– కల్తీ పాలతో జబ్బులు కొనితెచ్చుకుంటున్నారు
ఆంధ్రప్రదేశ్ లో అమూల్ పాల వెల్లువ కార్యక్రమం మొదలయి మూడు సంవత్సరాలు గడుస్తున్నా జిల్లాలో పాలు లేక దరిద్రం తాండవిస్తుంది. మహిళా పాడి రైతుల సంక్షేమం కోసం అమూల్ ద్వారా పాల సేకరణ, ప్రతి లీటర్ పాలపై ఐదు నుంచి ఏడు రూపాయలు అదనంగా చెల్లించి తీసుకుంటామన్న పథకం జిల్లాలో ఎక్కడా కనబడ్డం లేదు. పాల సేకరణ కోసం ఏఎంసియు, బిఎంసియుల నిర్మాణం జరగలేదు. ఒకప్పుడు చాల కూడళ్లలో చుట్టు ప్రక్కల గ్రామాల నుండి పాల విక్రయ దారులు ఉండేవారు.
వ్యవసాయానికి అనుబంధ రంగమైన పాడి పరిశ్రమ ఒకప్పుడు కళకళలాడేది. ప్రతి ఇంటిలో పది పదిహేను పశువులు ఉండి ఎప్పుడూ పాలు పెరుగు, వెన్న నెయ్యి పుష్కలంగా ఉండేది, ఇప్పుడు గ్రామానికి పది పశువులు లేవు. పల్లెల్లో సైతం పాలు పట్టణాల నుంచి సరఫరా చేసుకుంటున్నారు. గ్రామీణ కూలీలు సైతం ప్యాకెట్ పాలు, పెరుగు వినియోగిస్తున్నారు. నాడు దుర్భిక్ష పరిస్థితుల్లో వర్షాధారంపైనే సాగు చేస్తున్న వ్యవసాయానికి గిట్టుబాటు కాని రోజుల్లోనే పాల సేకరణలో రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచింది.
పాడి ఉత్పత్తి, పాల సేకరణలో గుత్తి, గుంతకల్లు, పామిడి, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, నార్పల, శింగనమల మండలాలు తలమానికంగా ఉండేవి. రోజుకు పది వేల లీటర్ల పాల సేకరణ జరిగేది. ఫలితంగా పాల ఉత్పత్తిపై రైతుల్లో పెరిగిన చైతన్యంతో గ్రామీణ ప్రాంతంలో శ్వేత విప్లవానికి కారణమైంది. దశాబ్ద కాలం నుండి జిల్లాలో పాడి పరిశ్రమ పూర్తిగా విఫలమైయ్యింది. ప్రభుత్వం నుండి పాడి రైతులకు ఆశించినంత ప్రోత్సాహకాలు లేవు. నాలుగు గేదలు పెట్టుకుంటామంటే సమాచారం ఇచ్చే నాథుడే లేడు.
పశువుల దాన, గ్రాసం, మంచి పోషకాలు ఉన్న గడ్డి, వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పట్టించుకునే నాథుడు లేడు. పాల ఉత్పత్తి దిన దినము క్షిణిస్తున్నది. జిల్లాలో హార్టికల్చర్ రైతులకు పేడ ఎరువు దొరకక ప్రక్కనున్న నంద్యాల జిల్లా నుండి ట్రక్కుల ద్వారా అధిక ధరకు తెప్పించుకుంటున్నారు. ఒకప్పుడు అన్ని గ్రామాలలో ఎక్కువగా పశువుల పేడ దొరికేది. డెయిరీల పోటీని తట్టుకొలేక గణనీయంగా పాల ఉత్పత్తిదారుల తప్పుకుంటున్నారు. రవాణా భారం ఎక్కువగా ఉండటంతో పాల సేకరణకు రైతులు విముఖత వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వరంగ సంస్థ విజయ డెయిరీలో పాలు పోసే రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా వడ్డీ లేని రుణాలు, ప్రోత్సాహకాలు ఇచ్చి రైతులకు భరోసా కల్పించాలి. పాలశీతలీకరణ కేంద్రానికి అనుబంధంగా రెండు బల్క్‌మిల్క్ కూలింగ్ (బీఎంసీ) కేంద్రాలు మూతపడ్డాయి. పాడి పశువులను నమ్ముకున్న రైతులకు ప్రభుత్వం అండగా నిలిస్తే పాడి పరిశ్రమ బ్రతుకుతుంది. పాలలో ఉండే కొవ్వు(వెన్న) శాతాన్ని బట్టి ధర నిర్ణయిస్తారు. జిల్లాలో గాయిత్రి, హెరిటేజ్, జెర్సీ, తిరుమల, మదర్, హాట్సాన్ , శ్రీ చక్ర వంటి ప్రైవేట్ డెయిరీలు రోజుకు 20 నుంచి 30వేల లీటర్ల వరకు పాలను సేకరిస్తున్నాయి.
పాడి రైతులకు బ్యాంకుల సహకారంతో రుణాలు ఇప్పించి, ప్రైవేట్ డైయిరీల పోటీ తట్టుకునేందుకు జిల్లా, మండల కేంద్రాలలో పాల ఉత్పత్తుల ఔట్‌లెట్ అమ్మకం కేంద్రాలను ప్రారంభించాలి. తక్షణమే ప్రతి మండలంలో ఇరవై యూనిట్లు యుద్ధ ప్రాతిపదికన పాడి రైతులకు రుణాలు ఇచ్చి పాడి పరిశ్రమ బ్రతికించుకునే ప్రయత్నం చేయాలి, లేకపోతే కల్తీ నాసిరకం పాలతో జబ్బులు కొని తెచ్చుకోవాల్సిందే. కల్తీ పాలతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. పది లీటర్ల పాలలో సగం పాలు తీసేస్తారు.
నీళ్లు, యూరియా, సన్ ఫ్లవర్ ఆయిల్ కలుపుతారు. ఆ తర్వాత మిక్సీలో గ్రైండ్ చేస్తారు. నీళ్ల పాలు చిక్కగా తయారవుతాయి. ఇలా తయారు చేసిన కల్తీ పాలను సిటీ వ్యాప్తంగా సప్లై చేస్తున్నారు. ఇలా చేయడంతో పాల చిక్కదనం పెరిగి, వినియోగదారులు చిక్కటి పాలని అపోహ పడుతుంటారు. అసలు నిజమైన పాలకు ఏం తీసిపోకుండా ఉండడంతో, జనం పట్టించుకోకుండా కొనుగోలు చేస్తున్నారు. ఇవి తాగితే సాధారణ ఆరోగ్య సమస్యల నుంచి క్యాన్సర్ వరకు తీవ్ర స్థాయిలో ఆరోగ్య ముప్పు తప్పప్రైవేటు డైరీలు సుదూర ప్రాంతాల నుంచి పాలు సేకరిస్తున్నారు. పాలు చెడిపోకుండా అడ్డమైన పదార్థాలు కలుపుతుంటారు.
రెండు, మూడు రోజుల కిందట సేకరించిన పాలు హోమోజినైజెడ్, పాశ్చరైజ్డ్ దాదాపు వంద డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద వేడి చేసినప్పుడు అందులో శరీరానికి ఉపయోగపడే బాక్టీరియా అంతరించిపోతుంది. అలాంటి పాలు త్రాగి ప్రయోజనం లేదు. పాలు అధిక సమయం నిల్వ ఉండేందుకు సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్‌లను ఎక్కువ మోతాదులో కలుపుతున్నారు. వీటివల్ల మెదడు, నరాలు దెబ్బతింటాయని, జీర్ణకోశ సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక యూరియా కారణంగా కళ్లు, మెదడుకు హానికరమని ఇకోలీ బ్యాక్టీరియా కారణంగా జీర్ణకోశ వ్యాధులు, సాల్మొనెల్లా బ్యాక్టీరియా కారణంగా టైఫాయిడ్ సమస్యలు వస్తాయంటున్నారు.
పలు డెయిరీల నిర్వాహకులు పాలు తయారు చేసేందుకు నాణ్యత లేని పాలపొడి వినియోగిస్తున్నారు. అది కూడా అపరిశుభ్ర పరిసరాలు పాలు తయారీ సాగుతోంది. దీని వల్ల వివిధ రకాల వైరస్, బ్యాక్టీరియాలు సంక్రమించి రోగాల పాలు కావాల్సి వస్తుందని వైద్యులు చెప్తున్నారు. కల్తీ పాలపై అప్రమత్తంగా లేకపోతే, అంతే సంగతి. కల్తీ పాలు తాగిన పిల్లలు ఎంట్రిక్ ఫీవర్, టైఫాయిడ్, డయేరియా, గ్యాస్ట్రో ఎంటిరైటిస్, కడుపునొప్పి, వాంతులు అవుతాయి.
ఇకోలీ బ్యాక్టీరియాతో వాంతులు, డయేరియా, జీర్ణకోశ వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. పాలను 70 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే అధిక వేడి మీద కొంతసేపు మరిగించినపుడే బ్యాక్టీరియా చనిపోతుంది. ఇక పాలల్లో కల్తీ చేసే పదార్థాలతో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇస్తున్నారు వైద్య నిపుణులు.