• తప్పు చేసిన వారిని మాత్రం వదిలిపెట్టదు
• గత ప్రభుత్వం అరాచకాలు మాములుగా లేవు
• మాజీ మంత్రి పేర్ని నానిపై మాకు ఎలాంటి రాజకీయ కక్ష లేదు
• కుట్రలు చేయాల్సిన పని మా కూటమి ప్రభుత్వానికి లేదు
• తప్పు చేయనప్పుడు పెనాల్టీ మొత్తం ఎందుకు కట్టారు?
• భార్య పేరు మీద గోడౌన్ లీజు ఎందుకు తీసుకున్నారు?
• బియ్యం మాయమైతే గోడౌన్ యజమాని మీదే కేసు పెట్టాలి.. పెట్టాం
• రాజానగరంలో మీడియాతో రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
రాజానగరం: ‘కూటమి ప్రభుత్వం ఏ ఒక్కరి మీదా కక్ష సాధింపు చర్యలకు పాల్పడదు. గత ప్రభుత్వం మాదిరి ఎవ్వరినీ వ్యక్తిగతంగా ఇబ్బందిపెట్టం. తప్పు చేసిన వారిని మాత్రం వదిలిపెట్టబోమ’ని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మాజీ మంత్రి పేర్ని నానీపై తమకు ఎలాంటి రాజకీయ కక్ష లేదన్నారు. కుట్రలు చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదని చెప్పారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన తర్వాత ప్రభుత్వంలో అవకాశం ఇచ్చినప్పుడు బాధ్యతగా పనిచేయాలన్నారు.
స్వలాభం కోసం, కుటుంబ ఆస్తులు పెంచుకోవడం కోసం వ్యవస్థల్ని దుర్వినియోగం చేయకూడదన్నారు. గత ఐదేళ్ల పాలనలో వైసీపీ నాయకులు చేసిన అరాచకాలు మాములుగా లేవన్నారు. రాజానగరంలో ఇటీవల వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు బీమా చెక్కులు అందచేసే కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం నాదెండ్ల మనోహర్ గారు మీడియాతో మాట్లాడుతూ.. “ప్రజలు కోరుకున్న సుపరిపాలన సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో వివిధ శాఖల ప్రక్షాళనలో భాగంగా వైసీపీ హయాంలో పౌరసరఫరాల శాఖలో పొరపాట్లు జరిగాయన్న విషయం మా దృష్టికి వచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గోడౌన్లలో బస్తాలు లెక్కపెట్టమని ఆదేశించాము. నవంబర్ 26వ తేదీన సివిల్ సప్లైస్ శాఖ ఎండీ ఆధ్వర్యంలో సమీక్ష జరిగితే అదే రోజు రాత్రి పేర్ని జయసుధ హడావిడి చేసి మా దగ్గర బస్తాల లెక్క తప్పింది. తప్పు మాది కాదు అన్నారు. తర్వాత పొరపాటు ఒప్పుకుంటున్నామని లేఖ రాశారు. పౌరసరఫరాల శాఖ నిబంధనల మేరకు రూ. కోటి 72 లక్షలు కట్టాలని, శాఖాపరంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం, జాయింట్ కలెక్టర్, ఎస్పీలకు లేఖ రాశాం. ఆ రోజు నుంచి వారు మాకు సహకరించలేదు. నోటీసులు ఇచ్చినా స్పందన లేదు. చివరికి పోలీసులు సమక్షంలో పంచనామా చేసి రికార్డులు పరిశీలించి సీజ్ చేయడం జరిగింది.
పేర్ని నాని దీనికి ఏం సమాధానం చెబుతారు? గోడౌన్లను మీ కుటుంబ సభ్యుల పేర్లు మీద పెట్టమని మేము చెప్పామా? పేర్ని నాని తన పేరుమీదే గోడౌన్ ను ఎందుకు లీజుకు తీసుకోలేదు? ఎవరు పేరున గోడౌన్ వుంటే వారిమీద కేసులు నమోదు అవుతాయి. 2021లో అధికారంలో ఉండగా గోడౌన్లు లాక్కుని ప్రభుత్వం నుంచి సంపాదించుకోవాలన్న ఆలోచనతో చేశారు.
ఇక్కడ ప్రక్షాళన మాత్రమే జరుగుతోంది. ఎవరి మీద కక్ష సాధింపు లేదు. గోడౌన్లో మాయమైన బియ్యం ఎక్కడకు వెళ్లాయి అనేది చెప్పాలి. వాళ్లే హడావిడి చేసి, డీడీలు కట్టేసి తప్పు చేశామని నిర్ధారించుకుంటే సరిపోదు. విచారణ పూర్తయ్యాక ఎంత బియ్యం మాయమైతే దానికి పెనాల్టీ కట్టాలి. శాఖాపరంగా క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటారు. ఇటువంటి చర్యల్లో పాల్గొన్న వారిని వదిలిపెట్టే పరిస్థితి లేదు.
ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు ముందుగా పేర్ని నాని ప్రజలకు క్షమాపణ చెప్పాలి. పొరపాటు జరిగిందని లేఖ రాసి ఈ రోజు పరనిందలు ఎందుకు? స్థానికంగా ఉన్న పోలీసు యంత్రాంగం ఇన్వెస్టిగేషన్ చేయాలి. గోడౌన్ యజమాని పేరు మీదే కేసు పెడతారు. జేఎస్ వేర్ హౌస్ యాజమాన్యం మీద కేసు పెడతాము. అలాగే పెట్టాము” అన్నారు.