ఏపీలోని ప్రధాన ఆలయాల్లో ఆన్ లైన్ సేవలు ప్రారంభం

అమరావతి: రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఆన్‌లైన్‌ సేవలను దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే శ్రీశైలంలో ఆన్ లైన్ సేవలని నైన్ అండ్ నైన్ సంస్ధ సహకారంతో చేపట్టామని తెలిపారు. శ్రీశైలంలో విజయవంతం‌ కావడంతో ఇపుడు ప్రముఖ దేవాలయాల్లో ఆన్‌లైన్ సేవలు అదే సంస్ధ ఉచితంగా చేపట్టిందన్నారు.

సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు అన్ని దేవాలయాల్లో దశలవారీగా ఆన్‌లైన్ సేవలు విస్తరిస్తామన్నారు. అవినీతిని అరికట్టేందుకు.. పారదర్శత కోసం ఆన్‌లైన్ సేవలు ఉపయోగపడతాయన్నారు. క్యూ లైన్ నిర్వహణ కూడా ఈ యాప్ ద్వారా చేస్తామన్నారు. రూమ్‌లు, దర్శనాలు, సేవలు, ఈ- హుండీ.. ఇలా అన్నీ ముందుగానే ఆన్‌లైన్‌లో భక్తులు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. తొమ్మిది ప్రముఖ దేవాలయాల్లో ఆన్‌లైన్ సేవలు ముందుగా ప్రారంభిస్తున్నామన్నారు.

విజయవాడ కనకదుర్గ ఆలయానికి దసరా మహోత్సవాల కోసం ఆన్‌లైన్ సేవలు ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం, విశాఖపట్నం, శ్రీకాళహస్తి, కాణిపాకం, పెనుగంచిప్రోలులలో కూడా ఆన్‌లైన్ సేవలు మంగళవారం నుంచి ప్రారంభమవుతాయన్నారు. ఆలయ భూములు, ఆభరణాలపై జియో ట్యాగింగ్ చేస్తామన్నారు. ఆన్‌లైన్‌తో పాటే భక్తులు ఆఫ్ లైన్‌లో సేవలు కొనసాగుతాయని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.

Leave a Reply