Suryaa.co.in

Andhra Pradesh

ఆదర్శవంతమైన నియోజకవర్గంగా నూజివీడు

– సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి
– నూజివీడులో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పార్థసారథి

నూజివీడు: నూజివీడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. నూజివీడులోని ఎం.ఆర్. అప్పారావు కాలనీలో త్రాగునీటి పైపులైన్ల నిర్మాణానికి శనివారం మంత్రి పార్థసారథి శంఖుస్థాపన చేశారు.

ఎన్ .డి. ఏ . కూటమి వంద రోజుల పండుగ కార్యక్రమంలో భాగంగా ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంపై ముద్రించిన స్టిక్కర్ ను ప్రజల ఇళ్లకు వెళ్లి అంటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం గత 100 రోజులల్లో చేపట్టిన అభివృద్ధి పనులను తెలియజేసి, వారి సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ నూజివీడు నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద పాలేరు ను అవుతానని ఎన్నికలకు ముందు మీకు ఇచ్చిన మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని, నూజివీడు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి, రాష్ట్రానికే మోడల్ నియోజకవర్గంగా నిలబెడతానన్నారు. నూజివీడు పట్టణం అంతా ఒకేవిధమైన డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటుచేస్తామన్నారు.

ఈ మేరకు టెండర్లు పిలిచామని, నెలరోజుల్లోగా పనులు ప్రారంభిస్తామన్నారు. నూజివీడులో ఎం.ఆర్. అప్పారావు కాలనీ అతిపెద్ద కాలనీ అని, కాలనీ అభివృద్ధి కి అవసరమైన త్రాగునీరు, విద్యుత్, డ్రైనేజ్, వీధి దీపాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. కాలనీలో త్రాగునీటి సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కార చర్యలు తీసుకుంటామన్నారు.

ఎం.ఆర్. అప్పారావు కాలనీలోని 24 రోడ్లలో 10 రోడ్లలో పైపులైన్ల ఏర్పాటుకు మంజూరు చేయడం జరిగిందని, మిగిలిన రోడ్లలో కూడా పైపులైన్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. కాలనీ ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తామని, ఆర్.టి.సి. బస్ సర్వీస్ ఏర్పాటుచేస్తామని, ప్రజలు వినియోగించుకోవాలన్నారు. కాలనీలో ఆసుపత్రి నిర్మాణ పనులు నెలలోగా పూర్తి చేసి వినియోగంలోనికి తీసుకురావాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ రామిశెట్టి త్రివేణి దుర్గ, మునిసిపల్ కమీషనర్ ఆర్. వెంకట్రామిరెడ్డి, డీఈ లక్ష్మీనారాయణ, ప్రముఖులు బర్మా ఫణిబాబు, కాపా శ్రీనివాసరావు , తలపంటి రాజశేఖర్, చెరుకూరి దుర్గాప్రసాద్, మున్సిపల్ అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నూజివీడు పట్టణంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 వేల రూపాయల చెక్కును మంత్రి పార్థసారథి కి అందించారు. ఈ సందర్భంగా విపత్తు సమయంలో మానవత్వంతో స్పందించి విరాళం అందజేసిన మహిళలను మంత్రి అభినందించారు.

LEAVE A RESPONSE