Home » ఎన్టీఆర్‌ను అవ‌మానించొద్దు…

ఎన్టీఆర్‌ను అవ‌మానించొద్దు…

* కేసీఆర్… నీకు రాజ‌కీయ భిక్ష పెట్టింది ఆ మ‌హానుభావుడే
* మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్ర‌గ‌డ్డ ప్ర‌సూన ఆగ్ర‌హం
* ర‌సుల్‌పూర సర్కిల్లో ఎన్టీఆర్ విగ్ర‌హానికి పాలాభిషేకం
తెలంగాణ ముఖ్య‌మంత్రిగా అధికారం చ‌లాయిస్తున్న కె.చంద్ర‌శేఖ‌ర‌రావుకు రాజ‌కీయ భిక్ష ప్ర‌సాదించిన నంద‌మూరి తార‌క రామారావును అవ‌మానించేలా ఆయ‌న విగ్ర‌హం చుట్టూ రెప‌రెప‌లాడుతున్న గులాబీ పార్టీ జెండాల‌ను త‌క్ష‌ణం తొలగించాల‌ని మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్ర‌గ‌డ్డ ప్ర‌సూన ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
ఆమె మాట్లాడుతూ నేడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న 80శాతం మంది నాయ‌కులు తెలుగుదేశం పార్టీ నుండి వ‌ల‌స వెళ్లిన‌వారేన‌ని కేసీఆర్ మ‌ర్చిపోరాద‌న్నారు. ర‌సుల్‌పుర ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి చుట్టూ తెలంగాణ రాష్ట్ర సమితి జెండాలు, తోరణాలు కట్టి అవమానించారని కాట్రగడ్డ ప్రసూన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆవిర్భావం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన ప్లీనరీ సమావేశాల‌కు హైదరాబాద్ సిటీ అంతటా గులాబీ జెండాలు కట్టి , జీహెచ్ఎంసీ అధికారులు సూచనలు బేఖాతరు చేస్తూ సిటీ అంతటా తోరణాలు, జెండాలను కట్టారు, దీనిపై జీహెచ్ఎంసీ అధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
స్థానిక ఎన్టీఆర్ విగ్రహాన్ని అవమానిస్తూ టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ జెండాలను కట్టి తెలుగుదేశం పార్టీ ని, తెలుగు వారు ఆత్మాభిమానాన్ని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన ఆదివారం హుటాహుటిన ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకొని జెండాలను, తోరణాల‌ను తొల‌గించారు. అనంత‌రం ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీఆర్ఎస్ పార్టీ త‌ర‌ఫున కొంద‌రు కావాల‌ని చేసిన ఈ చ‌ర్య‌ను ఖండిస్తూ కాట్రగడ్డ ప్రసూనతో పాటు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు ఆందోళనకు దిగారు.
మ‌రోవైపు ఈ ఘటనను చూసిన స్థానికులు కూడా మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితి చేసిన పని చేతగానితనానికి నిదర్శనం అని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ,స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ ఇప్పుడు అనుభవిస్తున్న పదవులు నాడు ఎన్టీఆర్ పెట్టిన భిక్ష అని, ఎన్టీఆర్ లాంటి మహానుభావుడి విగ్రహం చుట్టూ ఇలా ఇతర పార్టీ జెండాలు, తోరణాలు కట్టి అవమానించి, టీఆర్ఎస్ పార్టీని వారే భూస్థాపితం చేయడానికి కంకణం కట్టుకున్నార‌ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరైనా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహాల జోలికొస్తే ఉపేక్షించబోమ‌ని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామ‌ని కాట్రగడ్డ ప్ర‌సూన హెచ్చరించారు.

Leave a Reply