నేటి తరానికి స్పూర్తి, భావితరాలకు ప్రేరణ ఎన్టీఆర్

– ప్రపంచవ్యాప్తంగా 100చోట్ల శతజయంతి ఉత్సవాలు
– ఏపీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న చంద్రబాబు
– టీడీపీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరం
– స్వగ్రామాల గురించి మరింత ఆలోచన చేయాలి
– గ్రామస్థులందరితో ఆలోచనలను పంచుకుందాం
– 2024 ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు కృషి చేద్దాం
– ఓటు వేయడంతో పాటు ప్రచారం కూడా నిర్వహిద్దాం
– అట్లాంటా సభలో ఎన్నారైలనుద్దేశించి వెనిగండ్ల

గుడివాడ, మే 14: నేటి తరానికి స్ఫూర్తి, భావితరాలకు ప్రేరణ ఎన్టీఆర్ అని వెనిగండ్ల ఫౌండేషన్ అధినేత, తెలుగుదేశం పార్టీ నేత, ఎన్నారై వెనిగండ్ల రాము అన్నారు. అమెరికాలోని అట్లాంటాలో జరిగిన నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకల్లో వెనిగండ్ల మాట్లాడారు. టీడీపీ శ్రేణులకు తమ ఆరాధ్య దైవం ఎన్టీఆర్ పుట్టినరోజే అసలైన పండుగ అని అన్నారు.

ఎన్టీఆర్ పేరు వింటే ప్రతి తెలుగు హృదయం తెలియని భావోద్వేగంతో ఉప్పొంగుతుందన్నారు. 33ఏళ్ళ సినీ జీవితంలో ఎన్టీఆర్ ఎన్నో రికార్డులు సృష్టించి ప్రశంసలు అందుకున్నారని తెలిపారు. తనను ఆదరించి అభిమానించిన తెలుగు జాతి రుణం తీర్చుకునేందుకు 60ఏళ్ళ వయస్సులో రాజకీయాల్లోకి వచ్చారన్నారు. అనితర సాధ్యమైన విజయాలను అందుకుని తెలుగు ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని రగిలించారన్నారు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని కల్పించారని, మహిళలకు హక్కులను పంచారని, పేదలకు సంక్షేమాన్ని అందించారన్నారు.

అటువంటి కారణజన్ముడు ఎన్టీఆర్ జన్మించి వందేళ్ళు నిండుతున్న సందర్భంగా గత ఏడాది కాలంగా ఎన్టీఆర్ ను స్మరించుకుంటూ ఆయన ఘన చరిత్రను ముందు తరాలు తెలుసుకునేలా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నిర్వహించాలని నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 100చోట్ల ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు.

తెలంగాణా రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో, ఆంధ్రప్రదేశ్ లోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో, భారతదేశ వ్యాప్తంగా మరో 10చోట్ల, అంతర్జాతీయ స్థాయిలో 47 చోట్ల జరిగే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ప్రతి తెలుగు అభిమాని పాల్గొని ఎన్టీఆర్ పై అభిమానాన్ని చాటనున్నారన్నారు. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమన్నారు.

ఎన్నారైలు తమ స్వగ్రామాల గురించి మరింత ఆలోచన చేయాలన్నారు. సొంత గ్రామాలకు ఏం చేయాలో కూడా ఆలోచించాలన్నారు. గ్రామస్థులందరితో ఆలోచనలన్నింటినీ పంచుకుందామని తెలిపారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపునకు కృషి చేయాలని కోరారు. ఓటు వేయడంతో పాటు ప్రచారం కూడా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ ఆశయాలనుకుగుణంగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని వెనిగండ్ల గుర్తుచేశారు.

Leave a Reply