మళ్లీ మరో నిప్పు..!

ఏమిటీ పైత్యం..
బలం ఉంది కదా అని
ఇంత బలుపా..
మరీ ఇంత బరితెగింపా..!

ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్పు చేయడాన్ని బహుశా రాజశేఖరరెడ్డి కూడా హర్షించరేమో..!

అయినా ఇవేం ఆలోచనలు..
ఒక వ్యక్తి కంటే బాగా పని చెయ్యడం అంటే ఆ వ్యక్తి అమలు చేసినవి రద్దు చేయడమో..వాటి పేర్లు మార్చి యధాతథంగా కొనసాగించడమో కాదు..
ఉన్న వాటినే ముందు కంటే సమర్థ వంతంగా అమలు చెయ్యడం..!

దురదృష్టవశాత్తు జగన్ ప్రభుత్వం ముందు నుంచి కూడా ఒక రకమైన ధోరణికి కట్టుబడిపోయింది. 2019లో జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అభివృద్ధి విషయంలో అష్టావధానాలు మాని చంద్రబాబు సర్కార్ నష్టావధానాలకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. రావడం రావడమే మూడు రాజధానుల వివాదాన్ని తలకెత్తుకుని ఆనాటి నుంచి స్థిరమైన ఏ నిర్ణయమూ తీసుకోకుండా మొత్తానికి రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి తెచ్చింది.ఒక దశలో రాజధాని వికేంద్రీకరణ కోసం శాసనమండలిని కూడా రద్దు చెయ్యడానికి వెనకాడని పంతం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిది..

ప్రగతి భవన్ కూల్చివేతతో పెను వివాదానికి తెర ఎత్తి
ఎన్ని జరిగినా తన నిర్ణయంలో వెనకడుగు వేసేది లేదని ఢంకా బజాయించారు జగన్..
కోర్టు నిర్ణయాలను సైతం గౌరవించని దశకు వెళ్ళిపోయింది జగన్ సర్కార్..ఇప్పుడిక ఈ చర్చను మరీ లోతుగా సాగదీయాలని అనుకోవడం లేదు.కానీ ఇదంతా చెప్పడం ఎందుకంటే నిర్ణయం తీసుకుంటే ఇక అంతే సంగతులని స్పష్టం
చెయ్యడానికి..!

ఇప్పుడు రేగింది ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు వివాదం.. ప్రభుత్వాలకు ఇది పరిపాటైపోయింది..పథకాలకు..సంస్థలకు ఒక ప్రభుత్వం పెట్టిన పేరును..ముఖ్యంగా నేతలకు సంబంధించినవి అయితే మార్చడం మరో ప్రభుత్వానికి అలవాటుగా మారింది.. రాజీవ్..ఇందిర.. ఎన్టీఆర్.వైఎస్సార్..ఇలా.. మరి తమిళనాడులో ఆరోగ్య వర్సిటీ పేరు ఎన్ని పార్టీల ప్రభుత్వాలు వచ్చినా డాక్టర్ ఎం జి ఆర్ హెల్త్ యూనివర్సిటీ గానే ఉండిపోయింది గాని కరుణానిధి..జయలలిత.. ఇలా మారలేదు… కొన్ని సంస్థలకు కొన్ని పేర్లు.. అలా ఉండి పోవాల్సిందే.. కాని జగన్ ప్రభుత్వం మరోలా తలపోసింది.ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్సార్ పేరు పెట్టాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ఒక్కసారిగా దుమారం రేపింది.

దీని వల్ల జగన్ మరోసారి తెలుగుదేశంపై..చంద్రబాబుపై తన అక్కసును తీర్చుకునేందుకు సిద్ధ పడుతున్నట్టే..వాస్తవానికి ముఖ్యమంత్రికి ఎన్టీఆర్ పట్ల గౌరవం ఉంది..జిల్లాకు ఆయన పేరు పెట్టి ఈ మధ్యనే ఆ విషయాన్ని చాటుకున్నారు కూడా..తాజాగా అదే విషయాన్ని అసెంబ్లీలో పునరుద్ఘాటించారు కూడా..
అయినా ఈ కొత్త నిర్ణయం మరెందుకు తీసుకున్నారో..
తెలుగుదేశాన్ని ఆట పట్టించడానికా..జనం దృష్టి మరల్చడానికా..ఏది ఏమైనా రాష్ట్రంలో మరో అలజడికి ముఖ్యమంత్రి ఏరికోరి తెర ఎత్తినట్టే..ఇప్పటికే అధికార భాషా సంఘం పదవికి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా చేసి నిరసన తెలిపారు.రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయో మరి..!?

సురేష్ కుమార్ ఇ
జర్నలిస్ట్
9948546286

Leave a Reply