మాజీ హోం మంత్రి సుచరిత ఇంటి ముందు ఉండవల్లి శ్రీదేవి నిరసన..

తాడికొండ వైసీపీ పంచాయితీ రచ్చకెక్కింది. తాడికొండ నియోజకవర్గానికి వైసీపీ అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను ఆ పార్టీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు కూడా జారీచేసింది. అయితే ఈ నియామకం పార్టీలో రచ్చకు కారణమైంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వర్గం ఆందోళనకు దిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్‌ కొనసాగుతుండగా.. డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను అద‌న‌పు స‌మ‌న్వయ‌క‌ర్తగా నియమించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.. వైసీసీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఇంటి ముందు ఆందోళనకు దిగారు. సుచరిత ఇంటి ముందు.. ఉండవల్లి శ్రీదేవి, ఆమె

అనుచరుల బైఠాయించారు. దాంతో సుచరిత ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. డొక్కా మాణిక్య వరప్రసాద్‌ నియామకంతో ఉండవల్లి శ్రీదేవిని అవమానించారని ఆమె అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంపై పార్టీ అధిష్టానంతో మాట్లాడుదామని ఉండవల్లి శ్రీదేవికి సుచరిత నచ్చజెప్పారు. దీంతో వారు ఆందోళన విరమించారు. ఇక, డొక్కా మాణిక్య వరప్రసాద్‌ గతంలో తాడికొండ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా కూడా పని చేశారు.

Leave a Reply