కడప చిన్నోడికి ఒక న్యాయం … గోదావరి బుల్లోడికి మరొక న్యాయమా?

-గతంలో చేసిన తప్పును రాష్ట్ర ప్రజలు మళ్ళీ పునరావృత్తం చెయ్యొద్దు
-ఒక్క ఛాన్స్ అంటే అజ్ఞానులను అందలమెక్కించారు
-రానున్న ఎన్నికల్లో తమ పార్టీకి ఒక్క సీటు ఇచ్చిన రాష్ట్ర ప్రజలు తప్పు చేసినట్టే
-పోలవరం, అమరావతికి అన్యాయం చేసిన వారిని రాష్ట్ర ప్రజలు క్షమించరు
-పోలవరం పూర్తి చేయలేని జగన్మోహన్ రెడ్డి, సర్ ఆర్థర్ కాటన్ ధవలేశ్వరం బ్రిడ్జి పేరును మార్చి తన పేరు పెట్టుకోవడం మినహా చేయగలిగిందేమీ లేదు
-రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలవరం నిర్మాణం కచ్చితంగా పూర్తి చేస్తాం
-రానున్న 24 గంటల వ్యవధిలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ తథ్యం
-కడప ఎంపీ కి ఒక రూల్ తనకు మరొక రూలా?… ఇదెక్కడి న్యాయం?
-తన సొంత డబ్బులతోనే పార్టీని నిర్వహించుకుంటూ, కౌలు రైతులకు సహాయం చేస్తున్న పవన్ కళ్యాణ్
-ప్రజలపై పన్నుల భారం మోపుతున్న జగన్మోహన్ రెడ్డి సర్కార్
-రెండు పార్టీలిప్పటికే కలిశాయి, మూడవ పార్టీ కూడా కలిస్తే ఆ మూడింటిలో ఒక పార్టీ తరఫున రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తా… లేదంటే రెండింటిలో ఒక పార్టీ తరఫున బరిలోకి దిగడం ఖాయం

-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

ఒక్క ఛాన్స్ అని అడిగితే రాష్ట్ర ప్రజలు అజ్ఞానులను , అసమర్థులను , అవినీతిపరులను అందలమెక్కించారని, మళ్లీ అటువంటి పొరపాటు పునరావృతం చేయొద్దు. అజ్ఞానులను ఎన్నుకొని మనల్ని మనం ఈ స్థితికి దిగజార్చుకున్నాం. ఇప్పటికే చేసింది తప్పు. మళ్లీ అటువంటి తప్పును చేయవద్దంటూ నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు విజ్ఞప్తి చేశారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉపయోగపడే ఎన్నో సంక్షేమ పథకాలను ఎత్తివేసి, బటన్ నొక్కుతున్నానని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. బటన్ నొక్కుడు కార్యక్రమం అంతా ఒక మోసం. బటన్ నొక్కిన సగం మంది లబ్ధిదారులకు డబ్బులే చేరడం లేదు. ఎస్సీ బీసీలతోపాటు, కాపులకు జగన్మోహన్ రెడ్డి తీరని అన్యాయం చేశారు. రాష్ట్రానికి వరప్రదాయిని అయిన పోలవరం ప్రాజెక్ట్, రాజధాని అమరావతికి అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో ఒక్క సీటు ఇచ్చిన తప్పు చేసిన వారు అవుతారని ఆయన పేర్కొన్నారు.

మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘు రామకృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… గతంలో చేసిన తప్పును, ఈ ఏడాది డిసెంబర్ లోనే సరి చేసుకునేందుకు రాష్ట్ర ప్రజలకు అపర భగీరథుడైన జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పిస్తారట. ప్రతి ఒక్కరూ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని కోరారు.

పోలవరం పూర్తి చేసి ఉంటే రాష్ట్ర జిడిపి మరో మూడు, నాలుగు లక్షల కోట్ల రూపాయలు పెరిగేది
రాష్ట్రానికి వరప్రదాయిని అయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే, రాష్ట్ర జిడిపి మరో మూడు, నాలుగు లక్షల కోట్ల రూపాయలు పెరిగి ఉండేది. పోలవరం ప్రాజెక్టుకు ఇంతటి అన్యాయం చేసిన వారిని మా ఉభయగోదావరి జిల్లాల ప్రజలు వదిలిపెట్టరు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే, ఒక్క ఉభయగోదావరి జిల్లాల ప్రజలకు మాత్రమే కలిసి వచ్చేదేమీ లేదు. పోలవరం పూర్తి చేసి ఉంటే, రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరిగి ఉండేది.

ఎగువ నుంచి కృష్ణా డెల్టాకు ఇవ్వాల్సిన నీటిని పైనుంచి రాయలసీమకు తరలించడం ద్వారా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం, బంగారం చేయవచ్చు. గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాన్ని పోలవరం నీటి ద్వారా స్థిరీకరించవచ్చు. గతంలో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసి చూపించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే విశాఖపట్నం వరకు నీటిని తీసుకువెళ్లే అవకాశం ఉంది. విశాఖపట్నం అభివృద్ధి కోసం పోలవరం నీరు ఎంతో అవసరం. రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడే పోలవరం ప్రాజెక్టును తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం మూడు నుంచి మూడున్నర శాతం పనులు మాత్రమే చేయడం విస్మయాన్ని కలిగించింది.

గత ప్రభుత్వ హయాంలో పోలవరం పనులు చురుకుగా జరిగిన తీరును రాష్ట్ర ప్రజలంతా తిలకించారు. తాను టిడిపి లో కొనసాగినప్పుడు, తన నియోజకవర్గ నుంచే 100కు పైగా బస్సుల ద్వారా ప్రజలను పోలవరం పనుల ప్రగతి సందర్శనార్థం తీసుకు వెళ్లడం జరిగింది. ఆ తరువాత రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు విచ్చేసి పోలవరం ప్రాజెక్టు పనులను తిలకించారు. పోలవరం పూర్తి చేయాలన్న ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమించారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

బంగారు మయమైన తెలంగాణ
తమకంటే చిన్న రాష్ట్రమైన తెలంగాణ విభజన అనంతరం బంగారు మయం అయ్యిందని రఘురామకృష్ణంరాజు అన్నారు. కేవలం పాత ఐదారు జిల్లాలకు నీరు అందించే కాలేశ్వరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా లక్షా 30 వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించింది. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయమేమి చెయ్యలేదు. అయినా సొంత డబ్బుల ద్వారా కాలేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడం వల్ల తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ కూడా 30 లక్షల రూపాయలకు తక్కువగా ఎకరా భూమి లభించడం లేదు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 42 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేయగా, 22 వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వమే అందజేస్తానని హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా ఇప్పటికే 19 వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. కేంద్ర ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సహాయం కాకుండా అదనంగా మరో 20 వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రజల జీవనాడి అయిన పోలవరం కోసం జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఖర్చు చేయలేదా?

కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయకపోతే, పోలవరం ప్రాజెక్టును నిర్మించారా? అంటూ గత ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత హ్యాండ్సప్ అనడం సిగ్గుచేటు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే రాష్ట్ర ఆదాయంతో పాటు, వ్యవసాయ రంగం ఎంతో అభివృద్ధి చెంది ఉండేది. పోలవరం నిర్మాణాన్ని తమ పార్టీ ప్రభుత్వం పూర్తి చేయలేదు. ఇదో వీక్ పార్టీ అని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

రానున్న ఎన్నికల్లో తాను ఈ పార్టీ నుంచి పోటీ చేసేది లేదు
ఉభయగోదావరి జిల్లాల ప్రజలకు సిగ్గు, మానవత్వం ఉంటే తమ పార్టీని భూస్థాపితం చేయడం ఖాయం. పోలవరం ప్రాజెక్టును ఇంతగా సర్వనాశనం చేసిన తమ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదు. తమ పార్టీకి ఓటు అడుగే హక్కు లేదని చెబుతున్న తనకు కూడా ఓటు అడిగే హక్కు ఎలా ఉంటుందని సందేహం మీడియా ప్రతినిధులకు రావచ్చు.

రానున్న ఎన్నికల్లో తాను ఈ పార్టీ నుంచి పోటీ చేసేది లేదు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారని మీడియా ప్రతినిధి ఒకరు ప్రశ్నించగా… ఇప్పటికే రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య పొత్తు కుదిరింది. మూడవ పార్టీ కూడా కలిస్తే, ఆ మూడు పార్టీలలో ఒక పార్టీ తరఫున తాను బరిలోకి దిగుతానని, లేనిపక్షంలో రెండింటిలో ఒక పార్టీ తరఫున పోటీ చేయడం ఖాయం. పొత్తులో భాగంగా నరసాపురం స్థానం ఏ పార్టీకి కేటాయిస్తే ఆ పార్టీ తరఫున తాను పోటీ చేయగలననేది తన నమ్మకమని రఘు రామకృష్ణంరాజు పేర్కొన్నారు.

రాష్ట్రంలో రానున్నది ప్రజా ప్రభుత్వమని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల భగీరథ జయంతి ఉత్సవాల సందర్భంగా, జగన్మోహన్ రెడ్డిని అపర భగీరధుడిగా కొంతమంది కీర్తించడం చూస్తుంటే వారి మైండ్ దొబ్బిందేమో నన్న అనుమానం కలిగింది. గత ప్రభుత్వ హయాంలో శరవేగంగా నిర్మాణ పనులు జరుపుకున్న పోలవరం ప్రాజెక్ట్ ను తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరిట జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు.

సిబిఐ చిత్తశుద్ధిని శంకించలేం… చిత్తశుద్ధి లేకపోతే అవినాష్ రెడ్డికి తాజాగా నోటీసులే ఇచ్చి ఉండేవారు కాదు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును విచారణ జరుపుతున్న సిబిఐ అధికారుల పనితీరును శంకించలేం. ఈ కేసులో నిందితులను అరెస్టు చేయాలన్న చిత్తశుద్ధి వారికి లేకపోతే, తాజాగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులే ఇచ్చి ఉండేవారు కాదని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు. రానున్న 24 గంటల వ్యవధిలో వైయస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ తథ్యం. వైయస్ అవినాష్ రెడ్డి ప్రత్యేక విమానంలో విదేశాలకు పారిపోకుండా, విమానాశ్రయాల వద్ద అలర్ట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

ఆయన పేరిట సిబిఐ అధికారులు రెడ్ నోటీస్ జారీ చేయవచ్చు. వైయస్ అవినాష్ రెడ్డి హైదరాబాదు నుంచి పులివెందులకు బయలుదేరడంతో ఆయన్ని మార్గమధ్యలోనే అరెస్టు చేస్తారా?, లేకపోతే పులివెందులలో అరెస్టు చేస్తారా?? అన్న సస్పెన్స్ నెలకొంది. పులివెందులలో అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకునే సమయంలో ఆయన తన అనుచరుల ద్వారా ఏమైనా ఆందోళనలను చేయిస్తే, చేయిస్తారేమో. రానున్న 24 గంటల వ్యవధిలో వైయస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకపోతే, సిబిఐ అప్రతిష్ట పాలు కానుంది.

గత 20 రోజులుగా అవినాష్ రెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదనే అనుమానం కొందరికి ఉంటే ఉండవచ్చు. ప్రత్యేక పరిస్థితుల్లో శాంతి, భద్రతల సమస్యలు తలెత్తుతాయని సిబిఐ అధికారులు భావించి ఉండవచ్చు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో ఎన్నికల ఫలితాల అనంతరం అవినాష్ రెడ్డి ని అరెస్ట్ చేస్తారని తాను రచ్చబండ కార్యక్రమంలో పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా రఘురామకృష్ణం రాజు ప్రస్తావించారు.

వైయస్ వివేక హత్య కేసులో ఇక అవినాష్ రెడ్డి తప్పించుకోవడం కష్టమే. ఆయన నోరు విప్పితే అనేక నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసును మలుపు తిప్పే ఒక సంఘటన గురించి ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాధాకృష్ణ రాయడం జరిగింది. రాధాకృష్ణ రాసిన వార్తా కథనంపై అటు సాక్షి దినపత్రిక కానీ, ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి , మాజీ, ప్రస్తుత మంత్రులెవరు స్పందించిన దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి తో పాటు గతంలో నవ రత్నాలు, ఎన్నికల మేనిఫెస్టో సమావేశాల్లో పాల్గొన్న ఒక వ్యక్తిని సీబీఐ విచారించిన విషయం జగన్మోహన్ రెడ్డికి, తనకు మాత్రమే తెలుసు.

వైయస్ వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్టు అనంతరం జగన్మోహన్ రెడ్డి ని కూడా పిలిచి విచారించాలి. అయితే గత నాలుగేళ్లుగా సిబిఐ కోర్టుకు హాజరు కాని జగన్మోహన్ రెడ్డి , హైకోర్టు నుంచి విచారణకు హాజరు కావలసిన అవసరమే లేదని ఆర్డర్ తెచ్చుకున్న మహా మనిషి సిబిఐ అధికారులు పిలవగానే వస్తారా? అన్న సందేహాన్ని రఘురామకృష్ణంరాజు వ్యక్తం చేశారు. జూన్ నాటికి కొత్త పేర్లు తెరపైకి వచ్చే అవకాశాలు ఉండడంతో, ఈ హత్య కేసు విచారణకు మరో రెండు నెలల సమయం పట్టవచ్చునని అన్నారు.

సిబిఐ అతి తక్కువ వ్యవధిలో నోటీసు జారీ చేసిందని, తనకు మరో నాలుగు రోజుల గడువు ఇవ్వాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కోరడం హాస్యాస్పదంగా ఉంది. గతంలో తనని అరెస్టు చేసే సమయంలో కనీసం నోటీసు కూడా ఇవ్వకుండానే సీ ఐ డి అధికారులు బలవంతంగా తీసుకువెళ్లి వాహనంలో పడేశారని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు. నాలుగేళ్లుగా సాగుతున్న ఈ కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ్ముడు, ఆయన భార్యకు సమీప బంధువు, సవతి చిన్నాన్న కొడుకు కు నోటీస్ ఇస్తే, సమయం సరిపోలేదా?

కానీ నోటీసు ఇవ్వకుండానే తనని మాత్రం అక్రమంగా నిర్బంధించి ఎత్తుకెళ్లవచ్చా? అంటూ ప్రశ్నించారు. మీ సవతి చిన్నాన్న కొడుకుకు ఒక న్యాయం?, నాకు ఒక న్యాయమా?, కడప చిన్నోడికి ఒక నిబంధన, గోదావరి బుల్లోడు కి మరొక నిబంధన? అంటూ ప్రశ్నించారు. హత్య అభియోగాలను ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని కాపాడడం జగన్మోహన్ రెడ్డికి కూడా కష్టమే. ఇన్నాళ్లు కోర్టులను అడ్డం పెట్టుకొని ఆయన్ని అరెస్టు కాకుండా కాపాడుకోగలిగారు. కానీ ఇప్పుడు, ఆ పరిస్థితులు లేవు.

ఈ కేసులో ఏమి చేసుకుంటారో చేసుకోండి అని సిబిఐ అధికారులకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. వైయస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ తర్వాత వైఎస్ వివేక హత్య కేసులో అరెస్టు అయిన నిందితులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గతంలో జైల్లో ఓం ప్రకాష్, మొద్దు శీను ను హత్య చేశారు. తనని హత్య చేయించాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారు. వైఎస్ వివేక హత్య కేసులో విచారణ అధికారులు రామ్ సింగ్, ప్రస్తుత విచారణ అధికారి వికాస్ కుమార్ బృందం నిందితుల అరెస్టుకు తీవ్రంగానే కృషి చేస్తున్నారు.

ముఖ్యమంత్రి తనకున్న బలంతోనే ఇన్నాళ్లు తన సోదరుడుని అరెస్టు చేయకుండా అడ్డుకున్నారు. తులసమ్మ, సునీల్ యాదవ్ లు భారీ ఫీజులు తీసుకునే లాయర్లను పెట్టుకొని తమ కేసులను వాదించుకోగా లేనిది , అమరావతి రైతులు పెద్ద లాయర్లను ఎలా పెట్టుకోగలుగుతున్నారని సాక్షి దినపత్రిక ప్రశ్నించడం హాస్యాస్పదం. అమరావతి రైతులకు ప్రజలే స్వచ్ఛందంగా చందాలు ఇచ్చారన్నారు. అమరావతి రైతులకు డబ్బులు ఎవరిస్తున్నారని ప్రశ్నించడం ద్వారా వారిని అవమానించిన తీరు దారుణం.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ముఖ్యమంత్రి అవాకులు చవాకులు పేలడం మానుకోవాలి. పవన్ కళ్యాణ్ షూటింగ్లలో బిజీగా ఉంటూ, విరామ సమయంలో రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితం. పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులతో పార్టీని నిర్వహించుకుంటూ నే, కౌలు రైతులకు ఆర్థికంగా సహాయాన్ని అందజేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తండ్రి ఏమి, మీ తండ్రి లాగా ముఖ్యమంత్రి కాదు.

మీలాగా ఆయన ఏమీ పది రూపాయల విలువ చేసే షేరు, 350 రూపాయలకు విక్రయించి కంపెనీలను పెట్టలేదు. అయినా పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ఒక్కసారి వచ్చినా చాలు. ఆయన మాటలు వినడానికి లక్షలాది మంది జనం తరలివస్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ప్రజలపై చెత్త పన్ను తో సహా అన్ని పన్నులు వేస్తున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నాయి. అలాగే పన్నులు కూడా అత్యధికం. బొగ్గు నిలువలను సరిగా పెట్టుకోక, బహిరంగ మార్కెట్లో 12 నుంచి పదిహేను రూపాయలకు కొనుగోలు చేస్తున్న విద్యుత్తు భారం కూడా ప్రజలపైనే మోపు తున్నారని రఘురామకృష్ణంరాజు ధ్వజమెత్తారు.

గోదావరి జిల్లాల ప్రజల పాలిట దేవుడు సర్ ఆర్థర్ కాటన్
ఉభయగోదావరి జిల్లాల ప్రజల పాలిట దేవుడు సర్ ఆర్థర్ కాటన్. ఆయన విగ్రహాలు లేని గ్రామాలు ఉభయగోదావరి జిల్లాలో అరుదు. ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కాటన్ దొర విగ్రహాలను ఏర్పాటుచేసుకున్నారు. ధవలేశ్వరం ఆనకట్ట నిర్మాణం ద్వారా సర్ ఆర్థర్ కాటన్ చేసిన మంచిని శతాబ్దాలు గడిచినా ప్రజలు మర్చిపోవడం లేదన్నారు. రాష్ట్రంలో అన్నింటి పేర్లను మారుస్తున్న జగన్మోహన్ రెడ్డి, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేక సర్ ఆర్ధర్ కాటన్ ధవలేశ్వరం బ్రిడ్జి పేరును మార్చి తన పేరు పెట్టుకోవాలంటూ అపహాస్యం చేశారు.

Leave a Reply