వృత్తి..ప్రవృత్తి

“మాచన”..సమాజ హిత తపన
20 ఏళ్లుగా పొగాకు నియంత్రణ
(మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం)

వాస్తవానికి ఓ డిప్యూటీ తహశీల్దార్ హోదా ఉన్న వ్యక్తికి… ఏదో సాధించాలన్న తపన.. ఆ తపనకు తగ్గ కమిట్మెంట్ ఉండటమంటే కాస్తా అరుదే. అలా ..అని ఎవరూ ఉండరని కారు. అలాంటివారిలో ఒకరే మనమిప్పుడు చెప్పుకునే రఘునందన్ మాచన. పౌరసరఫరాల శాఖ లో ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్ గా ఎక్కడో ఓచోట నిత్యం దాడులు, తనిఖీలు నిర్వహించే క్రమంలో…ఎందరో అధికారుల్లాగే లంచాలకు మరిగి తానూ ఆర్థికంగా అందలమెక్కొచ్చు. కానీ అలా అయితే రఘునందన్ గురించి చెప్పుకోవడమెందుకు..?

తన సర్వీస్ లో రఘునందన్ కు ఉద్యోగ బాధ్యతే కావచ్చు.. కానీ అందులో మానవత్వం ఉంది. సమాజాన్ని ఉద్దరించాలి, మార్చాలన్న తపన కనిపిస్తుంది. అందుకే ఈ అరుదైన అధికారికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. పొగాకు నియంత్రణలో రఘునందన్ డెడికేషన్ జర్మనీ దేశాన్నీ టచ్ చేసింది. ఇప్పుడు రఘునందన్ ను ఆ దేశ ప్రతినిధులు తమ వద్దకు రావాలని ఆహ్వానిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా పుకార్లు, ఫార్వర్డ్లు, తమకు గిట్టనివారిని ఉతికారేసే ఇష్టారీతి ద్వేషపు రాతలు రాసే వాళ్లే కనిపించే రోజుల్లో… పొగాకు నియంత్రణపై రఘునందన్ అదే సామాజిక మధ్యమాలనుపయోగించుకుని కల్పిస్తున్న అవగాహన అంతర్జాతీయ సమాజాన్నీ చేరుతోంది.

# SayNoToTOBACCO
# QuitTOBACCO
#SmokingKills
అంటూ ట్విట్టర్ ద్వారా ఆయన పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారం, జర్మనీని ఆకట్టుకోగా… ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం తగిన గుర్తింపు ఇచ్చింది. వైద్యుడు కానప్పటికీ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్..తన కార్యక్రమాలకు రఘునందన్ ను ఆహ్వానిస్తోంది.

అయితే ఇంతేనా.. మాచన అంటే…? పంజాబ్ ఛండీగడ్ లో జరిగిన పొగాకు నియంత్రణ అంతర్జాతీయ సదస్సులోనూ “మాచన”నే భారత్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ గౌరవ ప్రతినిధిగా పాల్గొనడమంటే దానివెనుక ఆయన అవిరళ కృషే కారణం. పొగాకు ఉత్పత్తుల వల్ల ఆరోగ్యానికీ, ఐశ్వర్యానికీ ముప్పు కలగక ముందే.. టుబాకో కు గుడ్ బై చెప్పే అవగాహన ప్రతి ఒక్కరిలో కల్గాలని ఆశిస్తున్న వ్యక్తి మాచన. మాచన రఘునందన్ ది సుమారుగా రెండు దశాబ్దాల కృషి. అయితే ఆ ఫలాలు ఇప్పుడు అందుతున్నాయి. ఆయన ఆశించిన మార్పు ఆయనెంచుకున్న లక్ష్యాల్లో కనిపిస్తోంది. ఆయన పేరూ హైదరాబాద్ జిల్లా దాటి.. రాష్ట్రవ్యాప్తమై.. దేశం గుర్తించి… అంతర్జాతీయ సమాజానికీ వినిపిస్తోంది.

మేడ్చల్ జిల్లా కేశవరం కు చెందిన “మాచన”..రంగారెడ్డి జిల్లాలో ఆంగ్లభాషా పండితుడిగా పనిచేసి ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్రపతి పురస్కారాన్నందుకున్న అభిమన్యు కుమారుడు. సాధారణంగా పండిత పుత్ర పరమశుంఠ అని నానుడి. కానీ.. మాచన అందుకు భిన్నం. ఇప్పుడు తన కుటుంబం మొత్తం గర్వించదగ్గ రీతిలో తన ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూనే… పొగాకుపై ఉద్యమం చేస్తున్న పోరాటశీలి. అందుకే జాతీయస్థాయిలో పొగాకు నియంత్రణకు కృషి చేస్తున్న రిసోర్స్ సెంటర్ ఫర్ టుబాకో కంట్రోల్ … రఘునందన్ ని “టుబాకో కంట్రోల్ స్టాల్ వర్ట్” గా గుర్తించింది.

అమెరికాకు చెందిన హెల్త్ మ్యాగజీన్ పల్మనరీ మెడిసిన్ కూడా రఘునందన్ విజయగాధను వావ్.. వెల్డన్. అని కొనియాడింది. ఈమధ్యే రఘునందన్ విధి నిర్వహణలో కనబరుస్తున్న చొరవతో పాటే… ఆయన ఆశయాలు.. వాటికై “మాచన” పోరాటం గురించి తెలుసుకున్న పలువురు రఘునందన్ ను అభినందించడంతో తన బాధ్యత మరింత పెరిగిందంటారు “మాచన”.

రఘునందనంటే ఓ నిబద్ధత గల ఉద్యోగి… తన విధులను బాధ్యతగా నిర్వహిస్తూనే… సమాజ హితం కోసం పోరాడే శ్రేయోభిలాషి. ఆరోగ్యానికి చేటు చేస్తున్న పొగాకు ఉత్పత్తుల వాడకం ను కూకటివేళ్లతో పెకిలించే చైతన్యం సమాజం నుంచే రావాలని పోరాడుతున్న ఉద్యమశీలి..

వీటన్నింటినీ మించి సామాన్యుల పాలిట సాటి మనిషిగా స్పందించే మానవీయకోణం.. మొత్తంగా మన రాష్ట్రం వాడు.. మనవాడు… నిత్యం అందరిలో ఒకడు.. కానీ, తనకంటూ ఓ ప్రత్యే’కథను’ సంతరించుకుంటున్నవాడు.. రఘునందన్ మాచన.

రఘునందన్ మాచన ఈ జర్నీ మరింత ముందుకెళ్లాలని… మరెందరో అధికారులకు, సామాన్యులకు ఈయన స్ఫూర్తి ఓ ప్రేరణ కావాలనీ ఆశిద్దాం.

రఘునందన్ ఫోన్ నంబర్ 9441252121