పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయరు(పిఏబిఆర్) నిర్వహణ పట్ల శ్రద్ధపెట్టి, దానికి అవసరమైన మరమ్మత్తులు చేసి, తుంగభద్ర రిజర్వాయరు నుండి 10 టియంసిలను పిఏబిఆర్ కు తరలించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందడం అత్యంత గర్హనీయం.
కె. శ్రీరామకృష్ణయ్య పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయరుగా నామకరణం చేసిన ఈ రిజర్వాయరులో ఒక్కసారి మాత్రమే ఆరు టియంసిలను నిల్వ చేసినట్లు గతంలో ప్రసారమాధ్యమాల్లో వార్త చదివినట్లు గుర్తు. తుంగభద్ర డ్యాం పూడిక వల్ల గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 101 టియంసిలకు పడిపోయింది. గత ఏడాది ఒక గేటు దెబ్బతిన్నది. సాంకేతిక నిపుణులు కన్నయ్యనాయుడు నేతృత్వంలో యుద్ధప్రాతిపదికన కొత్త గేటును ఏర్పాటు చేసి, ఆదుకున్నారు.
మిగిలిన గేట్లకు సత్వరం మరమ్మత్తులు చేయాలని సూచించినా చేయకపోవడం, పర్యవసానంగా ప్రస్తుతం నీటి నిల్వను 80 టియంసిలకు కుదించారు. మరొకవైపున గడచిన రెండున్న నెలల్లోనే తుంగభద్ర నది నుండి శ్రీశైలం జలాశయానికి దాదాపు 150 టియంసిలు చేరాయి. ఈ నేపథ్యంలో కూడా పిఏబిఆర్ లో 3.5 టియంసీ మాత్రమే నిల్వ చేశారు.
పిఏబిఆర్ ను గరిష్ట సామర్థ్యంలో వినియోగించుకోవడంలో వరుస ప్రభుత్వాలు ఎలా విఫలమవుతున్నాయో! ఇదొక ప్రబల నిదర్శనం. గరిష్ట నిల్వ సామర్థ్యాన్ని 5.5 టియంసిలకు కుదించినట్లు విన్నాను. అదే నిజమైతే ఆత్మహత్యాశదృశ్యమే!
పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయరు, యాడికి కాలువ నిర్మాణం కోసం మరియు పిఏబిఆర్ కు తుంగభద్ర రిజర్వాయరు నుండి 10 టియంసిల సాధన కోసం సాగించిన పోరాటాల్లో సిపిఐ మరియు ఏఐఎస్ఏఫ్ ముఖ్యమైన పాత్ర పోషించాయి. అలుపెరగని ఉద్యమాల ద్వారా సాధించుకున్న ప్రాజెక్టు పిఏబిఆర్.
అనంతపురం జిల్లా కూడేరు మండలం కొర్రకోడు గ్రామం సమీపంలో పెన్నా నదిపై 11.10 టియంసి గరిష్ట నిల్వ సామర్థ్యంతో పిఏబిఆర్ ను నిర్మించారు. పిఏబిఆర్ కుడి కాలువ కింద 50,000 ఎకరాలు, యాడికి కాలువ వ్యవస్థ కింద 50,000 ఎకరాలు మరియు చెరువుల కింద 7,500 ఎకరాల స్థిరీకరణకు నీటిపారుదల సౌకర్యం కల్పించడంతో పాటు త్రాగునీరు అందించే లక్ష్యంతో నిర్మించబడింది.
1978లో పిఏబిఆర్ కుడి కాలువ నిర్మాణాన్ని చేపట్టి 1997 నాటికి దాదాపు పూర్తి చేశారు. రెండవ దశ కింద యాడికి కాలువను నిర్మించాలని చాలా కాలం పాటు పోరాటం కొనసాగించాల్సి వచ్చింది. పిఏబిఆర్ వద్ద 40 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తికి మౌలిక సదుపాయాలు కూడా నెలకొల్పబడ్డాయి.
పిఏబిఆర్ మరియు యాడికి కాలువ కోసం సాగించిన ఉద్యమాలకు నాయకత్వం వహించిన అమరజీవి కా.వి.కె. ఆదినారాయణరెడ్దిగారు చిరస్మరణీయులు. నాడు రు.140 కోట్లకుపైగా వెచ్చించి నిర్మించిన పిఏబిఆర్ నీరులేని ప్రాజెక్టుగా పాలకులను వెక్కిరించింది. బచావత్ ట్రిబ్యునల్ కెసి కెనాల్ కు తుంగభద్ర డ్యాం నుండి కేటాయించిన 10 టియంసిలను అత్యంత కరవు పీడిత అనంతపురం జిల్లాలో నిర్మించిన పిఏబిఆర్ కు సర్దుబాటు చేసి, శ్రీశైలం జలాశయం నుండి కెసి కెనాల్ కు 10 టియంసిలను సర్దుబాటు చేయాలన్న కోర్కెను ప్రభుత్వాలు చాలా కాలం పెడచెవిన పెట్టాయి.
కోట్ల విజయభాస్కరరెడ్దిగారు ముఖ్యమంత్రగా ఉన్నప్పుడు, ఆయన “ఎవర్ని అడిగి ఆ ప్రాజెక్టు కట్టారు? ఆ ప్రాజెక్టుకు నీరు ఎక్కడ నుండి యివ్వను? కెసి కెనాల్ ఆయకట్టుకు నష్టం జరుగుతుందంటూ తిరస్కరించారు”. కడప జిల్లాలోని కెసి కెనాల్ ఆయకట్టుదారుల పక్షాన కొందరు గట్టిగా వ్యతిరేకించారు. రాష్ట్ర స్థాయిలో అఖిల పక్ష సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసిన తర్వాత కూడా ఆ సమస్య పరిష్కారం కాలేదు.
ప్రజలు సాగించిన పోరాట ఫలితంగా శ్రీశైలం జలాశయం నుండి 10 టియంసిలను కెసి కెనాల్ కు సర్దుబాటు చేసి, తుంగభద్ర డ్యాం నుండి 10 టియంసిలను పిఏబిఆర్ కు సర్దుబాటు చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెం.3ను జారీ చేసింది. పిఏబిఆర్ వెనుక ఇంత పోరాటాల చరిత్ర ఉన్నా నేటికీ 10 టియంసిలను తుంగభద్ర డ్యాం నుండి నీటిని తరలించక పోవడం ఎంత దుర్మార్గం, ప్రభుత్వాల అసమర్థత, ప్రజలు విజ్ఞతతో నీటి పారుదల ప్రాజెక్టుల సమస్యలపై ఆలోచించమని విజ్ఞప్తి.
ఏఐఎస్ఏఫ్, కమ్యూనిస్టు ఉద్యమం ద్వారా దశాబ్దాల క్రితం ఏర్పడిన అనుబంధంతో మాజీ శాసనసభ్యులు వై. విశ్వేశ్వరరెడ్డి కుమారుడి పెళ్ళికి అనంతపురంకు వెళ్ళిన సందర్భంగా ఆగస్టు 14న పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయరు(పిఏబిఆర్)ను పి. శ్రీనివాసులునాయుడు, వి.కె. రంగారెడ్డి, ఉషా, ప్రశాంతి కొల్లితో కలిసి సందర్శించాను.
అదే రోజు పెన్నా అహోబిలంలో జరిగిన పాత మిత్రుడు రామాంజనేయులు కుమారుని పెళ్ళికి కూడా హాజరయ్యాం. పెన్నా అహోబిలంకు గతంలో రెండు, మూడుసార్లు వెళ్ళాను. ఏఐఎస్ఏఫ్, ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శిగా నేనున్న కాలంలో వారం రోజుల పాటు రాయలసీమ ప్రాంతీయ సైద్దాంతిక – రాజకీయ పాఠశాలను పెన్నా అహోబిలంలో నిర్వహించాం. నాటి స్మృతులను నెమరు వేసుకున్నాను.
– టి. లక్ష్మీనారాయణ
ఆలోచనాపరుల వేదిక