– జయసుధను అసెంబ్లీ బరిలో దింపనున్న కిషన్‌రెడ్డి
– ముషీరాబాద్ లేదా సికింద్రాబాద్ అసెంబ్లీ నుంచి పోటీ?
– విజయశాంతికి చెక్ పెట్టే వ్యూహమేనా?
– జయసుధను పార్టీలోకి తెస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి
– కిషన్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డిని వ్యతిరేకిస్తున్న విజయశాంతి
– కిర ణ్ ఉన్న వేదిక నుంచి మధ్యలోనే వెళ్లిన రాములమ్మ
– వెంటనే కిరణ్‌కు వ్యతిరేకంగా విజయశాంతి అస్మమతి ట్వీట్
– దానితో కిరణ్‌పై తెలంగాణ వ్యతిరేకి ముద్ర’ మరింత విస్తృతం
– ముషీరాబాద్‌లో పోటీకి దత్తాత్రేయ బిడ్డ విజయలక్ష్మి సిద్ధం
– ముషీరాబాద్‌లో దత్తాత్రేయ, లక్ష్మణ్‌కు చెక్ పెట్టే ఎత్తుగడ
– సికింద్రాబాద్‌లో జయసుధ రాకపై సీనియర్ల వ్యతిరేకత
– ఆమెకు పనిచేసేది లేదని సీనియర్ల స్పష్టీకరణ
– నాన్ లోకల్స్ వద్దంటూ నాయకత్వానికి లేఖలు
-అప్పట్లో జయసుధపై మేయర్ సహా కార్పొరేటర్లంతా వైఎస్‌కు ఫిర్యాదు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఒకే దెబ్బకు ఎన్నో పిట్టలను కొట్టాలన్న తెలంగాణ బీజేపీ చీఫ్ గంగాపురం కిషన్‌రెడ్డి వ్యూహం బెడిసికొట్టేలా ఉంది. తన సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిథిలోని.. రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను పటిష్టం చేసుకునే ఎత్తుగడతో, ఆయన తీసుకోనున్న నిర్ణయాలు.. బీజేపీలో బూమెరాంగ్ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. అందులో భాగంగా ఆయన.. గవర్నర్ బంగారు దత్తాత్రేయ వర్గం-రెండు నియోజకవర్గాల
సీనియర్లకు దూరమయ్యే ప్రమాదం తెచ్చుకుంటున్నారు. సినీ నటి, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధను బీజేపీలోకి తెచ్చి, ఆమెను ఆ రెండు నియోజకవర్గాల్లో ఒకదానిలో నిలబెట్టి ..పోటీచేయించాలన్న వ్యూహం, పార్టీలో తిరుగుబాటుకు కారణమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఇది ఆ రెండు నియోజకవర్గాల సీనియర్లకు ఆగ్రహం కలిగించి, అది అసమ్మతికి దారితీసేలా ఉంది.
సికింద్రాబాద్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జయసుధ , బీజేపీలో చేరేందుకు ర ంగం సిద్ధమయింది. ఇటీవలే బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆమెను పార్టీలోకి తీసుకురానున్నారు. ఆ మేరకు కిషన్‌రెడ్డి ద్వారా జరిపిన రాయబారాలు ఫలించాయి. దానితో ఆమె కాషాయ కండువా కప్పేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
తనను వ్యతిరేకిస్తున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపి విజయశాంతికి చెక్ పెట్టే వ్యూహంతోనే, కిషన్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే జయసుధను తీసుకువస్తున్నారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇటీవల కిషన్‌రెడ్డి అధ్యక్ష పదవీ ప్రమాణస్వీకార సభ వేదికపై, తెలంగాణను వ్యతిరేకించిన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఉండటాన్ని, విజయశాంతి సహించలేకపోయారు.
‘‘ తెలంగాణ ఏర్పాటును చివరివరకూ వ్యతిరేకించిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్న వేదికను పంచుకోవడం ఇష్టం లేకనే తాను సభ మధ్యలో వెళ్లిపోయాన’’ంటూ విజయశాంతి చేసిన పరోక్ష ట్వీట్ సంచలనం సృష్టించింది. ఇటీవల రాష్ట్రంలో వచ్చిన వరదల సందర్భంలో కూడా ఆమె, కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎక్కడా విమర్శించకపోవడం ప్రస్తావనార్హం. ఇది కూడా చదవండి: కమలంలో విజయ అ ‘శాంతి’
విపత్తు సమయంలో రాజకీయాలు మాట్లాడటం భావ్యం కాదన్నారు. ఓవైపు కిషన్‌రెడ్డి సహా బీజేపీ నేతలంతా, కేసీఆర్ సర్కారును విమర్శిస్తుంటే.. విజయశాంతి మాత్రం ఎక్కడా విమర్శించక పోవడం ప్రస్తావనార్హం.
నిజానికి కిషన్‌రెడ్డితో విజయశాంతికి, మొదటి నుంచీ సఖ్యత లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, సినీరంగానికి చెందిన జయసుధను పార్టీలోకి తీసుకురావడం ద్వారా, విజయశాంతికి చెక్ పెట్టవచ్చన్న వ్యూహం కిషన్‌రెడ్డి నిర్ణయంలో లేకపోలేదని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇది కూడా చదవండి: కమలానికి ‘కిరణ్’ కష్టాలు
అయితే జయసుధ సికింద్రాబాద్ అసెంబ్లీ నుంచి పోటీ చేయనున్నారన్న ప్రచారంతో , అక్కడి నియోజకవర్గ నేతలు అప్రమత్తమవుతున్నారు. నాన్ లోకల్‌ను తీసుకువస్తే పని చేసేది లేదని, నిర్మొహమాటంగా చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటి రాష్ట్ర ఇన్చార్జి ప్రకాష్ జవదేకర్ ఒత్తిడితో.. నాన్ లోకల్ నేతను అభ్యర్ధిగా నిలబెట్టి, తమకు అన్యాయం చేశారని గుర్తు చేస్తున్నారు. ఐదేళ్లు తమతో పనిచేయించుకుని, ఎన్నికలప్పుడు కొత్త వారిని తీసుకువస్తూ తమను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు కూడా నాన్ లోకల్‌ను తీసుకువస్తే సహించేదని, సికింద్రాబాద్ సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. ఆ మేరకు జయసుధను పార్టీలో చేర్చుకున్నప్పటికీ, సికింద్రాబాద్ సీటు మాత్రం ఇవ్వవద్దని.. వారంతా నాయకత్వానికి లేఖ రాసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దానికంటే ముందు.. కిషన్‌రెడ్డితో సికింద్రాబాద్ సీనియర్లంతా భేటీ కావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇది కూడా చదవండి: ‘కిషన్‌రెడ్డి’తో ‘కమలం’ వికసిస్తుందా?
జయసుధ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అనేక సంఘటనలను, వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, నాయకత్వానికి లేఖ రాయనున్నట్లు తెలుస్తోంది. అప్పటి కాంగ్రెస్ మేయర్ బండ కార్తీక రెడ్డి
నాయకత్వంలో కార్పొరేటర్లు, నియోజకవర్గ సీనియర్లు…సిట్టింగ్ ఎమ్మెల్యే జయసుధకు వ్యతిరేకంగా, సీఎం వైఎస్‌ను కలసి ఫిర్యాదు చేశారు.
ఆమె ఎవరితోనూ సమన్వయం చేసుకోకుండా, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్, పోలీసు బదిలీల సందర్భంగా ఆమె చేసిన సిఫార్సు లేఖల విషయంలో, వెలుగుచూసిన వ్యవహారాలను కూడా.. వైఎస్‌కు ఫిర్యాదు చేసిన విషయాన్ని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
సికింద్రాబాద్‌లో క్రైస్తవులు ఎక్కువగా ఉన్నందున, క్రైస్తవురాలయిన జయసుధను బరిలోకి దింపాలన్న
యోచన హాస్యాస్పదమని బీజేపీ సీనియర్లు అంటున్నారు. నాడు కాంగ్రెస్ అభ్యర్ధిగా ఉన్నందుకే క్రైస్తవులు-ముస్లింలు ఆమెను గెలిపించారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తే, ఆ రెండు వర్గాలు జయసుధకు ఎలా ఓటు వేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ మాత్రం లాజిక్ కూడా తమ నాయకత్వానికి లేదా అని ప్రశ్నిస్తున్నారు.
నిజంగా జయసుధకు సికింద్రాబాద్‌లో జనాదరణ ఉంటే, 2009లో గెలిచిన ఆమె.. 2014 ఎన్నికల్లో ఎందుకు ఘోరంగా ఓడిపోయారని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. ఓడిన ఈ పదిహేనేళ్లలో, ఒక్కసారి కూడా సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాలుపెట్టలేదని గుర్తు చేస్తున్నారు.
ఆ ఎన్నికల్లో ఓడిన జయసుధ.. టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గరకు వెళ్లి పసుపు కండువా, వైఎస్సార్సీపీ
అధినేత జగన్ వద్దకు వెళ్లి వైసీపీ కండువా కప్పేసుకున్న వైనాన్ని విశ్లేషిస్తున్నారు. ఐదేళ్లలో ఇన్ని పార్టీలు మారిన జయసుధను.. విద్యాధికులు ఎక్కువగా ఉండే, సికింద్రాబాద్ ప్రజలు ఎలా ఆదరిస్తారని ప్రశ్నిస్తున్నారు.
ఇక అటు క్రైస్తవ- దళిత-మైనార్టీల సంఖ్య ఎక్కువగా ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి, పోటీ చేయించే యోచన కూడా ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కుదిరితే సికింద్రాబాద్ లేకపోతే ముషీరాబాద్ నుంచి పోటీ చేయించే వ్యూహంతోనే, ఆమెను పార్టీలోకి తీసుకువస్తున్నారని బీజేపీ సీనియర్లు వివరిస్తున్నారు.
అయితే ముషీరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా.. గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మిని బరిలో దింపాలని, చాలాకాలం నుంచే ప్రచారం జరుగుతోంది. ఆ మేరకు ఆమె, అక్కడ జరిగే పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. పార్టీకి సుదీర్ఘ కాలం నుంచీ సేవచేస్తున్న పేద కార్యకర్తలకు, విజయలక్ష్మి ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు.
స్థానిక మాజీ ఎమ్మెల్యే, బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ కూడా దత్తాత్రేయ కుమార్తెకే మద్దతునిస్తున్నారు. ఈ క్రమంలో జయసుద పేరు ముషీరాబాద్కూ వినిపించడంతో, అక్కడి బీజేపీ నేతలు ఆమె రాకపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులకే సీట్లు ఇవ్వాలంటూ గళం విప్పుతున్నారు.
అయితే తన లోక్‌సభ నియోజకవర్గ పరిథిలో చాలా కాలం క్రితమే, బండారు దత్తాత్రేయ వర్గాన్ని పక్కనపెట్టిన కిషన్‌రెడ్డి.. ముషీరాబాద్‌లో కూడా తన వ ర్గీయుడినే నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు, పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొదటినుంచీ దత్తాత్రేయ-కిషన్‌రెడ్డి వర్గాలకు సఖ్యత లేని విషయం తెలిసిందే.