ఒటిఎస్ వసూళ్లు-పేదల మెడకు ఉరితాళ్లు

154

– రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు

ఓటీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మండల, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎంపిడిఒ, మున్సిపల్, కార్పొరేషన్ కార్యాలయాల ముందు నిరసనలు నిర్వహించటమైంది. మెడలో ఉరి తాళ్లు వేసుకుని వినూత్నంగా నిరసనలు చేశారు. 9672 గ్రామాల నుంచి వచ్చిన 46 వేల మంది టీడీపీ పార్టీ శ్రేణులు వారి వారి మండల కేంద్రం నుంచి ఎంపిడిఒ కార్యాలయాల వరకు బ్యానర్లు, ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ ర్యాలీలు నిర్వహించారు.

అనంతరం ఓటీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఓటీఎస్ బాధితులతో కలిసి 630 ఎంపిడిఒ కార్యాలయాల్లో, 109 మున్సిపల్ కమీషనర్ కార్యాలయాల్లో, 15 కార్పొరేషన్ కార్యాలయాల్లో అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఇళ్ల క్రమబద్ధీకరణకు ఓటీఎస్ పేరుతో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అక్రమ వసూళ్లు పేదలకు ఉరితాళ్లుగా మారాయని మండిపడ్డారు. ఓటీఎస్ బాధితులు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పనిలేదని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీ ఇళ్లను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. ఖజానా నింపుకోవడానికి వన్ టైమ్ సెటిల్ మెంట్ పేరుతో పేదలనుంచి రుణబకాయిలు వసూలు చేస్తూ తనకు సంబంధం లేని ఇళ్లకు జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం అని పేరు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టకపోగా, ఎవరో కట్టిన ఇళ్లకు తన పేరు పెట్టుకోవాలనే విచిత్రమైన ఆలోచనకు కార్యరూపమిచ్చారు. 1983 నుంచి 2011వరకు కట్టిన ఇళ్లకు ఉన్న రుణ బకాయిలు ఇప్పుడు వన్ టైమ్ సెటిల్ మెంట్ చేస్తామని పేదలనుంచి జగన్ రెడ్డి ప్రభుత్వం రూ.4,800 కోట్ల రూపాయలు రాబట్టేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం నుంచి సంక్షేమ పధకాలు పొందటం అనేది ప్రజల ప్రాధమిక హక్కు. రాజ్యాంగం ఇచ్చిన ‍హక్కుల్ని కాలరాసే హక్కు మీకెవరిచ్చారని ప్రశ్నించారు.

సామాన్యులకు సొంతిళ్లు అనేవి సంతోషాలకు ఆనవాళ్లు కానీ నేడు జగన్ రెడ్డి ప్రభుత్వం ఇళ్లంటే వేధింపులకు కేంద్రంగా మార్చింది.పలు ప్రాంతాల్లో ఓటిఎస్ పథకాన్ని అంగీకరించకపోతే పెన్షన్లు తొలగిస్తామని, రేషన్ కార్డులు తీసేస్తామని, పథకాలు కట్ అవుతాయని వాలంటీర్లతో బెదిరించి మరీ పేదలనుంచి డబ్బు గుంజే ప్రయత్నం చేస్తున్నారు. దశాబ్ధాల క్రితం నిర్మించిన ఇళ్లకు ఒన్ టైమ్ సెటిల్ మెంట్ (ఒటిఎస్) పేరుతో రెగ్యులరైజ్ చేసి రిజిస్టర్ చేస్తామని చెప్పడం పేదప్రజలను వంచించడమే. ఎపిఎంలు, సంఘమిత్రలు డ్వాక్రాసంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలు బ్యాంకులద్వారా అప్పులిప్పించి మరీ ఒటిఎస్ సొమ్ము వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.

పేదలకు సంబంధించిన ఇళ్లన్నింటినీ ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాల్సిందిగా టీడీపీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. మాటతప్పను-మడమతిప్పను అనే నినాదంతో నిరుపేద ప్రజలను వంచించి అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోమారు మడమ తిప్పారన్నారు. ఒటిఎస్ చెల్లించాలని గ్రామాల్లో ఎవరైనా వత్తిడి తెస్తే పేదప్రజలు ప్రతిఘటించండి, తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పోలిట్‌బ్యూరో సభ్యులు గుమ్మడి సంధ్యారాణి, కళా వెంకట్రావు, నిమ్మకాయల చినరాజప్ప, ఎన్‌ఎమ్‌డి ఫరూక్, కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, గద్దె రామ్మోహన్, డోలా బాల వీరాంజనేయస్వామి, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, పార్లమెంట్ అధ్యక్షులు కిమిడి నాగార్జున, బుద్దా నాగజగధీష్, తోట సీతారామలక్ష్మి, గన్ని వీరాంజనేయులు, కొనగళ్ల నారాయణ, నెట్టెం రాఘురాం, తెనాలి శ్రావణ్ కుమార్, పార్థసారధి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రులు కిడారి శ్రావణ్, కొండ్రు మురళీ మోహన్, ఆలపాటి రాజా, పల్లె రాఘునాథరెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర, పార్లమెంట్ కమిటీ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.