Suryaa.co.in

Andhra Pradesh

మధ్యాంధ్ర ప్రదేశ్ గా మార్చిన ఘనత చంద్రబాబుదే

– ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర కమిటీ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి
నందమూరి తారకరామారావు అమలుచేసిన సంపూర్ణ మద్య నిషేధాన్ని తుంగలోతొక్కి ఆంధ్రప్రదేశ్ ను మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుదే అని మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు.1990 వ దశాబ్దంలో ఆంధ్రప్రదేశ్లో అమలైన సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమంలో స్ఫూర్తి పొందిన మహిళలు నెల్లూరు జిల్లా దూబగుంట గ్రామంలో మా ఊరికి మద్యం వద్దు అని నినదించి సంపూర్ణ మద్య నిషేద ఉద్యమానికి నాంది పలికారు.1993 లో స్వర్గీయ నందమూరి తారకరామారావు తన ఎన్నికల మేనిఫెస్టోలో సంపూర్ణ మద్య నిషేధాన్ని ప్రకటించి అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేశారు. అప్రజాస్వామికంగా వెన్నుపోటుతో స్వర్గీయ ఎన్టీఆర్ ని పదవీచ్యుతుడిని చేసి సంపూర్ణ మద్య నిషేధానికి వెన్నుపోటు పొడిచిన చరిత్ర నారా చంద్రబాబునాయుడు దే అని వివరించారు.
1994 నుండి అమలైన సంపూర్ణ మద్య నిషేధం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో సత్ఫలితాలను అందించింది. నేరాలు,హత్యలు,ఆత్యచారాలు, ఘర్షణలు,రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి.కుటుంబ హింస తగ్గి కుటుంబాలు సంతోషంగా జీవిస్తూ తమ బిడ్డలను బడికి పంపడం పెరిగింది.భర్త ఆదాయం మద్యానికి కాకుండా కుటుంబానికి దక్కిందని ప్రతి మహిళ ఆనాడు ఆనంద పడింది. నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే తమ నేతలతో ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యంను తెప్పించి ఒకవైపు మద్యం మాఫియాను పెంచుతూ, మరోవైపు మద్యం మాఫియా పెరుగుతుందని మద్యనిషేధం అమలు చేయడం సాధ్యం కాదని సదస్సులు,చర్చాగోష్టి లను రాష్ట్ర ప్రభుత్వ పరంగా నిర్వహించి ఆపైన కోట్లాది మంది మహిళలు సాధించుకున్న సంపూర్ణ మద్య నిషేధానికి తూట్లు పొడిచి మొసలికన్నీరు కార్చడం నారా చంద్రబాబు నాయుడు కే దక్కుతుందన్నారు.
భారతదేశంలో మద్య వ్యసనాన్ని ప్రజల చెంతకు చేర్చడానికి బెల్టుషాపుల కు శ్రీకారం చుట్టింది నారా చంద్రబాబు నాయుడే.మద్యం వ్యసనాన్ని ప్రజల చెంతకు చేరి మద్యం అమ్మకాలను ఆదాయవనరు గా మార్చిన ఘనత వారిదే.సుప్రీంకోర్టు జాతీయ రహదారులకు 500 మీటర్ల లోపు మద్యం షాపులు ఉండకూడదని అమ్మకాలు చేయవద్దని చారిత్రాత్మకమైన తీర్పు ను అందించినా దానికి వక్రభాష్యాలు చెప్పి రహదారుల పక్కన మద్యం షాపులు కొనసాగించి రోడ్డు ప్రమాదాలకు బాధ్యుడుఅయ్యారని తెలిపారు.2013లో జనచైతన్యవేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో మద్య నిషేధం పై జరిగిన సదస్సుకు నారా చంద్రబాబునాయుడు హాజరై బెల్టు షాపులను తొలగిస్తానని,డి -అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తానని,దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తానని చెప్పి అధికారంలోకి రాగానే దశలవారీగా అమ్మకాలు పెంచి ఆదాయ వనరుగా మార్చి భారత దేశంలోనే అత్యధిక తలసరి మద్య వినియోగం ఆంధ్రప్రదేశ్ లో ఉండే విధంగా చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడుదే.
ఈనెల 22వ తేదీన తాడేపల్లిలోని టీడీపీ కార్యాలయం లో నిరసన దీక్షలో మద్యాన్ని గురించి మాట్లాడటం దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉందని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.స్వర్గీయ ఎన్టీరామారావు ప్రాధాన్యత ఇచ్చిన సంపూర్ణ మద్య నిషేధాన్ని,2రూపాయల కే కిలో బియ్యాన్ని,ఆర్టికల్ 356 రద్దులకు తిలోదకాలు ఇచ్చి మాట్లాడటం దుర్మార్గమన్నారు.చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒక్క డి-అడిక్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు.
నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే 15 జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రులలో డి -అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేసి మద్య వ్యసనపరులు లకు ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు లో పేర్కొన్న విధంగా దశలవారీ మద్యనిషేధం లో భాగంగా బహుముఖ కార్యక్రమాలు చేపట్టి మద్యం వినియోగం 40 శాతం,బీరు వినియోగం 78 శాతంకి తగ్గే విధంగా కృషి చేశారు.మద్యం షాపులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకువచ్చి 4400 షాపులను 2900 షాపులకు తగ్గించారు. గతంలో మద్యం షాపులు ఉదయం 9 గంటల నుండి రాత్రి 12 గంటల వరకూ లాభాపేక్షతో ప్రైవేటు వ్యాపారస్తులు నిర్వహిస్తుండగా నేడు ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం షాపులు ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మాత్రమే పనిచేస్తున్నాయని గుర్తుచేశారు.
మద్య విమోచన ప్రచార కమిటీ ఆధ్వర్యంలో నవంబర్ 1 వ తేదీ నుంచి కర్నూల్ నుండి ప్రారంభమై ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలు,యూనివర్సిటీ ప్రాంగణాలలు,డిగ్రీ కాలేజీలలో డ్రగ్స్,మత్తు పానీయాల పై సాంస్కృతిక కార్యక్రమాలను, సదస్సులను నిర్వహిస్తామన్నారు.కరపత్రాలు,ఆడియో క్యాసెట్స్,వీడియో క్యాసెట్స్,ఫోమ్ బోర్డులతో మద్యం దుష్ఫలితాలను రాష్ట్ర వ్యాప్తంగా వివరించడానికి ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు.కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒరిస్సా,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో గంజాయి సాగును ధ్వంసం చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని వివరించారు.

LEAVE A RESPONSE