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు తీర్పు వెలువడకపోవచ్చునని రఘురామకృష్ణం రాజు అన్నారు. తీర్పు ఆలస్యమైతే పిటిషన్లు రద్దు అవుతాయని న్యాయ నిపుణుల భావన. తీర్పు ఆలస్యం కావాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కలిగి కార్యకర్తగా కోరుకుంటున్నాను. వివేకాపై ఎన్నో నీలాప నిందలను మోపారు. దీని వెనుక ఏమైనా కుట్ర ఉందా? అని ప్రశ్నించిన ఆయన, నాలుగవ సంవత్సరం గతించే లోగానైనా ఇద్దరు పెద్ద తల కాయలలో ఒక పెద్ద తల కాయనైనా అరెస్టు చేసే అవకాశం ఉంటుందా? అనే సందేహాన్ని వ్యక్తం చేశారు .

భాస్కర్ రెడ్డిని విచారణకు పిలవలేదు… కోర్టులో వెల్లడించిన సిబిఐ
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని విచారణకు పిలువ లేదని న్యాయస్థానంలో సిబిఐ అధికారులు స్పష్టం చేశారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తాను గత రెండు రోజుల నుంచి ఈ విషయాన్ని చెబుతున్నాను. కడపలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలపై సిబిఐ అధికారులు న్యాయస్థానంలో నోరు విప్పారు. సీబీఐ విచారణకు పిలవకుండానే హాజరైన భాస్కర్ రెడ్డి, అదే పనిగా ఎందుకు వెళ్లారని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేయకముందే, భాస్కర్ రెడ్డి కోసం జైలు తలుపులను పోలీసులు ఎలా తెరిచారు. జైలు ఆవరణలో పోలీసులను ఎవరి ఆదేశాలపై మోహరించారు. సిబిఐ ఆదేశాల పైన? భాస్కర్ రెడ్డి ఆదేశాలపై మోహరించారా?, ఒకవేళ సిబిఐ చెప్పిందే అబద్ధమైతే, భాస్కర్ రెడ్డి తనకు గతంలో సిబిఐ జారీ చేసిన నోటీసులను చూపించే వారిని రఘురామకృష్ణం రాజు అన్నారు. భాస్కర్ రెడ్డిని పిలవటానికి ఇబ్బంది లేకపోయినప్పటికీ, ఈ అరెస్టు జరగకుండా, ఆ అరెస్టు సబబు కాదని సిబిఐ అధికారులు భావించి ఉంటారా? అన్న సందేహాన్ని ఆయన వ్యక్తంచేశారు.

ప్రస్తుతానికి అవినాష్ రెడ్డిని పిలిచి విచారించి, భాస్కర్ రెడ్డి దోషి అనుకుంటే అరెస్టు చేయడానికి అభ్యంతరమేమీ ఉండకపోవచ్చు. వైయస్ వివేకా హత్య పై న్యాయపోరాటం చేస్తున్న సునీతకు న్యాయం జరగాలని కోరుకుందామని రఘురామకృష్ణం రాజు అన్నారు. సంస్మరణ సభలోగా వివేకాపై నీలాప నిందలు వేస్తున్న వారి అరెస్టు జరిగి ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుంది , ఆ దిశగా ఈ కేసులో పురోగతి ఉంటుందా? వైఎస్ వివేకా సంస్మరణ సభకు అసెంబ్లీ సమావేశాలను పెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యే అవకాశాలు లేవు. గతంలో వైఎస్ వివేకా విగ్రహావిష్కరణ లో పాల్గొన్న అవినాష్ రెడ్డి పాల్గొంటారో లేదో చూడాలి. వైఎస్ వివేకా కూతురు డాక్టర్ సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి కచ్చితంగా సంస్మరణ సభలో పాల్గొంటారని అన్నారు.

అక్బర్ గా కాకుండా వైయస్ వివేకానంద పేరుతో ఎందుకు పోటీ చేశారు?
ముస్లిం మతాన్ని స్వీకరించి తన పేరును అక్బర్ గా మార్చుకున్న వైయస్ వివేకానంద రెడ్డి 2017 శాసనమండలి ఎన్నికల్లో అక్బర్ పేరుతో కాకుండా, వైఎస్ వివేకానంద రెడ్డి పేరుతో ఎందుకు పోటీ చేశారన్నది ఆయన తన పేరు అక్బర్ గా మార్చు కున్నాడని చెబుతోన్న వారు చెప్పాలని రఘు రామకృష్ణంరాజు డిమాండ్ చేశారు . వైయస్ వివేకాను ఆయన కుమార్తె డాక్టర్ సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి హత్య చేయించారని బలంగా చెబుతున్న వారు, గతంలోనే పోలీసులకు ఎందుకని ఈ విషయాన్ని చెప్పలేదు. హత్య గురించి తెలిసి చెప్పకపోయినా అరెస్టు చేసే అవకాశం ఉంది. డాక్టర్ సునీత, రాజశేఖర్ రెడ్డి లే హత్య చేశారని అనుమానం వ్యక్తం చేయడం వేరు… వారే హత్య చేశారని చెప్పడం వేరని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు. హత్యకు ముందు తరవాత నిందితులతోనే అవినాష్ రెడ్డి కలిసి ఉండి, ఉదయం ఏడు గంటల వరకు హత్య జరిగిన ప్రదేశంలో రక్తపు మరకలను తుడిపించి, శవానికి కుట్లు వేయించారని సీబీఐ తాజాగా కోర్టుకు ఆధారాలు సమర్పించింది. కేసు విచారణలో న్యాయస్థానం తల దూర్చడం సరికాదని సీబీఐ తరఫున న్యాయవాదులతో పాటు, సునీత తరపు న్యాయవాదులు కూడా కోరారు. పై కోర్టుకు వెళ్లే వరకు ఈ కోర్టు ఇచ్చిన తీర్పునే గౌరవించాలి. ఇది మన న్యాయ వ్యవస్థ విధానం. రేపు కొన్ని నిజాలు బయటకు వస్తాయని భావిస్తున్నట్లుగా రఘురామకృష్ణంరాజు తెలిపారు.

నకిలీ సర్టిఫికెట్ల ముద్రణకు ప్రింటింగ్ ప్రెస్
పట్టభద్రుల ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లను చేర్చడానికి అవసరమైన సర్టిఫికెట్ల ముద్రణ కోసం తిరుపతిలో అధికార పార్టీ నేతలు ఏకంగా ఒక ప్రింటింగ్ ప్రెస్ ని అడ్డా గా మార్చుకున్నట్టు తెలిసిందని రఘురామకృష్ణంరాజు అన్నారు. ఇక్కడ ముద్రించిన సర్టిఫికెట్లతోనే రాష్ట్రవ్యాప్తంగా , పట్టభద్రుల ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లను చేర్చారని అన్నారు. ఆరు ఏడవ తరగతి చదివిన వారిని నెల్లూరులో పట్టభద్రుల ఓటర్ల జాబితాలో చేర్చగా, వారు ఓటు వేసేందుకు క్యూ లైన్ లో నిలబడ్డారు. ఆరు ఏడవ తరగతి చదివిన వారిని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలా ఓటు వేస్తున్నారనిప్రశ్నించగా, తమకు ఓటు ఇచ్చారని వేస్తున్నామని చెప్పడం హాస్యాస్పదం. కడపలో బ్యాగులో డబ్బుల కట్టలు పెట్టుకొని పోలీసుల సహకారంతో ఓటర్లకు విచ్చలవిడిగా నగదును పంచారు. సింహం సింగిల్ గా వస్తుందని, ప్రతిపక్షాలు రెండు మూడు పార్టీలు కలిసి వస్తున్నాయని చెప్పే అధికార పార్టీ నేతలకు, పోలీసులు, వాలంటీర్ల సహకారంతో, డబ్బు సంచులు వేసుకొని, ఇదేమిటని ప్రశ్నించిన వారిపై, రిగ్గింగును అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిపై కేసులను పెడుతూ… ఇంకా సింహం సింగిల్ గా వస్తుందని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి.

కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా అధికార పార్టీ అక్రమాల గురించి ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు బిటెక్ రవి, ఆ పార్టీ నాయకులను కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై ఒక పౌరుడిగా స్పందించిన ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అయినా, ఎన్నికల సంఘం… ఎల్వి సుబ్రహ్మణ్యం రాసిన లేఖ పై చర్యలు తీసుకుంటుందనే నమ్మకం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో వేలాది దొంగ ఓట్లను చేర్పించారని గతంలోనే టిడిపి నాయకుడు పయ్యావుల కేశవ్ పేర్కొన్నప్పటికీ, ఎన్నికల సంఘం స్పందించి చర్యలు తీసుకోలేదని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు . ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు వేల రూపాయలు ఇచ్చి ఉపాధ్యాయుల ఓట్లను అధికార పార్టీ నేతలు కొనుగోలు చేశారు. ఓటుకు 5000 రూపాయలు ఇచ్చినప్పటికీ, ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉంటే పాలకపక్ష అభ్యర్థి ఓటమి తప్పదు. హోరా, హోరీ గా పోటీ జరిగి మాత్రం ఎన్నికల ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి.

మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు హోరా, హోరి గా జరిగినట్టు తెలుస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలలో ప్రతిపక్షాలు ఎన్ని స్థానాలు గెలుస్తాయో చూడాలని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చోటు చేసుకున్న అక్రమాలకు సంబంధించిన వీడియోలను జత చేస్తూ, తాను కూడా రాష్ట్రపతికి ఒక లేఖ రాయనున్నట్టు రఘురామకృష్ణంరాజు తెలిపారు. తాను లేఖ రాయడం వల్ల ఏదో జరిగిపోతుందనే భ్రమలో తాను లేనని అన్న ఆయన, రానున్న సాధారణ ఎన్నికల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండి ఎన్నికల సమయంలో జరుగుతున్న అక్రమాలను అడ్డుకోవాలని కోరారు.

న్యాయస్థానాలకు వెళ్లిన ప్రస్తుతం తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి
ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలపై న్యాయస్థానాలను ఆశ్రయించాలనుకున్న కేసును స్వీకరిస్తారో, స్వీకరించరో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఒకవేళ స్వీకరించిన వాదనలు విన్న తర్వాత 50 రోజులకు, వందరోజులకైనా ప్రస్తుతం తీర్పు వస్తుందన్న నమ్మకం ప్రజల్లో లేదు. ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు వంటి జీవో నెంబర్ 1ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాగా, వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఇప్పటివరకు వెలువరించలేదు. న్యాయ స్థానం తన తీర్పును వెలువరిస్తే, రాజ్యాంగానికి భిన్నంగా తీర్పు వెలువడితే సుప్రీంకోర్టును ఆశ్రయించి అవకాశమైనా ఉంటుంది. జీవో నెంబర్ 1పై న్యాయస్థానం తీర్పు కోసం రాష్ట్ర ప్రజలు చకోర పక్షుల ఎదురు చూస్తున్నారనే విషయాన్ని న్యాయ స్థానం గ్రహించాలని రఘురామ కృష్ణంరాజు కోరారు.

ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల సంఘం ఏమి చేయాలనుకుంటుంది?
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల సంఘం ఏమి చేయాలనుకుంటుందని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎన్నికల అక్రమాలపై, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అక్రమ విధానాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నో లేఖలు రాశారు. తాజాగా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం లేఖ రాయగా, తాను కూడా త్వరలోనే ఒక లేఖ రాస్తాను. ఈ లేఖలన్నీ ఏమవుతున్నాయో అర్థం కావడం లేదు. ఎన్నికల సంఘం ఎందుకని స్పందించడం లేదని రఘురామకృష్ణం రాజు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

మూడు రాజధానులపై గవర్నర్ ప్రసంగంలో ఊసే లేదు
మూడు రాజధానులపై గవర్నర్ ప్రసంగంలో ఊసే లేకపోవడం అత్యంత ఆనందాన్ని కలిగించే విషయమని రఘురామకృష్ణం రాజు అన్నారు. గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల అంశాన్ని ప్రభుత్వం చేర్చినప్పటికీ, ఆయన దాన్ని తొలగించి వేసినట్లు తెలిసింది. పారిశ్రామికవేత్తల సదస్సులో స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరలోనే తాను విశాఖపట్నం కు మకాం మార్చను న్నానని, సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ, మరొక మంత్రి కూడా విశాఖ నే రాజధాని అని పేర్కొన్న విషయం తెలిసిందే. అయినా గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల అంశం లేకపోవడం పరిశీలిస్తే ఆయన తన ప్రసంగం నుంచి ఆ పదాలను తొలగించే విధంగా చర్యలు తీసుకున్నారనే నమ్మకం కలుగుతోందన్నారు. గవర్నర్ ప్రసంగంలో కొన్ని బాధ కలిగించే విషయాలు ఉన్నాయి. రాష్ట్రానికి జీవనాడి అయిన సాగునీటి ప్రాజెక్టుల గురించి పెద్దగా ప్రస్తావనే లేకపోవడం బాధ కలిగించిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

ఇటువంటి ఎన్నో వేడుకలు జనసేన పార్టీ జరుపుకోవాలి
జనసేన పార్టీ ఆవిర్భవించి పదేళ్లు పూర్తి కావడం, పదవ వార్షికోత్సవాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మచిలీపట్నంలో జరుపుకోవాలని నిర్ణయించడం… ఆ సభ విజయవంతం కావాలని రఘురామకృష్ణం రాజు ఆకాంక్షించారు. ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వనని, తమ పార్టీ నేతల మనోగతాలు దెబ్బతినకుండా ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేస్తానని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించారని గుర్తుచేశారు.

LEAVE A RESPONSE