– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్
ఏపీలో గత నాలుగేళ్లుగా జరుగుతున్న లిక్కర్ స్కాంపై, ఆర్థిక అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురందరేశ్వరి రాష్ట్ర ఆర్థిక అంశాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా పురందరేశ్వరి ఢిల్లీ వెళ్లి అమీత్ షాతో రాష్ట్రానికి సంబంధించి ఎక్సైజ్, లిక్కర్ స్కామ్ లపై విచారణ జరిపించాలని కోరడమైనది. పురందేశ్వరి కేంద్రాన్ని ఏమి కోరిందో చెప్తున్నారే గాని, కేంద్రం తీసుకున్న చర్యలు గురించి గానీ, కేంద్రం నుండి ఏం సమాధానం వచ్చిందనేదిగాని చెప్పటం లేదు.
దీనిని బట్టి రాష్ట్ర బిజెపి నేతలు, కేంద్రంలోని బిజెపి నేతలు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పక్కాగా డ్రామా ఆడుతున్నట్లు అర్థమవుతున్నది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నామనే పద్ధతుల్లో పురంధరేశ్వరి కేంద్రానికి కంప్లైంట్స్ చేస్తుంటే, కేంద్రం మాత్రం మౌనం వహిస్తోంది. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో లిక్కర్ స్కాం జరుగుతున్నా కేంద్రం పట్టించుకోవటం లేదు. ఢిల్లీలో రూ. 100 కోట్ల లిక్కర్ స్కాం జరిగితే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియతో సహా కొందరిని జైలుకు పంపారు. మరి ఏపీలో ఎందుకు చర్యలు తీసుకోలేదు.
ఏపీలో అప్పులు కేంద్రం అనుమతితోనే తొమ్మిది లక్షల కోట్లకు చేరాయి. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నాయి. ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్, అప్పులు, ఆర్థిక పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం.