( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆంధ్రాలో డ్రగ్స్, గంజాయి అన్న పదాలు వాడుతున్న వారందరికీ పోలీసులు వందల కిలోమీటర్లు ప్రయాణించి మరీ నోటీసులిస్తున్నారు. వాటికి ఆధారాలివ్వండని శూలశోధన చేస్తున్నారు. మంచిదే. ఆంధ్రా పరువును దెబ్బతీస్తున్న సదరు రాష్ట్ర ద్రోహులను ఆమాత్రం భయపెట్టాల్సిందే. తప్పులేదు. లేకపోతే… ఒక గ్రాము గంజాయి కూడా పండని, తొండలు కూడా గుడ్లు పెట్టని ఆంధ్రాలో.. ఒక గ్రాము డ్రగ్ కూడా దొరకని ఆంధ్రాని అంత బద్నామ్ చేస్తారా? ఎంత ధైర్యం?! తప్పు చేసిన ఎవరినయినా వదిలిపెట్టవద్దని ఆదేశించిన జగనన్న పాలనలో, ఆంధ్రా డ్రగ్గాంధ్రప్రదేశ్‌గా మారిందని ఆరోపించడానికి విపక్షాలకు ఎన్ని గుండెలు? ఇంకెన్ని గుండీలు కావాలి? హన్నా..!
రాష్ట్రంలో గంజాయితో పాటు మాదక ద్రవ్యాలు చెలామణి అవుతున్నాయని, అదానీకి చెందిన పోర్టు నుంచి ఆంధ్రాకు రవాణా అవుతున్నాయన్నది టీడీపీ, జనసేన, కాంగ్రెస్ నేతల ఆరోపణ. అందుకు బెజవాడ అడ్డా అవుతోందని వారి వాదన. కానీ, రాత్రింబవళ్లు కళ్లలో వత్తులేసుకుని, గ్రాము గంజాయి కూడా రవాణా కాకుండా, ఒక అరస్పూన్ డ్రగ్ కూడా బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నది పోలీసుల వాదన. వందల సంఖ్యలో అవార్డులందుకున్న ఆంధ్రా పోలీసులపై నిందలేస్తే కళ్లు పేలిపోతాయని, పోలీసు బాసు ఆధ్వర్యంలో రాష్ట్రంలో శాంతిభ ధ్రతలు దివ్యంగా ఉంటే.. పనిలేని ప్రతిపక్షాలు ఏపీ పోలీసును విమర్శించడం భావ్యం కాదన్నది, పోలీసు అధికారుల సంఘం టన్నుల కొద్దీ కురిపిస్తోన్న కన్నీరు.
ఓకే.. ఓకే.. ఏపీ పోలీసుల కష్టాన్ని కాదనలేం. వారి పక్షపాత రహిత చర్యలు, నిర్మొహమాట నిర్ణయాలనూ కాదనలేం. సత్యహరిశ్చంద్రులకే ఆదర్శప్రాయులైన ఏపీ పోలీసుల నైతిక చర్యలకు, నిలువెత్తు నిర్మొహమాటపరులైన వారికి, కచ్చితంగా పౌర సన్మానం చేయాల్సిందే. పార్టీలు- వ్యక్తులు- రాజకీయాలకు అతీతంగా ఏపీ పోలీసులు తీసుకుంటున్న నిర్ణయాలను, హైకోర్టు కూడా ‘స్వయంగా పిలిచి’ అభినందించింది కాబట్టి.. పోలీసులను తప్పుపట్టడం తప్పున్నర తప్పు! దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా, ఏపీలో మాత్రమే పోలీసులు స్వయం నిర్ణయాధికారాలతో పనిచేస్తున్నారు. అధికార పార్టీ నేతలు చెప్పినా బేఖాతరు చేస్తున్నారు. గత సర్కారు మాదిరిగా ఎమ్మెల్యేలు లెటర్లు ఇచ్చిన వారికి కాకుండా.. కులాలు చూడకుండా, కేవలం ప్రతిభ ఆధారంగానే పోస్టింగులిస్తున్నారు.
పోలీసులపై చేయి చేసుకుని, వారిని బండబూతులు తిట్టిన అధికార పార్టీ నేతలను నిర్మొహమాటంగా అరెస్టు చేస్తున్నారు. సోషల్‌మీడియాలో జడ్జిలను తిట్టిపోసిన వారిని జలల్లెడ వేసి, వారు ముల్లోకాల్లో ఎక్కడ దాక్కున్నా వెతికి మరీ పట్టుకుంటున్నారు. పోలీసులను తిట్టిన అధికార పార్టీ ఎమ్మెల్యేలపై కూడా నిర్భయంగా కేసులు పెడుతున్నారు. విపక్షాల పార్టీ ఆఫీసులపై దాడి చేసిన వారు ఎంతటివారయినా లెక్కచేయకుండా, కాళ్లకుబలపాలు కట్టుకుని మరీ పట్టుకుంటున్నారు. మరి విధినిర్వహణలో ఇంత లబ్ధప్రతిష్ఠులైన ఏపీ పోలీసులపై, విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధించడం మహా పాపమే కాదు. మహా నేరం-ఘోరం కూడా! ఈ విషయంలో ఆంధ్రులంతా పోలీసులకు బాసటగా నిలవడం ధర్మం.
రాష్ట్రంలో గంజాయి కానీ, డ్రగ్స్ కానీ చలామణిలో లేదన్నది ప్రభుత్వం-పోలీసుల వాదన. దానిని మనమూ నమ్మి, సమర్ధించాల్సిందే. ఆధారాలు లే కుండా వాటిపై మాట్లాడిన అందరికీ కచ్చితంగా నోటీసులివ్వాలిందే. దానికి ఎవరూ అడ్డుచెప్పరు. రాష్ట్రాభివృద్ధి కోసం అప్పో సొప్పో చేస్తున్న ‘రాజ్యాంగాధిపతి’ పాలనపై, బురద చల్లడాన్ని ఎవరూ సహించరు కూడా. బాగానే ఉంది! కానీ.. దాని దుంపతెగ.. ఏపీలో విపక్షాలు ప్రస్తావించిన విమర్శలనే , పక్క రాష్ట్రాల పోలీసులు మీడియా పేరంటం పెట్టి మరీ చెబుతున్నారే?!.. ఏపీ నుంచే గంజాయి తమ రాష్ట్రాల్లోని వస్తోందని బల్లగుద్దకుండా చెబుతున్నారే?!.. ఫలానా విశాఖకు చెందిన పుల్లారావును అరెస్టు చేశామని మీడియాకు చూపిస్తున్నారే?!.. దేశంలోని ఆ ముదనష్టపు- దిక్కుమాలిన ఎల్లో మీడియా-సోషల్ మీడియా కూడా వాటిని హైలెట్ చూపిస్తుందేమిటి?సోషల్‌మీడియా అయితే పరాయి రాష్ట్రాల పోలీసు అధికారులు చెప్పిన మాటలను వీడియోల్లో చూపించడం ఏమిటి?
డ్రగ్ మాఫియా విశాఖ నుంచి ఎక్కడెక్కడ, ఏయే రూట్ల నుంచి వాటిని సరఫరా చేస్తున్నారో మ్యాపులేసి మరీ చూపించి, ఆంధ్రా ప్రతిష్టను అడ్డంగా ఇరికించేస్తున్నారే?!.. పక్కనే ఉన్న తెలంగాణ ఒక్కటే కాదు. త మిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా, అసోం, ఢిల్లీ పోలీసులది ఇదే వరస! మరి వారినేం చేయాలి? అది కదా ఇప్పుడు అసలు సమస్య! అభివృద్ధిలో పంచకల్యాణి గుర్రం కూడా ఈర్ష్యపడే స్థాయిలో దూసుకుపోతున్న, ఆంధ్రా పరువుతీస్తున్న పరాయి రాష్ట్ర పోలీసులను చూస్తే, జగనన్న ‘అభిమానస్తులకు’ బీపీ రావాలి కదా?! సహజంగానే రక్తపోటు వస్తుంది కూడా. మరి ఇంకా రాలేదేమిటి చెప్మా అన్నదే అందరి ఆశ్చర్యం.
మరి లెక్క ప్రకారం.. ఏపీ పోలీసులు పాటిస్తున్న నోటీసు పాలిసీలను, ఆయా రాష్ట్రాల పోలీసుల విషయంలోనూ పాటించాలి కదా? నిప్పులాంటి నిఖార్సయిన మా జగనన్న పాలనపై , అసత్యాల నిప్పులు పోస్తారా అని.. గంజాయి రవాణాపై ప్రెస్‌కాన్ఫరెన్సులు పెట్టిన ఆయా రాష్ట్రాల ఎస్పీలు, డీఐజీలకు నోటీసులివ్వడమే ధర్మం కదా? నక్కా ఆనందబాబు ఇంటికి అర్ధరాత్రి వచ్చి నోటీసులిచ్చినట్లే.. పరాయి రాష్ట్రాల పోలీసులకూ నోటీసులిల్వాలి కదా?! మీకు ఆ ఆధారాలు ఎక్కడినుంచి వచ్చాయని నిలదీయాలి కదా?! వాళ్లు ఐపీఎస్‌లయితే ఏంటీ? ధర్మం మన పక్షానే ఉన్నప్పుడు ఎందాకయినా వెళ్లి నిగ్గు తేల్చాల్సిందే కదా? మరి ఆ పని ఎందుకు చేయడం లేదన్నది బుద్ధిజీవుల ప్రశ్న.
అవును. ఎంత ధైర్యం ఉంటే.. డ్రగ్-గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ నుంచి అవి వస్తున్నాయని ప్రకటిస్తారు? ఎంత ధైర్యం ఉంటే.. దేశంలో గంజాయి రూట్ మొత్తం ఏపీ నుంచే ఉందని, హైదరాబాద్ కొత్వాల్ అంజనీకుమార్ చెబుతారు? ఎంత ధైర్యం ఉంటే.. కర్నాటకు వచ్చే గంజాయి మొత్తం ఆంధ్రా నుంచే వస్తుందని బెంగళూరు సీపీ కమల్‌పంత్ ప్రకటిస్తారు? ఎంత ధైర్యం ఉంటే.. ఢిల్లీలో గంజాయి మొత్తం ఏపీ నుంచే వస్తోందని ఢిల్లీ డీసీపీ సంతోష్‌కుమార్ మీనా చెబుతారు? రాజస్థాన్, పూణె, ముంబైలో పట్టుబడిన గంజాయి అంతా ఆంధ్రా నుంచే వస్తోందని ఆయా రాష్ట్రాల పోలీసులు చెప్పడానికి ఎంత ధైర్యం? వారిది గుండెనా? చెరువా? ఏవోబీ నుంచే గంజాయి రవాణా అవుతోందని నల్లగొండ ఎస్పీ రంగనాధ్ చెప్పడానికి ఎన్ని గుండెలు? కిలో పదివేలకు అమ్ముడవుతోందని రేటు కూడా చెప్పిన ఆయనకు, ఏపీ పోలీసులు నక్కా ఆనంద్‌బాబుకు ఇచ్చినట్లే అర్థరాత్రి ఇంటికెళ్లి మరీ నోటీసులివ్వాలి కదా? మరి ఎందుకివ్వలేదన్నది బుద్ధిజీవుల ప్రశ్న.
ఒక్క పోలీసులేనా?.. హైదరాబాద్‌లో 59 గ్రాముల డ్రగ్స్ దొరికితేనే పిచ్చి కుక్కలా నెలల తరబడి స్పెషల్ డిబేట్లతో అరిచిన మీడియా.. 20 వేల కోట్ల విలువ చేసే 3 వేల కిలోల డ్రగ్స్, అదానీ పోర్టులో పట్టుబడితే. ఎందుకు నవరంధ్రాలూ మూసుకుందని ప్రశ్నించాలి కదా? శ్రీదేవి బాత్ టబ్‌లో ఎలా చనిపోయిందో, లైవ్‌లో చూపించిన మిడిమేలపు మీడియా.. మరి అదానీ పోర్టు నుంచి ఇవన్నీ ఎలా రవాణా అవుతున్నాయో చూపించాలి కదా? అదానీ పోర్టుకూ, ఈ బంధానికీ లింకే మిటని డిబేట్లు పెట్టాలి కదా? గంజాయి ఎలా రవాణా అవుతోందో లారీల కింద వేళ్లాడబడి మరీ చూపించాలి కదా? మొహానికి గ్లామర్ కోసం గ్రాము, అరగ్రాము డ్రగ్స్ వాడే సినిమా వాళ్లను రోజుల తరబడి విచారించిన హైదరాబాద్-తెలంగాణ పోలీసులు, గంజాయికి అడ్డా అయిన ఏఓబీపై మెరుపుదాడులెందుకు చేయరన్నది మరో ప్రశ్న.
అసలు ఏఓబీలో దశాబ్దాల నుంచే గంజాయి.. దేశం మొత్తానికి రవాణా అవుతోందన్నది, మెడ మీద తల ఉన్న అందరికీ తెలుసు. దానికి ఫలానా సీఎంలు, ఫలానా పార్టీలతో సంబంధమే లేదు. సమైక్య రాష్ట్రం నుంచీ ఆ కథ కొనసాగుతోంది. అందులో రాజకీయ పార్టీ నేతలు, స్థానిక పోలీసులు అందరూ పాత్రధారులేనన్నది బహిరంగ రహస్యం. కడప, చిత్తూరు జిల్లాల్లో ఎర్రచందనం స్మగ్లర్లతో రాజకీయ పార్టీలకు విడదీయలేని బంధం ఉంది. అందుకు ఏ పార్టీ మినహాయింపు కాదు. గత ఎన్నికల్లో పేరుమోసిన స్మగ్లర్లు, చిత్తూరు-కడప-అనంతపురం-కర్నూలు జిల్లాల్లో ఒక పార్టీకి నిధులిచ్చారన్నదీ బహిరంగ రహస్యమే.
గంజాయి బంధం కూడా అంతే. కాకపోతే ఎర్రచందనం కథ వందలు-వేల కోట్లయితే, గంజాయి కథ కోట్లలో ఉంటుంది. రెండింటి మధ్య తేడా అదే. మిగిలినదంతా సేమ్ టు సేమ్! అసలు నక్సలైట్లకు గంజాయి సాగు, ప్రధాన ఆదాయ వనరు అన్న విషయం ఎంతమందికి తెలుసు? ఆ డబ్బులతోనే ఆయుధాలు కొంటారని ఎంతమందికి తెలుసు? ఇటీవల అక్కడికి వెళ్లిన నల్లగొండ పోలీసులపై, గిరిజనులు ఎదురుదాడి చేస్తేనే కదా, యవ్వారం మొత్తం బయటకొచ్చింది? ఏవోబీ నుంచి వివిధ మార్గాల్లో పరాయి రాష్ట్రాలు, ఏపీలోని జిల్లాలకు గంజాయి రవాణా అవుతోందని అందరికీ తెలుసు. వివిధ ప్రైవేటు యూనివర్శిటీల్లో ధవంతులయిన చిరంజీవులు, గంజాయికి అలవాటు పడ్డారని ఎవరికీ తెలియదనుకుంటే అది భ్రమ. సమైక్య రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి కుమార్తె, ఇప్పుడు మరో పదవిలో ఉన్న అమరావతికి చెందిన ఇద్దరు వ్యక్తుల కుమారులు మత్తుకు అలవాటు పడ్డారన్నది వినిపిస్తున్న గుసగుసలు.
ఇటీవల గుంటూరు జిల్లాకు చెందిన అధికారపార్టీ ప్రజాప్రతినిధి ఒకరు… తమ కాలేజీ చిరంజీవులకు డ్రగ్స్‌పై అవగాహన కల్పించాలని, ఓ పోలీసు అధికారినే కోరారంటే.. డ్రగ్స్ వాడకం ఎంత విస్తరించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అసలు ఈ గంజాయి అమ్మకాలు, ఎగుమతి సంస్కృతి దశాబ్దాల నుంచే సాగుతున్నప్పుడు.. దానిపై ఇప్పుడు ఉలిక్కిపడి, అది ప్రస్తావించిన వారికి నోటీసులివ్వటమే అతి. మరి ఆ అతి.. పరాయి రాష్ట్రాల పోలీసుల విషయంలోనూ పాటించాలి కదా అన్నదే ఇప్పుడు తెరపైకి వ స్తున్న ప్రశ్న. మరి గంజాయి రవాణాపై కామెంట్లు చేసిన పరాయి రాష్ట్ర పోలీసులకూ నోటీసులిస్తారా?!