మార్చి 26న మహారాష్ట్రలోని కాందార్ లోహలో బిఆర్ఎస్ భారీ బహిరంగ సభ

Spread the love

ఈ నెల 26 న మహారాష్ట్రలోని కాందార్ లోహ లో బిఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించాలని బిఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు ఉండనున్నాయి. బిఆర్ఎస్ పార్టీ విధానాలు, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ దార్శనికత దేశ ప్రజలతో పాటు, రాజకీయాల్లో తలపండిన వివిధ పార్టీలకు చెందిన పలువురు సీనియర్ రాజకీయ నాయకులను ఆకట్టుకుంటున్నది. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా యావత్ దేశ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా సాగుతున్న బిఆర్ఎస్ పార్టీ విధివిధానాలు నచ్చి ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు పలు రాష్ట్రాల నుంచి బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.

ఇటీవలి నాందేడ్ సభ పెద్ద ఎత్తున విజయవంతమై భారతదేశ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారి చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. భారత ప్రజల కోసం, వారి అభివృద్ధి సంక్షేమం కోసం బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పడుతున్న తపన, వారి దార్శనికతను మహారాష్ట్ర సహా, ఉత్తర భారత ప్రజలు అర్థం చేసుకున్నారు. తెలంగాణలో విప్లవాత్మక రీతిలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశ ప్రజలను ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే.

తెలంగాణ వంటి ముఖ్యమంత్రి మాకూ ఉంటే బాగుండు అని వాళ్ళు కోరుకుంటున్న నేపథ్యంలో వారి ఆకాంక్షలకు కార్యరూపం ఇచ్చే దిశగా దేశ ప్రజలు కోరుకున్నట్టుగానే సీఎం కేసీఆర్ తెలంగాణతో పాటు యావత్ దేశ ప్రజల అభివృద్ధికి నడుం కట్టి బయలుదేరడం వారికి అందివచ్చిన అవకాశంగా మారింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ వంటి గొప్ప నాయకునికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించడం ద్వారా, తమ జీవితాల్లో గుణాత్మక మార్పుకు తామే నాంది పలకాలని వారు కోరుకుంటున్నట్టుగా నాందేడ్ సభ సాక్షిగా ఇప్పటికే స్పష్టమైంది.

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపి)కి చెందిన పలువురు సీనియర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ లో చేరేందుకు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ఎన్సీపి కిసాన్ సెల్ అధ్యక్షుడు శంకరన్న ధోంగే, మాజీ ఎమ్మెల్యే నాగనాథ్ గిసేవాడ్ ( వీరు భోకర్ నియోజకవర్గం నుంచి మాజీ సిఎం అశోక్ చౌహాన్ మీద కేవలం వెయ్యి వోట్ల తేడా తో ఓడి పోయారు)., ఎన్సీపి నాందేడ్ జిల్లా అధ్యక్షుడు దత్తా పవార్, మహారాష్ట్ర ఎన్సీపి యూత్ సెక్రటరీ శివరాజ్ ధోంగే, ఎన్సీపి నాందేడ్ అధ్యక్షుడు శివదాస్ ధర్మపురికర్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు మనోహర్ పాటిల్ భోసికర్, ఎన్సీపి అధికార ప్రతినిధి డాక్టర్ సునీల్ పాటిల్, ఎన్సీపి లోహ అధ్యక్షుడు సుభాష్ వాకోరే, ఎన్సీపి కాందార్ అధ్యక్షుడు దత్తా కరమాంగే, జిల్లా పరిషత్ సభ్యులు అడ్వొకేట్ విజయ్ ధోండగే, ఎన్సీపి యూత్ ప్రెసిడెంట్ హన్మంత్ కళ్యాంకర్, ప్రవీణ్ జాతేవాడ్, సంతోష్ వార్కాడ్, స్వాప్నిల్ ఖీరే తదితరులు మంగళవారం నాడు హైదరాబాదులో బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ విధివిధానాలు, భవిష్యత్ కార్యాచరణ గురించి సీఎం కేసీఆర్ తో సుదీర్ఘంగా చర్చించారు. భారీ బహిరంగ సభ నేపథ్యంలో పెద్ద ఎత్తున తమ అనుచరులు, కార్యకర్తలతో పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే , నాందేడ్ ఇంచార్జీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply