Suryaa.co.in

Andhra Pradesh

అమరావతి అభివృద్ధి పనులకు తొలగిన అడ్డంకులు!

•సాంకేతిక కమిటీ నివేదికలోని 23 ప్రతిపాదనల ప్రకారం పాత టెండర్లు క్లోజ్
•హైకోర్టు, అసెంబ్లీ మినహా మిగతా పనులకు డిసెంబరు 31 లోగా కొత్త టెండర్లు
•హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణాలకు  జనవరిలోపు నూతన టెండర్లు 
•రానున్న మూడేళ్లలో  పనులన్నీ పూర్తి
– రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడి 

అమరావతి: అమరావతి అభివృద్ది పనులకు అడ్డంకిగా ఉన్న పాత టెండర్లను క్లోజ్ చేసే మార్గం సుగమం అయ్యిందని, త్వరలోనే నూతన టెండర్లను పిలిచే ప్రక్రియను ప్రారంభించి రానున్న మూడేళ్లలో అమరావతి అభివృద్ది పనులను అన్నింటినీ పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.

సోమవారం రాష్ట్ర సచివాలయంలో పాత్రికేయులతో  ఆయన మాట్లాడారు.  ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు అధ్యక్షతన  39వ సీఆర్డిఏ సమావేశం రాష్ట్ర సచివాలయంలో జరిగిందని  ఈ సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ది పనులకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు.

అమరావతి అభివృద్ది పనులకు సంబంధించి 2014-19 మధ్యకాలంలో రూ.41 వేల కోట్ల విలువైన టెండర్లను పిలిచి,  వాటిలో  దాదాపు రూ.35 వేల కోట్ల విలువైన పనులను ప్రారంభించినట్టు చెప్పారు. వీటిలో  హైకోర్టు, అసెంబ్లీ భవనాలతో పాటు ప్రధాన రహదారులు, ఇతర రహదారులు, హైకోర్టు జడ్జిలు, మంత్రులు,  అధికారుల వసతి గృహాల పనులను చేపట్టామని, అయితే గత ప్రభుత్వం  మూడు రాజధానులు అంటూ ఈ పనులన్నింటినీ నిర్వహించేందుకు ఏమాత్రం శ్రద్ద చూపకుండా విడిచిపెట్టిందని తెలిపారు.

పనులను ప్రారంభించిన పలు కాంట్రాక్టు ఏజన్సీలు నిర్వహించిన పనులకు కూడా బిల్లులను చెల్లించకుండా పెద్ద ఎత్తున బకాయిలను పెట్టారన్నారు. ఈ పాత టెండర్లకు సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించిన తదుపరే నూతన టెండర్లను పిలవాలనే ఉద్దేశ్యంతో పాత టెండర్లను క్లోజ్ చేసేందుకు విధి విధానాలను రూపొందించేందుకై  చీఫ్ ఇంజనీర్లతో కూడిన సాంకేతిక కమిటీని  జూలై 24 న ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, దాదాపు 23 పాయింట్లతో అక్టోబరు 29 న ఆ కమిటీ ఒక నివేదికను ప్రభుత్వానికి అందజేసిందని నారాయణ తెలిపారు.

నేటి సీఆర్డీఏ సమావేశంలో ఆ నివేదికపై పూర్తి స్థాయిలో చర్చించిన తదుపరి ఆమోదం తెలిపినట్టు పేర్కొన్నారు.  కమిటీ సిఫార్సు చేసిన 23 ప్రతిపాదనల ప్రకారం పాత టెండర్లను అన్నింటినీ క్లోజ్ చేసిన తదుపరి  నూతన టెండర్లను ఆహ్వానిస్తామని చెప్పారు.  హైకోర్టు, అసెంబ్లీ మినహా మిగతా పనులకు డిసెంబర్‌ 31 లోపు,  హైకోర్టు, అసెంబ్లీ భవన నిర్మాణాలకు  జనవరి లోపు నూతన  టెండర్లను పిలుస్తామని మంత్రి తెలిపారు. రానున్న మూడేళ్లలో అమరావతి అభివృద్ది పనులు అన్నీ పూర్తి చేస్తామని, ఐదేళ్లలో  ప్రపంచంలోని ఐదు ఉత్తమ నగరాల్లో అమరావతి ఒకటిగా విరాజిల్లుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

అమరావతి అభివృద్ది పనులకు సంబంధించి ప్రపంచ బ్యాంక్ రూ.15 వేల కోట్లు ఇవ్వడానికి అంగీకారం తెలిపిందని, అయితే వరద నివారణా పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆ బ్యాంకు ప్రతినిధులు కోరారన్నారు. అందుకు తగ్గట్టుగా అమరావతి రాజధాని 217 చ.కి. కోర్  క్యాపిటల్ పరిధిలోను, బయట పలు చోట్ల రిజర్వాయర్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

క్యాపిటల్  సిటీ  పరిధిలో కొండవీటి, పాలవాగు, గ్రావిటీ కెనాల్ రిజర్వాయర్లను, క్యాపిటల్ సిటీకి బయట నీరుకొండ, కృష్ణాయపాలెం, శాఖమూరు, ఉండవల్లి  ప్రాంతాల్లో  స్టోరేజ్ రిజర్వాయర్లను నెదర్లాండ్ డిజైన్ల ప్రకారం నిర్మించనున్నట్టు ఆయన తెలిపారు. అమరావతి చుట్టూ బైపాస్ రహదారులు నిర్మాణం జరుగుతున్నప్పటికీ గతంలో నిర్ణయించిన ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేస్తామన్నారు.

LEAVE A RESPONSE