Suryaa.co.in

Features

ఒక రోజు..

ఒకరోజొస్తుందెవరికైనా
శూన్యపాత్రలు
అక్షయ పాత్రలయ్యేరోజులొస్తాయి

అవహేళనల్ని
అగాధంలోకి నెట్టి
అంధకారాన్ని మట్టుబెట్టి
అధికారం అందలం
చేరువయ్యే రోజులొస్తాయి

బళ్ళు ఓడలై
ఓడలు బళ్లై
జగత్తంతా తలకిందులుగా
అగుపించే రోజులే
విశ్వ గమనానికి సాక్ష్యాలు

సంకల్పం ఒరలో
సాధన ఆయుధమై
విజయతీరం ఒడిలో చేరాక
అహంకారపు కారుమేఘం
మదం మత్తును తలకెక్కించాక
విజయగర్వపు
కారుమేఘం వర్షించాక
ఓడలే బళ్లు

ఒకరోజోస్తుంది
ఎవరికైనా ఎక్కడైనా
దేహం పాత్రని మింగేసి
అహంపాత్రను కరిగించేసి
విశ్వ విజేతను
కాలం కౌగిలించే రోజొకటోస్తుంది

కాలం నిను స్మరించే రోజే
అసలైన రోజు కదూ

– గోలి మధు

LEAVE A RESPONSE