-అప్పులు చేసి సంపద సృష్టిస్తాం.. ఆ సంపద ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తాం
-మహిళా సంఘాలకు ఐదు సంవత్సరాలలో లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు
-పార్టీలో కష్టపడి పనిచేసిన వారి సమాచారం అధిష్టానం వద్ద సమగ్రంగా ఉంది త్వరలోనే పనిచేసిన వారికి పదవులు
-దేశంలో అధికారంలో ఉన్న బిజెపి కుల గణన చేపట్టాలి
-మేడిగడ్డలో మేట వేసిన ఇసుకను తొలగిస్తేనే మరమ్మతు పనులు
-కేంద్ర బడ్జెట్ ఆధారంగా రాష్ట్ర బడ్జెట్
-విద్యుత్ కొనుగోళ్లపై న్యాయ విచారణ అంటే వారు ఎందుకు ఆందోళన చెందుతున్నారు ?
-తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ ఆలోచనలు అమలు చేస్తున్నాం.
-గాంధీభవన్లో మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
అప్పులు చేస్తాం సంపద సృష్టిస్తాం.. ఆ సంపదను సంక్షేమ పథకాల రూపంలో రాష్ట్ర ప్రజలకు పంచుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. యువనేత, అఖిలభారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా వారి ఆలోచనలు, చూపిన మార్గాన్ని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నుంచి గ్రామస్థాయి కార్యకర్త వరకు ముందుకు తీసుకువెళ్తారు అన్నారు.
భారత్ జూడో యాత్ర ద్వారా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు రాహుల్ గాంధీ భారీ పాదయాత్ర చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ దేశ సంపద వనరులు ఈ దేశ ప్రజలకే చెందాలని, భారతదేశ లౌకిక భావంతో విలసిల్లాలని రాహుల్ గాంధీ ఆశించారు. జనాభా దామాషా ప్రకారం సంపద, పదవులు పంచాలని కుల గణన జరగాలని రాహుల్ గాంధీ చేసిన ఆలోచన విప్లవాత్మకమైనదిగా డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.
కుల గణన చేస్తామని ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ ప్రకటించారు అధికారంలోకి రాగానే ఆ దిశగా కార్యాచరణ చేపట్టామని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి కుల గణన చేపట్టాలని, సంపద వనరులు పంచాలని, పాలనలో భాగస్వామ్యం కల్పించాలని డిప్యూటీ సీఎం డిమాండ్ చేశారు.
ఇంజనీర్లను కాదని అంతా తానేనని కేసీఆర్ కాళేశ్వరం కడితే కూలిపోయింది అన్నారు. మేడిగడ్డలో వేట వేసిన ఇసుకను తొలగిస్తేనే ప్రాజెక్టు మరమ్మత్తులు ప్రారంభమవుతాయని తెలిపారు. కేంద్ర బడ్జెట్ చూసి దాని ఆధారంగా రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతామని తెలిపారు. కేంద్రం చేసే కేటాయింపులకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయన్నారు.
విద్యుత్ కొనుగోలు అంశంపై అసెంబ్లీలో శ్వేత పత్రాన్ని చర్చకు పెట్టగా నాటి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి న్యాయ విచారణ జరగాలని పదేపదే కోరడంతో సభా నాయకుడు రేవంత్ రెడ్డి అంగీకరించారు. ఇప్పుడు విచారణ అంటే వారు ఎందుకు ఆందోళన చెందుతున్నారో, భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.
రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు శ్రమించిన నాయకుల సమగ్ర సమాచారం అధిష్టానం వద్ద ఉంది… త్వరలోనే పదవుల పంపిణీ జరుగుతుందని తెలిపారు.
రైతు రుణమాఫీ అంశానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని ఎవరికి ఎటువంటి అనుమానాలు అవసరం లేదని డిప్యూటీ సీఎం మరోసారి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల ముందు ఇదే విషయాన్ని స్పష్టం చేశారని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు వేయదు అని వారు ప్రచారం చేస్తే మేము వేసి చూపించామని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో స్వయం సహాయక సంఘాలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేస్తామన్నారు